Bangladesh Won Match Against India: భారత జట్టుతో చివరివరకూ ఉత్కంఠభరితంగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఒక వికెట్ తేడాతో గెలిచింది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని.. ఒక వికెట్ మిగిలుండగా, 46 ఓవర్లలో బంగ్లాదేశ్ చేధించింది. మొదట్లో లిటన్ దాస్ (41), చివర్లో మెహదీ హసన్ (38) రాణించడంతో.. బంగ్లా ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మన భారత ఫీల్డర్లు సైతం కీలకమైన మ్యాచ్‌లు వదిలేసి.. వారికి విజయాన్ని కట్టబెట్టారు. నిజానికి.. 136 పరుగులకి బంగ్లా 9 వికెట్లు కోల్పోవడంతో, ఇక భారత్‌దే విజయమని మొదట్లో అంతా అనుకున్నారు. కానీ.. మెహదీ హసన్ చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి, భారత్ చేతి నుంచి ఆ విజయాన్ని లాక్కున్నాడు. చివరి వికెట్ తీసేందుకు భారతీయ బౌలర్లు విశ్వప్రయత్నాలు చేశారు కానీ, మెహదీ హసన్ వికెట్ భారత్ ఆశలపై నీళ్లు చల్లేశాడు.
తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. భారత్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. టాపార్డర్‌లో అందరూ అనుభవజ్ఞులే ఉండటంతో, భారత్ పరుగుల వర్షం కురిపిస్తుందని భావించారు. కానీ, ఆ అంచనాలకు భిన్నంగా టాపార్డర్ విఫలమైంది. బంగ్లా బౌలర్ల ధాటికి ప్రధాన ఆటగాళ్లంతా ఎక్కువసేపు నిలబడలేక, తమ వికెట్లు సమర్పించుకున్నారు. రోహిత్ శర్మ (27), ధవన్ (7), కోహ్లీ (9), శ్రేయస్ (24) వరుసగా ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాట పట్టారు. దీంతో.. భారత్ కష్టాల్లో పడింది. అప్పుడు కేఎల్ రాహుల్ ఆపద్బాంధవుడిలా భారత్‌ని కాపాడాడు. ఒంటరి పోరు కొనసాగించి, భారత్ స్కోర్ బోర్డుని ముందుకు నడిపించాడు. ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా, మరోవైపు కేఎల్ రాహుల్ ఒత్తిడికి గురవ్వకుండా.. ఆచితూచి ఆడుతూ, వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు బాదుతూ వచ్చాడు. దీంతో.. 70 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సుల సహాయంతో 73 వ్యక్తిగత పరుగులు సాధించాడు. అతడు ఔటయ్యాక భారత్ పూర్తిగా కుప్పకూలింది. ఫలితంగా.. 41.2 ఓవర్లలో 186 పరుగులకే భారత్ ఆలౌట్ అయ్యింది.
187 పరుగుల లక్ష్యం పెద్దదేమీ కాదు కాబట్టి.. బంగ్లాదేశ్ సునాయాసంగా ఈ లక్ష్యాన్ని చేధిస్తారని మొదట్లో భావించారు. ఓపెనర్ శాంతో సున్నాకే ఔటైనా.. లిటన్ దాస్ (41) బాగానే రాణించడంతో, మ్యాచ్ త్వరగా ముగుస్తుందని అంచనా వేశారు. కానీ, భారత బౌలర్లు అనూహ్యంగా మలుపు తిప్పారు. కట్టుదిట్టమైన బౌలింగ్ వేస్తూ, వరుస వికెట్లు తీస్తూ.. బంగ్లా ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెట్టారు. 136 పరుగులకే 9 వికెట్లు పడగొట్టారు. ఇంకేముంది.. టీమిండియాదే విజయం తథ్యమని ఫిక్సైపోయారు. కానీ, మెహదీ హసన్ (39 బంతుల్లో 38) ఆ అంచనాల్ని తిప్పేశాడు. చివరివరకు ఒంటరి పోరు కొనసాగించి.. తన జట్టుని గెలిపించాడు. ఈ గెలుపుతో.. మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.