ఐపీఎల్‌లో సూపర్‌ఫామ్‌లో ఉన్న చెన్నై… మరోసారి జైత్రయాత్రను కంటిన్యూ చేసింది. యూఏఈ వేదికగా బెంగళూర్‌ను మట్టికరిపించింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శనతో కోహ్లీ టీమ్‌ను ఓడించింది. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది చెన్నై. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే 18.1 ఓవర్లలో చేధించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ ఆకట్టుకున్నారు. రన్‌రేట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. వీరిద్దరు ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ, అంబటిరాయుడు ఇన్నింగ్స్‌ను నిర్మించారు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రైనా, ధోనీ జట్టుకు విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో 9 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించి.. రెండు ఓటములతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఆర్‌సీబీ 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. నాలుగు ఓటములతో 10 పాయింట్లతో మూడో స్థానంలోనే ఉంది. అంతకముందు ఆర్‌సీబీ 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్లు కోహ్లి, పడిక్కల్ దుమ్ములేపారు. వీరిద్దరు క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరు శుభారంభం ఇచ్చినప్పటికీ ఆ తర్వాత వచ్చినవారంతా విఫలమయ్యారు. ఫలితంగా తక్కువ స్కోరుకే పరిమితమైంది బెంగళూర్.