NTV Telugu Site icon

Indian Celebrities Business World: పైసల రూపంలోకి పబ్లిక్‌ ఇమేజ్‌. డైలీ లైఫ్‌ను డబ్బు చేసుకుంటున్న స్టార్లు

Indian Celebrities Business World

Indian Celebrities Business World

Indian Celebrities Business World: మన దేశం.. సెలబ్రిటీలకు నిలయం. ఆ సెలబ్రిటీలకు ఫ్యాన్స్ ఎక్కువ. పాపులేషన్‌ ఎక్కువ కాబట్టి ప్రముఖులు కూడా ఎక్కువేనని, వాళ్లకు అభిమానులు అధికమని అనుకోవటానికి లేదు. ఎందుకంటే.. మనకు సహజంగానే సెలబ్రిటీలంటే ఇష్టం మరియు గౌరవం ఎక్కువ ఉండటం దీనికి కారణం. మన దేశంలో ముఖ్యంగా రెండు రంగాల్లో ప్రముఖుల ప్రభావం బాగా కనిపిస్తుంది. ఒకటి.. సినిమా. రెండు.. క్రికెట్‌. ఈ రెండు రంగాల్లో చాలా మంది రాత్రికిరాత్రే స్టార్లయిపోతారు. ఒక్క సినిమా హిట్‌ అయినా.. ఒక్క మ్యాచ్‌లో మెరిసినా.. తెల్లారేసరికి సెలబ్రిటీ హోదా వచ్చేస్తోంది.

అయితే.. కొంత మంది ఆ స్టేటస్‌ను కంటిన్యూ చేస్తుండగా మరికొందరు పోగొట్టుకుంటున్నారు. సెలబ్రిటీ స్టేటస్‌ను కంటిన్యూ చేసేవారిలో కొందరు తమ పెర్ఫార్మెన్స్‌ను కొనసాగించటం ద్వారా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇంకొందరు డబ్బుపరంగా, మరికొందరు అటెన్షన్‌పరంగా ప్రముఖులుగా వెలిగిపోతున్నారు. డబ్బు విషయానికొస్తే సెలబ్రిటీలు తమకుంటూ ప్రత్యేక వ్యాపార ప్రపంచాన్ని సృష్టించుకుంటున్న తీరు ఆసక్తి కలిగిస్తోంది. ప్రముఖులు తమ ప్రొఫెషనల్‌ కెరీర్‌ అనంతరం లేదా కెరీర్‌ను కొనసాగిస్తూనే పార్ట్‌ టైమ్‌ ప్రోగ్రామ్‌లతో రెండు చేతులా సంపాదిస్తున్నారు.

Special Focus on Amazon: ఇండియన్‌ మార్కెట్‌లో అమేజాన్‌ ప్రస్తుత పరిస్థితేంటి?

రియాలిటీ షోలకు జడ్జిలుగా, క్రికెట్‌ మ్యాచ్‌లకు కామెంటేటర్లుగా, మ్యాచ్‌ ముగిశాక అనాలసిస్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహిస్తూ సెలబ్రిటీ హోదాను సొమ్ము చేసుకుంటున్నారు. తమకే సొంతమైన కరిజ్మాతో కాసులు కురిపిస్తున్నారు. బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ గ్రాండ్‌గా ఆదాయం పొందుతున్నారు. పబ్లిక్‌ ఇమేజ్‌ను పైసల రూపంలోకి మార్చుకుంటున్నారు. డైలీ లైఫ్‌ని సైతం డబ్బులు రాల్చే సాధనంలా మలచుకుంటున్నారు. అలా వస్తున్న మనీతో కొందరు సొంత బిజినెస్‌లు చేస్తూ లాభాలను ఆర్జిస్తుండగా మరికొందరు తెలివిగా పెట్టుబడులు పెడుతూ ప్రాఫిట్స్‌ పెంచుకుంటున్నారు.

సెలబ్రిటీల వ్యాపార ప్రపంచాన్ని రెండు విధాలుగా అర్థంచేసుకోవాలి. ఒకటి.. స్టార్టప్స్‌లో ఫైనాన్షియల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ చేయటం. రెండు.. సొంత వెంచర్లను ప్రారంభించటం. స్టార్టప్స్‌లో పెట్టుబడుల విషయానికొస్తే.. ప్రముఖులు ప్రధానంగా యాంజెల్‌ ఇన్వెస్టర్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు ఫ్యామిలీ ఆఫీసులకు కూడా తెరలేపుతున్నారు. మరికొందరు సెలబ్రిటీలు వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌లో పరిమిత సంఖ్యలో పార్ట్నర్‌లకు ఛాన్స్‌ ఇస్తున్నారు. ప్రముఖులు.. ఈక్విటీల్లో పూర్తిగా డబ్బునే పెట్టుబడిగా పెట్టరు. ఆయా స్టార్టప్‌లకు అంబాసిడర్లుగా ఉండకుండా పరోక్షంగా ప్రచారం కల్పించటం ద్వారానో మరో విధంగానో రివార్డ్‌ పొందుతారు.

ఉదాహరణకు.. టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీని తీసుకుంటే.. అతను కార్స్‌24 అనే సంస్థతోపాటు ఖాతాబుక్‌ అనే కంపెనీకి సరదాగా యాడ్స్‌ చేస్తున్నాడు. అలాగే.. దీపికా పదుకొణె విషయానికి వస్తే.. ఆమె.. ఐపీఎల్ మ్యాచ్‌ల విరామ సమయంలో టీవీ ప్రకటనల్లో కొన్ని ప్రొడక్ట్‌ వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెబుతోంది. వీళ్లిద్దరూ.. ఇలా.. ఆయా స్టార్టప్స్‌లో.. ఎంతో కొంత పెట్టుబడి పెట్టి ఉంటారు. అది ఎంతనేది వెల్లడించరు. అలాగని వాళ్లు ఆ సంస్థలకు ప్రచారకర్తలా అంటే అదీ కాదు. కానీ.. వాళ్ల పేర్లను ఆయా స్టార్టప్‌లు తమ ప్రయోజనాల కోసం వాడుకుంటాయి. దీన్నే ‘‘స్వీట్‌ ఈక్విటీ’’ అంటారు.

సెలబ్రిటీలకు ‘స్వీట్ ఈక్విటీ’ అనేది ఇప్పుడు కామన్‌ అయిపోయింది. దీనివల్ల అటు స్టార్టప్‌.. ఇటు సెలబ్రిటీ.. ఇద్దరూ లాభపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఎర్లీ స్టేజ్‌లో ఉన్న స్టార్టప్‌లకు ఇలాంటి ఫేమస్‌ పీపుల్‌తో చాలా ప్రయోజనాలు కలుగుతున్నాయి. పబ్లిక్‌ రిలేషన్స్‌ బెటర్‌గా ఉంటున్నాయి. కమర్షియల్‌ ఎట్రాక్షన్‌ లభిస్తోంది. ఫలితంగా.. తక్కువ ఖర్చుతో మార్కెట్‌లో గుర్తింపు వస్తోంది. పీఆర్‌ వ్యాల్యూ పెరుగుతోంది. దీనివల్ల ఆ కంపెనీ వ్యాపారంపై భాగస్వాములు, కస్టమర్లు, ఇన్వెస్టర్లు, ఉద్యోగుల్లో ఉన్నత స్థాయి అవగాహన, విశ్వాసం ఏర్పడుతుంది. తాము స్పెషల్‌ అనే ఫీలింగ్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఇదిలాఉండగా.. ఇప్పుడు.. సెలబ్రిటీల సొంత వ్యాపారాల గురించి చెప్పుకుందాం. ప్రముఖులు.. ఎంట్రప్రెన్యూర్లుగా మారటం అనే కాన్సెప్ట్‌ వాస్తవానికి 1987లోనే ప్రారంభమైంది. అప్పట్లో ఎలిజబెట్‌ టేలర్‌ సొంతగా పెర్‌ఫ్యూమ్‌ని లాంఛ్‌ చేశారు. 1994లో.. ఇమాన్‌ అనే సూపర్‌ మోడల్.. మహిళల కోసం కాస్మెటిక్స్‌ బిజినెస్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఈ ట్రెండ్‌ చాలా కాలం కొనసాగటం విశేషం. అయితే.. లెక్కకు మిక్కిలిగా తెర మీదికి వచ్చిన ఆ బ్రాండ్లలో ఇప్పుడు ఏవీ కూడా మనుగడలో లేకుండా కనుమరుగయ్యాయి.

ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సెలబ్రిటీలు కేవలం బ్రాండ్‌లకు ప్రచారకర్తలుగా ఉండటంతోనే సరిపెట్టుకోవట్లేదు. బిజినెస్‌ ప్రమోషన్‌ కల్పించటం వరకే పరిమితం కావట్లేదు. తమకంటూ ఓనర్‌షిప్‌ కావాలని కోరుకుంటున్నారు. ఆ ఓనర్‌షిప్‌ కూడా స్టాక్స్‌ రూపంలో ఉన్నంత మాత్రాన సంతృప్తి చెందట్లేదు. ప్రొడక్టులకు సంబంధించి.. ఐడియా లెవల్‌ నుంచి మేకింగ్‌ స్థాయి వరకు ఫుల్‌ పార్టిసిపేషన్‌ ఉండాలని ఆశిస్తున్నారు. తాము వృత్తిపరంగానే కాకుండా తమదైన ఉత్పత్తుల ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొనాలని తపిస్తున్నారు. దీనికి తగ్గట్లే ఫ్యాన్స్‌ నుంచి కూడా మంచి రెస్పాన్స్‌ వస్తుండటం ఆసక్తికరం.

అభిమానులు అనూహ్యంగా స్పందిస్తుండటంతో ప్రముఖులు తమ వ్యాపార ఆలోచనల ప్రాముఖ్యతను మరింతగా గుర్తిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో బిజినెస్‌ స్టార్ట్‌ చేస్తున్నారు. కొందరు రెస్టారెంట్లను ప్రారంభిస్తున్నారు. ఈ బిజినెస్‌లను ఫ్యాన్స్‌ తమ సెలబ్రిటీల కనెక్టింగ్‌ పాయింట్లుగా భావిస్తున్నారు. ఇప్పటివరకు తమ ఆరాధ్య దైవాలను టీవీల్లో, సినిమాల్లో, ఇంటర్వ్యూల్లో మరియు ఇతర మాధ్యమాల్లో మాత్రమే చూసి ఆనందించిన అభిమానులు ఇప్పుడు ఈ సరికొత్త కల్చర్‌తో తెగ సంతోషపడుతున్నారు. ఫ్యాన్స్‌లో పెల్లుబుకుతున్న ఈ ఉల్లాసానికి సోషల్‌ మీడియా మరింత జోష్‌ను జోడిస్తోంది.

కస్టమర్లను బాగా ఆకట్టుకుంటున్న సెలబ్రిటీల వెంచర్లలో రెండు కేటగిరీల గురించి చెప్పుకోవాలి. ఒకటి.. బ్యూటీ కేర్‌. రెండు.. క్లాతింగ్‌. ఈ ప్రొడక్టులను ఎలా వాడాలో చెబుతూ ప్రముఖులు వీడియోలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పెడుతుండటం ద్వారా వాటికి పర్సనల్‌ టచ్‌ ఇస్తున్నారు. ఫలితంగా ఫ్యాన్స్‌ ఆ ఉత్పత్తుల గురించి ఈజీగా తెలుసుకుంటూ ఆన్‌లైన్‌లోనే కొనేస్తున్నారు. దీనివల్ల మార్కెటింగ్‌ ఖర్చులు సైతం కలిసొస్తున్నాయి. అయితే.. ఈ సెలబ్రిటీల వ్యాపార ప్రపంచంలో కూడా కొన్ని మైనస్‌ పాయింట్లు ఉన్నాయి. వాళ్ల స్టార్‌డమ్‌ తగ్గగానే బిజినెస్‌ కూడా పడిపోతోంది. కొంత మంది సెలబ్రిటీల కెరీర్‌ అర్ధాంతరంగా ముగుస్తోంది.

Show comments