ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ లో భారత పురుషుల జట్టును దురదృష్టం వెంటాడింది. సూపర్ 4 లో భాగంగా మంగళవారం దక్షిణ కొరియా తో జరిగిన మ్యాచ్ ను భారత జట్టు 4-4తో డ్రాగా ముగించింది. తప్పక గెలవాల్సిన చోట భారత్ జట్టు మ్యాచ్ ను డ్రా చేసుకోవడంతో గోల్స్ తేడాతో ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయింది. మరో మ్యాచ్ లో జపాన్ పై మలేసియా విజయం సాధించింది. దాంతో మలేసియా, దక్షిణ కొరియా, భారత్ జట్లు తలా ఐదు పాయింట్లతో సమంగా నిలిచాయి. కానీ, గోల్స్ డిఫరెన్స్ లో భారత్ కంటే కూడా మలేసియా, దక్షిణ కొరియా జట్లు మెరుగ్గా ఉండటంతో ఆ రెండు జట్లు ఫైనల్ కు చేరాయి. భారత్, జపాన్ జట్లు సూపర్ 4తోనే తమ ప్రస్థానాన్ని ముగించాయి. రేపు మూడో స్థానం కోసం జపాన్ తో భారత్ తలపడనుంది.
భారత తరపున నీలమ్ సంజీప్, దిప్సన్ టిర్కీ, మహేశ్, శక్తివేల్ మరీశ్వరణ్ తలో గోల్ నమోదు చేశారు. కొరియా జట్టులో జాంగ్ జాంగ్యూన్, జీ వూ చియోన్, కిమ్ జంగ్ హూ, జంగ్ మాంజే లు కలిసి తలో గోల్ చేసి భారత్ విజయాన్ని అడ్డుకున్నారు.