విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు యన్.టి.రామారావు దర్శకత్వంలో ఆయన శ్రీకృష్ణునిగా, దుర్యోధనునిగా ద్విపాత్రాభినయం చేసిన ‘శ్రీక్రిష్ణపాండవీయం’ తెలుగువారిని విశేషంగా అలరించింది. ఇదే చిత్రాన్ని యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలోనే తమిళంలోనూ నిర్మించారు. తొలుత తమిళ చిత్రానికి ‘రాజసూయం’ అనే టైటిల్ ను అనుకున్నారు. తరువాత ‘కన్నన్ కరుణై’ పేరుతో తమిళ ‘శ్రీకృష్ణ పాండవీయం’ రూపొందింది. తెలుగులో ద్విపాత్రాభినయం చేసిన యన్టీఆర్, తమిళంలో కేవలం శ్రీకృష్ణ పాత్రకే పరిమితమై దుర్యోధనునిగా మనోహర్ తో నటింపచేశారు. తమిళవారికి కూడా సుపరిచితమైన చిత్తూరు నాగయ్య, కే.ఆర్.విజయ, ఎస్.వరలక్ష్మి, నాగరత్న, గీతాంజలి, ఉదయ్ కుమార్, రాజనాలను వారిపాత్రల్లోనే నటింప చేశారు. ఇతర పాత్రల్లో తమిళనటులు టి.ఆర్. మహాలింగమ్, రామదాస్, ఓఏకే దేవర్ నటించారు. 1971 జూన్ 16న ఈ చిత్రం జనం ముందు నిలచింది. తమిళనాట కూడా ‘కన్నన్ కరుణై’ విశేషాదరణ చూరగొంది.
అంతకు ముందే యన్టీఆర్ ‘మాయాబజార్, కర్ణన్’ తమిళ చిత్రాలలో శ్రీకృష్ణునిగా నటించి తమిళ ప్రేక్షకుల హృదయాల్లోనూ శ్రీకృష్ణుడంటే రామారావే అనే స్థానం సంపాదించారు. దాంతో ‘కన్నన్ కరుణై’ వస్తుందన్న విషయం అక్కడి ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించింది. ఇందులోని కొన్ని సన్నివేశాలను ‘శ్రీక్రిష్ణపాండవీయం’ షూటింగ్ సమయంలోనే చిత్రీకరించారు. అయితే ఆ తరువాత యన్టీఆర్ తన నటనలో బిజీగా ఉన్న కారణంగా ‘కన్నన్ కరుణై’ చిత్రనిర్మాణంలో జాప్యం చోటు చేసుకుంది. ఈ సినిమా విడుదల సమయానికి తమిళనాట కె.ఆర్.విజయ అగ్రనాయికగా సాగుతున్నారు. కొన్ని సీన్స్ లో ఆమె బొద్దుగానూ కనిపించారు. ఇక ఇందులోని పాటలకు తెలుగులో టి.వి.రాజు సంగీతం సమకూర్చి అలరించారు. ప్రముఖ తమిళ సంగీత దర్శకులు ఎస్.వి. వెంకట్రామన్ స్వరాలు సమకూర్చారు. పాపనాశమ్ శివన్, వాలి, ఉడుమలై నారాయణకవి పాటలు రాశారు. అక్కడ కూడా ‘కన్నన్ కరుణై’ పాటలు విశేషంగా జనాన్ని ఆకట్టుకున్నాయి. ఏ.కె.వేలన్ సంభాషణలు రాశారు. తెలుగులో ఛాయాగ్రహణం నిర్వహించిన రవికాంత్ నగాయిచ్ తమిళంలోనూ ‘కన్నన్ కరుణై’ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఈ చిత్రం తమిళనాట కూడా మంచి విజయం సాధించింది.