2026 టీ20 వరల్డ్ కప్‌కు బెస్ట్ ప్లేయింగ్ XIను సిద్ధం చేయడమే తమ మెయిన్ టర్గెట్ అని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ చెప్పాడు. 2024 టీ20 వరల్డ్ కప్ తృటిలో చేజారిందని, ఈసారి మెగా టోర్నీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. సౌతాఫ్రికా 20, వరల్డ్‌కప్ సన్నాహక సిరీస్‌లతో బిజీ షెడ్యూల్ ఉందని.. ప్రతి ఆటగాడికీ తగిన అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. తుది జట్టుపై నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడూ అంత సులభం కాదని.. ఒక ఆటగాడు 3–4 మ్యాచ్‌లు వరుసగా ఆడితేనే మూమెంటమ్ వస్తుందని మార్‌క్రమ్ చెప్పుకొచ్చాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో టీ20లో టీమిండియాపై సఫారీలు 51 పరుగుల తేడాతో గెలిచారు.
మ్యాచ్ అనంతరం ఐడెన్ మార్‌క్రమ్ మాట్లాడుతూ… ‘ఈరోజు బాగా ఆడాం. క్విన్నీ (క్వింటన్ డికాక్) నుంచి వచ్చిన ఇన్నింగ్స్ మాకు సానుకూలాంశం. కొన్ని భాగస్వామ్యాలు మంచి స్కోర్ అందించాయి. బౌలర్లు మొదటి మ్యాచ్‌లో కూడా బాగా బౌలింగ్ చేశారు. ఈరోజు ఇంకా మెరుగ్గా బంతులు వేశారు. మా బౌలర్లు సరైన దిశలో దూసుకుపోతున్నారు. ఇది జట్టుకు శుభసూచకం. ఫీల్డింగ్ కూడా రెండు మ్యాచ్‌లలో అద్భుతంగా ఉంది. బంతి కొత్తగా ఉన్నప్పుడు బౌలర్లకు మంచి సహకారం లభించింది. అయితే డికాక్, తిలక్ వర్మ వంటి బ్యాటర్లు ఎప్పుడైనా చెలరేగుతారు, బౌలర్లపై ఒత్తిడి పెంచుతారు. ఇది మంచి వికెట్, ఈ మైదానంలో రెండు జట్లకు సమాన విజయావకాశాలు ఉన్నాయి’ అని చెప్పాడు.
Also Read: T20 World Cup 2026 Tickets: డెడ్ చీప్‌గా ప్రపంచకప్ టికెట్లు.. అస్సలు ఊహించలేరు, బుకింగ్స్ ఓపెన్!
ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడం గురించి ఐడెన్ మార్‌క్రమ్ మాట్లాడుతూ… ‘జట్టులో ఏ స్థానంలో ఆడడానికైనా నేను సిద్ధం. గత కొన్నేళ్లుగా నేను మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్నాను. టాప్ ఆర్డర్‌లో ఉన్న ముగ్గురు బాగా ఆడుతున్నారు. నేను మిడిల్ ఆర్డర్‌లో వస్తున్నా. జట్టు ప్రయోజనాల కంటే ఏదీ ముఖ్యం కాదు. అందరం అదే భావనతో ఆడుతాం. నేడు నేను ఆడిన ఇన్నింగ్స్‌లో ఇంకా బాగా ఆడాల్సిన బంతులు ఉన్నాయి. ఆ విషయంపై నేను దృష్టి పెడుతా. ప్రతి మ్యాచ్ నుంచి మనం నేర్చుకోవాలి. మూడో మ్యాచ్‌కు మరింత బాగా సిద్దమవుతాం’ అని ఐడెన్ మార్‌క్రమ్ పేర్కొన్నాడు.