(జూన్ 27న ఆర్.డి.బర్మన్ జయంతి)
‘పిట్టకొంచెం కూత ఘనం’, ‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’, ‘తండ్రికి తగ్గ తనయుడు’ – ఇలాంటి ఉపమానాలన్నిటికీ న్యాయంచేసిన ఘనుడు రాహుల్ దేవ్ బర్మన్. ఇలా పూర్తి పేరుతో చెబితే కొందరికి అర్థం కాకపోవచ్చు. ఆర్.డి.బర్మన్ అని చెప్పగానే సంగీతప్రియుల మది పులకించి పోతుంది. ప్రఖ్యాత సంగీత దర్శకులు సచిన్ దేవ్ బర్మన్ తనయుడే ఆర్డీ బర్మన్. తండ్రి వద్ద పనిచేస్తూనే, పలు చిత్రాలకు తనదైన బాణీలు కూర్చి అలరించారు ఆర్డీ. తరువాత సోలో మ్యూజిక్ డైరెక్టర్ అయిన తరువాత ఆర్డీ బర్మన్ సంగీతం ఉర్రూతలూగించింది. ఎంతలా అంటే, ఎస్డీ బర్మన్ నే మరచిపోయేలా ఆర్డీ బాణీలు కట్టి, హిందీ చిత్రసీమను ఓ ఊపు ఊపేశారు. ఆర్డీ స్వరకల్పనలో రూపొందిన అనేక చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గా నిలవడమే కాదు, బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటుకున్నాయి. ఈ నాటికీ ఓ కల్ట్ క్లాసిక్ గా చెప్పుకొనే ‘షోలే’ చిత్రానికి ఆర్.డి.బర్మన్ సమకూర్చిన సంగీతం భలేగా ఆకట్టుకుంది.
ఆర్.డి.బర్మన్ కన్నవారు ప్రఖ్యాత హిందీ చిత్ర సంగీత దర్శకుడు ఎస్.డి.బర్మన్, గీత రచయిత్రి మీరా దేవ్ బర్మన్. తండ్రి స్వరకల్పన చేయడంలో దిట్ట, తల్లి బెంగాలీ గీత రచయిత్రి. దాంతో ఆర్.డి.బర్మన్ కు కూడా బాణీలు కట్టడంలోనూ, పాటలు పలికించడంలోనూ పట్టు లభించింది. 17 ఏళ్ళ ప్రాయంలోనే “ఆయే మేరీ టోపీ పలట్ కీ ఆ…” అనే పాటకు బాణీలు కట్టారు ఆర్డీ. ఈ పాటను సచిన్ దేవ్ బర్మన్ తన ‘ఫంటూస్’ చిత్రంలో ఉపయోగించుకున్నారు. తండ్రి వద్ద అనేక చిత్రాలకు అసిస్టెంట్ గా పనిచేసిన ఆర్డీ బర్మన్, తరువాత సోలో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. షమ్మీ కపూర్ నటించిన ‘తీస్రీ మంజిల్’తో ఆర్డీ బర్మన్ కు ఫస్ట్ హిట్ లభించింది. ఇందులోని “ఆజా ఆజా మై హూ ప్యార్ తేరా…”, “ఓ మేరే సోనా రే సోనా రే…”, “దీవానా ముఝ్ స నహీ ఇస్ అంబర్ కే నీచే…” వంటి పాటలు విపరీతమైన ఆదరణ పొందాయి. ఈ పాటలన్నీ తెలుగు చిత్ర సంగీత దర్శకులు తమకు అనువుగా వినియోగించుకోవడం విశేషం. “బహారోం కే సప్నే, ప్యార్ కా మౌసమ్, యాదోంకీ బారాత్, కటీ పతంగ్, హరే రామ హరే కృష్ణ, అమర్ ప్రేమ్, కారవాన్, సీతా ఔర్ గీతా, రామ్ పూర్ కా లక్ష్మణ్, మేరే జీవన్ సాథీ” చిత్రాలతో ఆర్డీకి మరింత క్రేజ్ పెరిగింది. తన భార్య ఆశా భోస్లే, కిశోర్ కుమార్ గాత్రాలతో తన మ్యూజిక్ ను జోడించి, పలు మ్యాజిక్స్ చేశారు ఆర్డీ. ‘షోలే’లోని పాటలే కాదు, ఆ చిత్రానికి ఆర్డీ బర్మన్ సమకూర్చిన నేపథ్య సంగీతం కూడా భలేగా ఆకట్టుకుంది. ఇక ఇందులో ఆర్డీ పాడిన “మెహబూబా…మెహబూబా…” పాట ఆ రోజుల్లో కుర్రకారును కిర్రెక్కించింది.
ఆర్డీ బర్మన్ బాణీలను అనేక మంది తెలుగు చిత్ర సంగీత దర్శకులు అనుసరించారు. ఆయన సైతం కొన్ని పాశ్చాత్య స్వరకల్పనలను అనుసరించడం గమనార్హం. ఏది ఏమైనా వెస్టరన్ మ్యూజిక్ తో హిందీ చిత్రసీమలో మ్యాజిక్ చేశారు ఆర్డీ. మన తెలుగు చిత్రాలకూ ఆర్డీ బర్మన్ సంగీతం సమకూర్చడం విశేషం. జంధ్యాల తన ‘చిన్నికృష్ణుడు’ సినిమా కోసం ఆర్డీతో స్వరకల్పన చేయించారు. ఇందులోని “జీవితం సప్తసాగర తీరం…” అన్న వేటూరి పాట, ఆయన భార్య ఆశా భోస్లే, బాలు గళాల్లో జాలువారి ఈ నాటికీ శ్రోతలను పరవశింపచేస్తూనే ఉంది. ఇక రామ్ గోపాల్ వర్మ ‘అంతం’లో కొన్ని పాటలు ఆర్డీ స్వరకల్పనలోనే రూపొందాయి. ‘సినిమా హాలిక్స్’ రూపొందించిన ‘గ్రేటెస్ట్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్స్’లో నంబర్ వన్ గా నిలిచారు ఆర్డీ బర్మన్. ఆయన సంగీతానికి అవార్డుల కన్నా ప్రేక్షకుల రివార్డులే మిన్నగా లభించాయి.
నేటికీ హిందీ చిత్రసీమలో ఏదో ఒక రీతిన ఆర్డీ ప్రభావంతో సంగీతం సాగుతూనే ఉందని చెప్పవచ్చు.