న్యూజిల్యాండ్ బౌలర్ అజాజ్ పటేల్ గుర్తున్నాడా? క్రికెట్ ప్రియులకు కచ్ఛితంగా గుర్తుంటాడు. గతేడాది డిసెంబర్‌లో వాంఖడే వేదికగా టీమిండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా మొదటి ఇన్నింగ్స్‌లో అజాజ్ పది వికెట్లు తీసి చరిత్రపుటలకెక్కాడు. ఏ జెర్సీతో అయితే అతడు ఆ ఫీట్ సాధించాడో, ఇప్పుడదే జెర్సీని వేలం వేయబోతున్నాడు. దీని వెనుక దాగి ఉన్న ఓ చిన్న కథను కూడా అతడు రివీల్ చేశాడు
గతేడాది తన కూతురు ఆరోగ్య సమస్యతో బాధపడగా, న్యూజిల్యాండ్‌లోని స్టార్‌షిప్ చిల్డ్రన్ ఆసుపత్రిలో చికిత్స అందించాడు. మంచి వైద్యం అందించడంతో, అతని కూతురు తొందరగానే రికవరీ అయ్యింది. దీంతో తన కూతుర్ని బాగు చేసిన ఆ ఆసుపత్రికి ఏదో ఒకటి చేయాలని ఫిక్సయ్యాడు. ఈ క్రమంలోనే ఆ ఆసుపత్రిలోని రేడియాలజీ విభాగం చిన్న పిల్లల చికిత్స కోసం ఫండ్స్ కలెక్ట్ చేయడాన్ని ప్రారంభించిందని ఎజాజ్‌కు తెలిసింది. దీంతో తాను 10 వికెట్ల ఫీట్ సాధించిన రోజు వేసుకున్న జెర్సీని వేలానికి వేయాలని ఫిక్సయ్యాడు. ఈ జెర్సీపై కొందరి లెజెండ్స్ సంతకాలున్నాయి. ఈ వేలం బుధవారం (మే11) ముగియనుంది.
కాగా.. ఆ టెస్ట్ మ్యాచ్‌లో అజాజ్ తన బంతితో మాయం చేసినప్పటికీ న్యూజిల్యాండ్ జట్టు ఓటమీ పాలయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 325 పరుగులకి ఆలౌట్ అవ్వగా, ఆ తర్వాత కివీస్ జట్టు 65 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ ఆడిన భారత్ 276 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా న్యూజిల్యాండ్ మందు 540 పరుగుల భారీ లక్ష్యం ముందుంచింది. కివీస్ 167 పరుగులకే తట్టాబుట్టా సర్దేసింది. అయితే.. అజాజ్ మాత్రం ఒకే ఇన్నింగ్స్ 10 వికెట్లు తీసి, చరిత్ర సృష్టించాడు.