Chanakya Niti: భారతదేశ గొప్ప మేధావి, వ్యూహకర్త, ఆచార్య చాణక్యుడు తన ‘చాణక్య నీతి’లో మనిషి విజయపథంలో సాగడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అద్భుతమైన సూత్రాలను చెప్పారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కూడా ఆయన చెప్పిన విషయాలు ప్రతి ఒక్కరికీ దిక్సూచిలా పనిచేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఆచార్య చాణక్యుడు సంతోషకరమైన, సంపన్నమైన జీవితాన్ని గడపడానికి కొన్ని ప్రాథమిక సూత్రాలను తన చాణక్య నీతి గ్రంథంలో వివరించారు. ఈ సూత్రాలను తు.చ తప్పకుండా పాటించే వారికి శ్రేయస్సు రాకుండా ఎవరూ అడ్డుకోలేరని ఆయన పేర్కొన్నారు. ఇంతకీ ఆ ప్రాథమిక సూత్రాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చాణక్యుని ప్రకారం.. సంపాదన ఎంత ఉన్నా సరే.. అనవసరమైన వాటిపై ఖర్చు చేసే అలవాటు మనిషిని పేదరికంలోకి, దుఃఖంలోకి నెట్టివేస్తుందన్నారు. ప్రతి వ్యక్తి తన ఆదాయంలో కొంత భాగాన్ని భవిష్యత్తు అవసరాల కోసం కచ్చితంగా పొదుపు చేయాలని చెప్పారు. జీవితంలో ఎప్పుడైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, మనం దాచుకున్న డబ్బు మాత్రమే మనల్ని కాపాడుతుందన్నారు. ధనాన్ని గౌరవించే వారి వద్దే లక్ష్మీదేవి నిలకడగా ఉంటుందని స్పష్టంగా చెప్పారు.
విజయానికి అడ్డదారులు ఉండవని, కేవలం కష్టపడటం ద్వారానే ఏదైనా సాధించవచ్చని చాణక్యుడు బలంగా విశ్వసించారు. నిరంతర కృషి, కఠోర శ్రమ చేసే వ్యక్తులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. కష్టాన్ని నమ్ముకున్న వారు జీవితంలోని అన్ని సుఖాలను అనుభవిస్తారని, శ్రమించే తత్వం ఉన్నవారికి సంపద, శ్రేయస్సులకు ఎన్నడూ కొరత ఉండదని పేర్కొన్నారు.
చాణక్య నీతి ప్రకారం.. కేవలం డబ్బు కూడబెట్టడమే కాదు.. దానం చేయడం కూడా సంపన్నతలో భాగమే అని అన్నారు. కష్టకాలంలో పేదలకు, అవసరమైన వారికి చేతనైనంత సహాయం చేసేవారిని దైవం ఎల్లప్పుడూ కాపాడుతుందని చెప్పారు. దానం చేసే గుణం ఉన్నవారికి సుఖసంపదలు రెట్టింపు అవుతాయని, దానధర్మాల కోసం చేతులు చాచేవారు ఎన్నటికీ పేదవారు కారని చాణక్యుడు తన గ్రంథంలో బోధించారు. మంచి విలువలు, పొదుపు చేసే అలవాటు, నిరంతర శ్రమ, దానగుణం కలిగిన వారు అత్యంత సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని చాణ్యకుడి మాటలను బట్టి స్పష్టమవుతోంది.
READ ALSO: Flax Seeds Powder: మహిళలకు వరం ఈ హోమ్ మేడ్ పొడి! రోజూ ఒక ముద్ద తింటే చాలు..