ఐపీఎల్‌లో ఆదివారం రాత్రి బెంగళూరు, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి మజాను అందించింది. ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 205 పరుగులు చేసింది. దీంతో ఈ స్కోరును అంతంత మాత్రంగా బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న పంజాబ్ అందుకోలేదని అందరూ భావించారు. అయితే పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు అద్భుతం చేసి చూపించారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా అందరూ దంచికొట్టారు. దీంతో కొండంత స్కోర్ కూడా కరిగిపోయింది. చివరకు ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఆ జట్టు లక్ష్యాన్ని చేరుకుని వాహ్ అనిపించింది.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు ఓ సినిమా చూశారని.. ఆ సినిమా ఇచ్చిన స్ఫూర్తితోనే ఆటగాళ్లు ధనాధన్ క్రికెట్ ఆడి మ్యాచ్‌ను గెలిపించారనే టాక్ వినిపిస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు తాము 14 పీక్స్ అనే నేపాలీ ఇంగ్లీష్ సినిమా చూశామని పంజాబ్ ఆటగాడు ఒడియన్ స్మిత్ స్వయంగా వెల్లడించాడు. కోచ్ అనిల్ కుంబ్లే తమకు ఈ సినిమాను స్పెషల్‌గా స్క్రీనింగ్ చేయించారని తెలిపాడు. ఈ మూవీ తమను ఎంతో ప్రభావితం చేసిందని స్మిత్ పేర్కొన్నాడు.
అయితే 14 పీక్స్ అనే సినిమా ఏడు నెలల కాలంలో మౌంట్ ఎవరెస్ట్ సహా 14 అత్యున్నత పర్వతాలను అధిరోహించడం అనే పాయింట్ మీద తెరకెక్కింది. ట్యాగ్‌లైన్ నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. పర్వతాలను అధిరోహించడంలో ఎదురైన కష్టాల గురించి ఈ సినిమాలో చూపించారు. ఈ పాయింట్ పంజాబ్ ఆటగాళ్లను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మ్యాచ్ 18వ ఓవర్‌లో ఒడియన్ స్మిత్ రెచ్చిపోయాడు. సిరాజ్ వేసిన ఓవర్‌లో బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో పంజాబ్ సునాయాసంగా మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.