Site icon NTV Telugu

BJP MLA Raghunandan Rao: ఎందుకిలా డల్‌గా ఉన్నారు?

Bjp Mla Raghunandan Rao

Bjp Mla Raghunandan Rao

హైదరాబాద్‌లో నిన్న, మొన్న రెండు రోజుల పాటు భారీఎత్తున జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఘనంగా విజయవంతమయ్యాయి. దీంతో తెలంగాణలోని కమలదళంలో అడుగడుగునా ఆ సంతోషం, ఆనందం కనిపిస్తోంది. అయితే ఈ సమావేశాల్లో వేదిక పైన వెనక (రెండో) వరుసలోని సరిగ్గా మధ్యలో కూర్చున్న పార్టీ యువ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాత్రం డల్‌గా ఉండిపోయారు.

మరీ ముఖ్యంగా ప్రధాని మోడీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని భుజం తట్టి అభినందిస్తున్న సమయంలో వాళ్లిద్దరికి అటూ ఇటూ కూర్చున్న అమిత్‌షా, నడ్డా, తరుణ్‌ ఛుగ్‌, రాజ్‌నాథ్‌సింగ్‌ ఆసక్తికరంగా అటు చూస్తూ నవ్వుతూ కనిపించారు. అప్పుడు రఘునందన్‌రావు మొహంలో ఏ ఫీలింగూ లేదు. సాక్షాత్తూ ప్రధాని మోడీయే బండి సంజయ్‌ని మెచ్చుకుంటూ ఉంటే ఆ తాలూకు ఎక్స్‌ప్రెషన్‌ అక్కడున్న ప్రతిఒక్కరి ఫేస్‌లోనూ ప్రతిబింబిస్తోంది. కానీ ఈ ముఖ్యమైన సన్నివేశం తన కళ్ల ముందే జరుగుతున్నా దుబ్బాక ఎమ్మెల్యే మాత్రం అన్యమనస్కంగా, అదేమీ పట్టనట్లుగా విచార వదనంతో ఉన్నారు.

read also: Pawan Kalyan: ప్రధాని మోదీ పర్యటనకు పవన్ కళ్యాణ్ దూరం

పరేడ్‌ మైదానంలో జరిగిన విజయ సంకల్ప సభా వేదిక పైనా ఇవే దృశ్యాలు రిపీట్‌ అయ్యాయి. అక్కడ సైతం రఘునందన్‌రావు స్టేజీ మీద రెండో వరుసలో మధ్యలోనే ఆసీనులయ్యారు. అయితే అగ్రనేతలంతా నిల్చొని చేతులెత్తి సభికులకు అభివాదం చేస్తున్న సందర్భంలో కూడా ఆయన ముభావంగానే కళ్లు నేలకేసి చూస్తూ ఉన్నారు. మరోసారి.. ప్రధాని మోడీ అమిత్‌ షాతో మాట్లాడుతున్నప్పుడూ రఘునందన్‌రావు చేతులు కట్టుకొని అచేతనంగా అదో లోకంలో ఉన్నట్లు కనిపించారు.

ఈ మీటింగులకు సంబంధించి నిన్న టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలను, ఇవాళ పేపర్లలో వార్తలను, ఫొటోలను చూసినవాళ్లు బీజేపీ ఎమ్మెల్యే ఎందుకిలా డల్‌గా ఉన్నారనేదానిపై చర్చించుకుంటున్నారు. సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో అనూహ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్‌పై విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన రఘునందన్‌రావు ఆ తర్వాత బీజేపీలో కీలక నేతగా వ్యవహరించారు. అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వాన్ని పలు అంశాల్లో నిలదీశారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన బీజేపీలో కంఫర్ట్‌గా లేడనే వార్తలు వస్తున్నాయి.

జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌రేప్‌ కేసులో బాధితురాలి ఫొటోలను రఘునందన్‌రావు బయటపెట్టడం ద్వారా పార్టీకి ఇబ్బందికర పరిస్థితి తెచ్చారనే విమర్శలు వినిపించాయి. బాధితురాలి ఫొటోలను వెల్లడించకూడదనే నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని ఆయనపై పోలీసులు కేసు పెట్టారు. అయితే దీనిపై రఘునందన్‌రావు చేస్తున్న పోరాటంలో పార్టీ మద్ధతు లభించట్లేదని అంటున్నారు. ఫలితంగా ఆయన ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. బండి సంజయ్‌కి, రఘునందన్‌రావుకి మధ్య పొసగట్లేదని టాక్‌.

read also: COVID 19: దేశంలో కొత్తగా 16,135 కరోనా కేసులు.. పెరిగిన పాజిటివిటీ రేటు

అందుకే రఘునందన్‌రావు తిరిగి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరతారనే ప్రచారమూ జరిగింది. ఎమ్మెల్యే అయిన కొత్తలో రఘునందన్‌రావు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మీద కూడా అభ్యంతర వ్యాఖ్యలు చేసినట్లు వివాదం తలెత్తింది. దీంతో ఆయన వైఎస్‌ అభిమానులకు క్షమాపణ కూడా చెప్పారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశానికీ ఆయన గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే రఘునందన్‌రావు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో హ్యాపీగా పాల్గొనలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version