తెలుగు బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ తన వ్యక్తిగత జీవితం గురించి షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది, తన ప్రియుడు విజయ్ కార్తీక్‌తో నిశ్చితార్థం జరిగి, పెళ్లి పీటలు ఎక్కబోతున్న తరుణంలో ఆమె తన రిలేషన్‌షిప్‌కు ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ విషయాన్ని గురించి కీర్తి భట్ తన పోస్ట్‌లో చాలా స్పష్టంగా, హుందాగా స్పందించారు, “నా జీవితంలోని ఒక ముఖ్యమైన బంధం ఇప్పుడు ముగిసింది. ఆ బంధం చాలా కాలం సాగింది, అది నిజమైనదే.. కానీ ఒక జీవిత భాగస్వామిగా లేదా భర్తగా ఉండాల్సిన ఆ భావన మాత్రం మా మధ్య కలగలేదు” అని పేర్కొన్నారు. పరస్పర గౌరవంతో ఈ బంధాన్ని స్నేహంగా మార్చుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు.
Also Read :Janatha Bar: హిందీలోకి లక్ష్మీ రాయ్ ‘జనతా బార్’
తమ బ్రేకప్ గురించి వస్తున్న, రాబోయే రూమర్ల పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు, “జీవితం ఇప్పుడు ఒక యుద్ధం లాంటిది. నేను హుందాగా, దృఢంగా నిలబడతాను, రాజీ పడే జీవితం కంటే నా సంతోషమే నాకు ముఖ్యం. దయచేసి ఊహలతో అపోహలు సృష్టించకండి” అని తన అభిమానులను కోరారు. కీర్తి భట్, విజయ్ కార్తీక్‌ల నిశ్చితార్థం 2023 ఆగస్టులో జరిగింది. దాదాపు రెండున్నరేళ్ల నిరీక్షణ తర్వాత వీరు పెళ్లి చేసుకుంటారని ఫ్యాన్స్ భావించారు, నిశ్చితార్థం తర్వాత కూడా వీరిద్దరూ కలిసి అనేక టీవీ షోలలో సందడి చేశారు. కానీ, ఇటీవలి కాలంలో వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, అందుకే పెళ్లి ఆలస్యమవుతోందని చర్చలు జరిగాయి. ఇప్పుడు కీర్తి స్వయంగా ఈ బంధం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆ చర్చలకు ఫుల్ స్టాప్ పడింది, కీర్తి భట్ గతంలో తన కుటుంబాన్ని ఒక ఘోర ప్రమాదంలో కోల్పోయి అనాథగా మారిన సంగతి తెలిసిందే. తన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి, ఇప్పుడు కూడా ఒంటరి పోరాటం చేస్తున్న ఆమెకు నెటిజన్లు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. గతంలో దీప్తి సునైన తర్వాత ఇప్పుడు మరో బిగ్ బాస్ నటి బ్రేకప్ చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది.