Special Focus on Amazon: అగ్రరాజ్యం అమెరికాలోని అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన అమేజాన్‌కి మన దేశంలో బిజినెస్ పైన పెద్ద ఆశలే ఉండేవి. ప్రపంచంలో శరవేగంగా వృద్ధిచెందుతున్న మార్కెట్లలో ఇండియా కూడా ఒకటి కావటమే దీనికి కారణం. అందుకే ఇక్కడ గత పదేళ్లలో ఆరున్నర బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది. టాప్ పొజిషన్‌ను సొంతం చేసుకోవాలని ఆశించింది. కానీ.. ఇటీవలి పరిణామాలను బట్టి చూస్తుంటే అమేజాన్ కలలు కల్లలవుతున్నాయా?, ఆ కారణంగానే సర్వీసులను ఒకదాని తర్వాత ఒకటి మూసేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు.. అమేజాన్.. భారత్‌లో ఎందుకు రాణించలేక చాప చుట్టేస్తోందో చూద్దాం..
అనుకున్నామని జరగవు అన్నీ. అనుకోలేదని ఆగవు కొన్ని. అమేజాన్‌కి సైతం ఇదే అనుభవం ఎదురైంది. ఆ సంస్థ ప్రణాళిక సెంట్ పర్సెంట్ సక్సెస్ కాలేదు. కొన్ని అనుకున్నట్లు జరగలేదు. ఈ నేపథ్యంలో ఇండియాలో అమేజాన్ డిస్ట్రిబ్యూషన్‌ను కొనసాగించదలచుకోలేదని నవంబర్ 28న ప్రకటించింది. ఈ యూనిట్‌ను 2020లో లాంఛ్ చేశారు. చిన్న రిటైలర్లు, ఫార్మసీలు, డిపార్ట్‌మెంట్ స్టోర్లను ఏకతాటిపైకి తీసుకురావటం కోసం ఈ వేదికను ఏర్పాటుచేసింది. కానీ.. వర్కౌట్ కాలేదు. దీంతో మూసివేయాలని రీసెంట్‌గా డిసైడ్ అయింది. ఈ నిర్ణయం తేలిగ్గా తీసుకున్నది కాదని, ప్రస్తుత కస్టమర్లు, పార్ట్నర్లతోపాటు ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దశల వారీగా తమ వ్యాపారానికి ఫుల్‌స్టాప్ పెడతామని అమేజాన్ ఓ ప్రకటనలో పేర్కొంది.
read also: No.Of Airports in India After Modi: ఇండియాలో 74 నుంచి 140కి పెరిగిన విమానాశ్రయాలు
ఇదే విధంగా.. అమేజాన్ లెర్నింగ్ అకాడమీ కార్యకలాపాలను కూడా క్రమంగా నిలిపివేస్తామని గత వారం వెల్లడించింది. 2020లో కొవిడ్ లాక్‌డౌన్ టైంలో ప్రారంభించిన ఈ లెర్నింగ్ అకాడమీ.. బైజూస్ మరియు అన్‌అకాడమీల మాదిరిగా విజయవంతం కాలేదు. అందువల్ల ప్రస్తుతం కొనసాగుతున్న బ్యాచ్ టెస్ట్ ప్రిపరేషన్ మాడ్యూల్ వచ్చే ఏడాది ఆగస్టుతో కంప్లీట్ అయ్యాక తెరదించటం మొదలుపెడుతుంది. ఫుడ్ డెలివరీ బిజినెస్‌ను సైతం బంద్ పెడతామని జొమాటో, స్విగ్గీల కన్నా ముందే నవంబర్ 25న వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంధ్యం భయాలు నెలకొనటంతో అమేజాన్ కంపెనీ ఒక వైపు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించటం, మరో వైపు ఇండియాలో సంస్థ కార్యకలాపాలకు ఒకదాని వెంట ఒకటిగా స్వస్తి చెబుతుండటం చర్చనీయాంశంగా మారింది. వీటితోపాటు అమేజాన్‌కి ఇండియాలో మరిన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి.
మన దేశంలో ఇ-కామర్స్ మార్కెట్ విలువ ప్రస్తుతం ఉన్న 72 బిలియన్ డాలర్ల నుంచి 2025లో 133 బిలియన్ డాలర్లకు ఎదుగుతుందనే అంచనాలు నెలకొన్నాయి. అమెరికాకు చెందిన మార్కెట్ రీసెర్చ్ సంస్థ అలయెన్స్ బెర్న్‌స్టీన్ ఈ అంచనాలను రూపొందించింది. ఈ బిజినెస్ గ్రోత్.. చిన్న చిన్న పట్టణాల్లో మరియు పల్లెల్లో చోటుచేసుకుంటుందని పేర్కొంది. అయితే.. అమేజాన్‌కి మన దేశంలో ఇలా గ్రామ స్థాయిలోకి వ్యాపారాన్ని విస్తరించే సామర్థ్యం లేకపోవటం పెద్ద మైనస్‌గా మారింది. దీనికితోడు.. టయర్-1 సిటీల్లో.. వాల్ట్‌మార్ట్‌కి చెందిన ఫ్లిప్‌కార్ట్.. మెటా సంస్థ మద్దతు కలిగిన మీషో.. మరియు రిలయెన్స్ రిటైల్ నుంచి అమేజాన్‌కి గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో ఇక ముందుకు వెళ్లే పరిస్థితి లేదని గ్రహించి వెనకడుగు వేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇ-గ్రాసరీతోపాటు ఆన్‌లైన్-టు-ఆఫ్‌లైన్ కేటగిరీల్లో రిలయెన్స్ 15 వేల రిటైల్ స్టోర్లతో లీడింగ్ పొజిషన్‌లో ఉంది. బలమైన ఇన్వెంటరీ లీడ్ మోడల్‌తో ఫ్లిప్‌కార్ట్.. దుస్తుల కేటగిరీలో దున్నేస్తున్నట్లు అలయెన్స్ బెర్న్‌స్టీన్ సంస్థ సెప్టెంబర్ రిపోర్ట్‌లో వెల్లడించింది. వేగంగా పెరుగుతున్న టయర్-2, టయర్-3 సిటీల్లో మీషో పైచేయి సాధిస్తోంది. ఈ క్రమంలో అమేజాన్.. మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికితోడు టాటా గ్రూపు కూడా ఇ-కామర్స్ సెక్టార్‌లో విస్తరిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఇ-కామర్స్ అగ్రిగేటర్ ఓఎన్‌డీసీ ఈ ఏడాది జులైలో తెర మీదికి రావటం విశేషం. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లు అమేజాన్ కష్టాలకు రెగ్యులేటరీ ఆటంకాలు కూడా ఎదురయ్యాయి.
అమేజాన్ లాంటి విదేశీ సంస్థలకు ఇండియాలో సొంత ఇన్వెంటరీకి రూల్స్ అనుమతించలేదు. మార్కెట్ షేర్‌లో పాతిక శాతం కన్నా ఎక్కువ వాటా కలిగి ఉండటానికి కూడా ఒప్పుకోలేదు. ఇది అమేజాన్‌కి భారీ ప్రతికూలతగా పరిణమించింది. గ్రాసరీ మరియు ఎఫ్‌ఎంసీజీ లాంటి రిటైల్ కేటగిరీల్లో సంస్థలు సక్సెస్ సాధించాలంటే సొంత ఇన్వెంటరీలు, సప్లై చెయిన్ లాజిస్టిక్స్ ఉండాల్సిందే. లేకపోతే కష్టం. ఈ విషయంలో అమేజాన్.. రిలయెన్స్ రిటైల్ లాంటి కంపెనీతో పోటీపడలేకపోయింది. ఈ కారణాలన్నింటి రీత్యా ఆ కంపెనీ.. ఇండియాలో సేఫ్ గేమ్ ఆడబోతోందా లేక మొత్తం గేమ్ ప్లాన్‌నే తిరగరాయబోతోందా అనేది ఆసక్తికరంగా మారింది.