IPL 2023: ఐపీఎల్‌కు ఇంకా చాలానే సమయం ఉంది. అయినా పలు జట్లు ఇప్పటి నుంచే టైటిల్ వేటను ప్రారంభించాయి. ఈ సందర్భంగా పలు మార్పులను చేపట్టాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఐపీఎల్ సీజన్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు కోచ్ మారనున్నాడు. ఇప్పటివరకు కేకేఆర్ హెడ్ కోచ్‌గా సేవలు అందించిన న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెక్‌కల్లమ్ ఇటీవల ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో కేకేఆర్ కొత్త కోచ్‌ను నియమించింది. ఈ మేరకు టీమిండియా మాజీ క్రికెటర్‌కు అవకాశం కల్పించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త కోచ్‌గా దిగ్గజ రంజీ కోచ్ చంద్రకాంత్ పండిట్‌ను నియమించింది. రంజీ క్రికెట్‌లో కోచ్‌గా చంద్రకాంత్ పండిట్‌కు అపార అనుభవం ఉంది. ఈ ఏడాది జరిగిన రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ తొలిసారి విజేతగా అవతరించడంలో చంద్రకాంత్ పండిత్ కీలకపాత్ర పోషించాడు.
చంద్రకాంత్ పండిట్ టీమిండియా తరపున 1986-92 వరకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరపున ఆయన 5 టెస్టులు, 23 వన్డేలు ఆడాడు. టీమిండియా తరఫున తక్కువ మ్యాచ్‌లు ఆడినా దేశవాళీ క్రికెట్‌లో కోచ్‌గా అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఆయన రంజీ కోచ్‌గా అవతారం ఎత్తిన తర్వాత ముంబై (2002-03, 2003-04, 2015-16) మూడు సార్లు, విదర్భ (2017-18, 2018-19) రెండుసార్లు రంజీ ఛాంపియన్‌గా నిలిచాయి. ఈ ఏడాది మధ్యప్రదేశ్ కూడా చంద్రకాంత్ నేతృత్వంలోనే తొలిసారిగా రంజీ టైటిల్ సాధించింది.
Read Also: అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు
కాగా కోచ్ మార్పు విషయాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ సీఈవో వెంకీ మైసూర్ అధికారికంగా ప్రకటించారు. దేశవాళీ క్రికెట్‌లో దిగ్గజ కోచ్‌గా పేరొందిన చంద్రకాంత్ పండిట్ కేకేఆర్ ఫ్యామిలీలోకి రావడం తమను ఉత్సాహపరుస్తోందని వెల్లడించారు. కోచ్ పాత్రలో ఆయన తమ జట్టును విజయవంతంగా నడిపించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రికెట్ పట్ల చంద్రకాంత్ పండిట్‌కు ఉన్న అంకితభావం, నిబద్ధత మరెవరికీ లేవన్నారు. తమ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు కోచ్‌గా చంద్రకాంత్ విలువైన సలహాలు ఇస్తూ ఐపీఎల్ టైటిల్ అందించాలని కోరుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు.