Site icon NTV Telugu

T20 World Cup: మెగా టోర్నీ ఫైనల్‌పై డివిలియర్స్ జోస్యం.. ఆ రెండు జట్ల మధ్యే తుదిపోరు

Ab De Villiers

Ab De Villiers

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో దాయాదులు తలపడితే మరోసారి చూడాలని క్రికెట్ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. క్రికెట్‌లో భారత్-పాకిస్థాన్ తలపడుతుంటే ఆ మ్యాచ్ ఇచ్చే మజానే వేరు. అందులోనూ పాకిస్థాన్‌ను టీమిండియా ఓడిస్తే సంబరాలే సంబరాలు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటికే ఈ రెండు జట్లు తలపడగా ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. ఇప్పుడు మెగా టోర్నీ నాకౌట్ దశకు చేరుకోవడంతో మరోసారి ఇండియా, పాకిస్థాన్‌ తలపడితే చూడాలని ఇరు దేశాల అభిమానులు కోరుకుంటున్నారు. ఆ అవకాశం కూడా ఉండటంతో ఫైనల్ పోరులో భారత్, పాకిస్థాన్ జట్లను చూడాలని ఆకాంక్షిస్తున్నారు. 2007 ప్రపంచకప్ నాటి మధుర క్షణాలను మరోసారి ఆస్వాదించాలని తాపత్రయపడుతున్నారు.

Read Also: T20 World Cup: టీమిండియాతో సెమీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు దెబ్బ మీద దెబ్బ

సాధారణ క్రికెట్‌ అభిమానులే కాదు దక్షిణాఫ్రికా లెజెండరీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ కూడా ఇండియా, పాకిస్థాన్‌ మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్ జరగాలని బలంగా కోరుకుంటున్నాడు. అందుకే అతడు తన ట్విటర్‌ అకౌంట్‌లో ఓ పోల్‌ కూడా నిర్వహించాడు. ఇండియా, పాకిస్థాన్‌ మధ్య ఫైనల్‌ జరుగుతుందా లేదా అని పోల్ నిర్వహించగా.. ఏకంగా 77 శాతం మంది అవును అని సమాధానం ఇచ్చారు. ఈ పోల్ ఫలితాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ తాను కూడా ఇదే జరగాలని కోరుకుంటున్నట్లు డివిలియర్స్ చెప్పాడు. కాగా ఈనెల 9న న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య తొలి సెమీస్, ఈనెల 10న భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీస్ జరగనున్నాయి. తొలి సెమీస్‌లో పాకిస్థాన్, రెండో సెమీస్‌లో టీమిండియా గెలిస్తే అభిమానుల ఆకాంక్ష నెరవేరుతుంది. మరి ఏం జరుగుతుందో మరో రెండు రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది.

Exit mobile version