Gold and Silver Markets: బంగారం, వెండి బిజినెస్ కొత్త సంవత్సరంలో ఆశాజనకంగా ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. 2022 కంటే 2023లో బులియన్ మార్కెట్ మంచి ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోయినేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం తక్కువ ఒడిదుడుకులే ఉంటాయని పేర్కొన్నారు. కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో గోల్డ్ వ్యాల్యూ అత్యధికంగా దాదాపు 19 వందల 35 డాలర్లకు చేరుతుందని, తక్కువలో తక్కువ 16 వందల 30 డాలర్ల కన్నా దిగొచ్చే ఛాన్సే లేదని చెబుతున్నారు.
వెండి ధర సైతం అత్యధికంగా 25 డాలర్లు, అత్యల్పంగా సుమారు 18 డాలర్లు పలుకుతుందని లెక్కలేశారు. బులియన్ మార్కెట్‌లో ఈ ఊగిసలాట ధోరణికి నిపుణులు పలు కారణాలను వివరించారు. డాలర్ ఇండెక్స్‌లోను మరియు లాభనష్టాల్లోను హెచ్చుతగ్గులు.. ప్రపంచంలోని ప్రధాన కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాల్లో కనబరుస్తున్న దూకుడు స్వభావం.. పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయాలు.. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు బులియన్ మార్కెట్‌లోని అస్థిరతకు దారితీశాయని పరిశ్రమ వర్గాలు గుర్తుచేస్తున్నారు.
read more: OnePlus-11(5G) to launch in India: లాంఛింగ్ డేట్, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ఇతర వివరాలు..
కిందటేడాది మార్చిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో నెలకొన్న రిస్క్ వల్ల బంగారం ధరలు ఆల్ టైం హైలెవల్లో దగ్గర దగ్గరగా 2 వేల 70 డాలర్లకు చేరాయి. కానీ.. తర్వాత కాలంలో భౌగోళిక రాజకీయ ప్రమాదకర పరిస్థితులు తగ్గుముఖం పట్టడం మరియు ఆకాశాన్నంటుతున్న ద్రవ్యో్ల్బణ కట్టడికి అమెరికా కేంద్ర బ్యాంకు కఠిన నిర్ణయాలు తీసుకోవటం వల్ల బంగారం, వెండి ధరలు నేలచూపులు చూశాయి.
రిజర్వ్ బ్యాంక్ ఇండియా మరియు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రెపో రేట్లను పెంచడంతో ఇన్వెస్టర్లు తమ డబ్బును రిస్కీ అసెట్ల నుంచి విత్‌డ్రా చేసుకున్నారు. గడచిన రెండేళ్లతో పోల్చితే బ్యాంకుల వడ్డీ రేట్లు తొలిసారిగా 2022 మే నెలలో పాజిటివ్ సెంట్‌మెంట్‌ను పెంచడంతో పెట్టుబడిదారుల చూపు డాలర్ వైపునకు మళ్లింది. ఫలితంగా.. బంగారం మార్కెట్‌లో షేర్ల అమ్మకాలు పెరిగి ధరలు రెండున్నరేళ్ల కనిష్టానికి.. అంటే.. 16 వందల 14 డాలర్లకు తగ్గాయి. దీనికితోడు క్యూ4లో ఇన్‌ఫ్లేషన్ కూడా క్రమంగా దిగొచ్చింది.
ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం యూఎస్ ఫెడ్ అగ్రెసివ్‌గా ముందుకెళ్లదని ఇన్వెస్టర్లు అనుకుంటున్నారు. దీంతో డాలర్‌పై ఒత్తిడి పెరిగి పుత్తడి రేట్లు పుంజుకుంటాయని అనుకుంటున్నారు. అయితే.. ప్రస్తుతం.. నూతన సంవత్సరంలో ప్రారంభంలోనే ఉన్నాం కాబట్టి దీనిపై అప్పుడే ధీమా వ్యక్తం చేయలేమని అనలిస్టులు పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను మరోసారి 50 నుంచి 75 బేసిస్ పాయింట్ల వరకు పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇదే జరిగితే.. రిస్కీ అసెట్లు మరియు గోల్డ్ మార్కెట్‌లో మళ్లీ ఊగిసలాట ధోరణి నెలకొంటుంది. అయితే.. ఇండియాలో మాత్రం కనకం కథ వేరుగా ఉంటుందని, గ్లోబల్ మార్కెట్‌లో జరగబోయే ఈ పరిణామాలు మన మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌పై పెద్దగా ప్రభావం చూపవని అంచనా. గోల్డ్, సిల్వర్ రేషియో ఇటీవల పీక్ స్టేజ్ 97 నుంచి 75కి పడిపోవటం వెండికి కలిసొచ్చింది. గ్రీన్ టెక్నాలజీ రంగంలో పురోగతి, ఇండస్ట్రియల్ డిమాండ్‌లో పెరుగుదల సిల్వర్ రేట్లకు సపోర్ట్‌ను కొనసాగిస్తాయని ఆశిస్తున్నారు.