క్రికెట్ లవర్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది ఐసీసీ. టీ20 ప్రపంచ కప్ డ్రాను విడుదల చేసింది. ఇండియా, పాకిస్థాన్ ఒకే గ్రూపులో చోటు సంపాదించాయి. దీంతో లీగ్ దశలోనే దాయాదుల పోరు ఉంటుంది. ఇధి అభిమానులకు పండుగనే చెప్పాలి..!
యూఏఈ, ఒమన్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరుగబోయే టీ20 ప్రపంచకప్ 2021 డ్రాను ఐసీసీ విడుదల చేసింది. ఇందులో మొత్తం ఎనిమిది జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించగా, మరో ఎనిమిది జట్లు క్వాలిఫయర్స్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. రెండు రౌండ్లుగా ఈ మెగా టోర్నీ జరగనుండగా.. తొలి రౌండ్‌లో క్వాలిఫయర్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. రెండో రౌండ్‌లో సూపర్-12 పద్దతిలో లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
12 దేశాలను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఇక టోర్నీ లీగ్ దశలోనే భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఎందుకంటే రెండు దాయాదీ దేశాలు గ్రూప్ 2లో ఉన్నాయి. భారత్, పాకిస్థాన్‌తో పాటు న్యూజిలాండ్ ఆఫ్గానిస్థాన్ గ్రూప్2లో ఉండగా.. మరో రెండు దేశాలు క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు ఆడి చోటు దక్కించుకోనున్నాయి.ఇక డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు గ్రూప్ 1లో ఉన్నాయి. 2021 మార్చి 20 నాటి టీమ్ ర్యాంకింగ్స్ ఆధారంగా గ్రూప్స్‌ను విభజించింది ఐసీసీ.
గ్రూప్-2లో మాజీ చాంపియన్స్ భారత్, పాకిస్థాన్‌తో పాటు న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్‌లు ఉన్నాయి. మరో రెండు క్వాలిఫయర్స్ టీమ్ జతకానున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్‌తో పాటు మొత్తం 8 జట్లు క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లను కూడా రెండు గ్రూపులుగా విభజించడం జరిగింది. ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమిబియా, శ్రీలంక గ్రూప్-ఏలో ఉండగా.. ఓమన్, స్కాట్లాండ్, పీఎన్‌జీ, బంగ్లాదేశ్ గ్రూప్‌బీలో ఉన్నాయి.
భారత్-పాక్ మధ్య నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత మరోసారి భారత్-పాక్‌లు టీ20 ప్రపంచకప్ లీగ్ దశలోనే తలపడనున్నాయి.