(జూన్ 26న ఉదయ్ కిరణ్ జయంతి)
చీకటిని చీల్చేస్తాయి ఉదయకిరణాలు. పడమటి సంధ్యారాగం వినిపించగానే ఆ కిరణాలు సైతం కరిగిపోతాయి. అప్పట్లో ఎంతో క్రేజ్ సంపాదించిన ఉదయ్ కిరణ్ జీవితం తొలి సంధ్యలోని కిరణాల్లా వెలిగి, మలి సంధ్యలోని మసక ముందు ఓడిపోయింది. ఆరంభంలోనే వరుసగా “చిత్రం, నువ్వు-నేను, మనసంతా నువ్వే” చిత్రాల ద్వారా అనూహ్య విజయాన్ని అందుకున్నారు ఉదయ్ కిరణ్. ఈ మూడు చిత్రాలు ఒకదానిని మించి మరొకటి విజయం సాధించింది. నిజంగా పేరుకు తగ్గట్టే ఉదయ్ కిరణ్ నటజీవితం కాంతిమంతంగా సాగిందనే చెప్పాలి.
ఆ తరువాతనే అతని జీవితంలో వెలుగులు తరిగాయి. మసకలు పెరిగాయి. పలు పరాజయాలు పలకరించడంతో ఉదయ్ కిరణ్ నటజీవితం కాంతిహీనంగా మారిపోసాగింది. అదే సమయంలో ఉదయ్ జీవితంలోనూ అనుకోని పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాంతో ఉదయ్ కిరణ్ మానసికంగానూ బలహీనుడై పోయారు. వివాహమయిన తరువాత ఉదయ్ కిరణ్ జీవితం మేలి మలుపు తిరుగుతుందని అభిమానులు ఆశించారు. అయితే ఉవ్వెత్తున ఎగసి ఉస్సూరుమని కూలిన కెరటంలా ఉదయ్ కెరీర్ కూలిపోయింది. కూలిన అల మళ్ళీ లేస్తుంది. కానీ, ఉదయ్ కెరీర్ తిరిగి పుంజుకోలేకపోయింది. మానసికంగా నలిగిపోయిన ఉదయ్ కిరణ్ అర్ధాంతరంగా జీవితాన్ని చాలించాడు. కానీ, అతని అందమైన నవ్వు ఎందరో అభిమానుల మదిలో నిలచే ఉంది. ఈ నాటికీ ఉదయ్ కిరణ్ వింటే ఈ నాటికీ కొందరి మదిలో వీణలు మోగుతాయి. ఆ పేరు మరికొందరికి ఓ మధురస్వప్నం. ఇంకొందరికి మధురమైన బాధ. కానీ, అభిమానించే వారికి ఆరంభంలో అతను సాధించిన విజయాలే ఆనందం కలిగిస్తూ ఉంటాయి. ఆ తలపుల్లోనే ఉదయ్ కిరణ్ ను అభిమానించేవారు సేద తీరుతున్నారు. అతని నవ్వును తలచుకుంటూ ఊరట చెందుతున్నారు.