నగుమోము నగ్మా, నగిషీల మహిమ తొలిసారి తెలుగుతెరపై వెలిగింది ‘పెద్దింటల్లుడు’ చిత్రంతో. ఈ సినిమాలోనే ముద్దుగా బొద్దుగా కనిపించిన నగ్మా వచ్చీ రాగానే తెలుగువారిని ఆకర్షించేసింది. సుమన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో మోహన్ బాబు ఓ కీలక పాత్ర పోషించారు. వాణిశ్రీ మరో ముఖ్యభూమికలో అలరించారు. షమ్మీ కపూర్ ‘ప్రొఫెసర్’ చిత్రం పోలికలు ఇందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఆ చిత్రాన్నే యన్టీఆర్ హీరోగా ‘భలే మాస్టర్’ పేరుతో తెలుగులో తెరకెక్కించారు. కాబట్టి మన తెలుగువారికి ‘పెద్దింటల్లుడు’ చూడగానే రామారావు ‘భలే మాస్టర్’ గుర్తుకు వస్తుంది. ఏమయితేనేమి నవ్వుల పువ్వులు పూయిస్తూ 1991 మే 30న విడుదలైన ‘పెద్దింటల్లుడు’ మంచి విజయం సాధించింది.
అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని బ్రతికించుకోవడానికి హీరో పలు పాట్లు పడతాడు. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని హైదరాబాద్ బయలుదేరతాడు. ఓ ధనవంతురాలి కోడళ్ళకు ట్యూషన్ చెప్పే మాస్టర్ గా చేరాలని వెళ్తున్న ఓ వ్యక్తి దారిలో హీరోకు తారసపడతాడు. షూటు కేసులు తారుమారు అవుతాయి. హీరోకు దొరికిన షూట్ కేసులో ఆ ప్రైవేట్ మాస్టర్ కు ఇచ్చిన అపాయింట్ మెంట్ లెటర్ ఉంటుంది. దాంతో ఓ మధ్యవయస్కుడిగా వేషం మార్చుకొని హీరో ట్యూషన్ మాస్టర్ గా ధనవంతురాలి ఇంటిలో చేరతాడు. అతనేమో అందాలరాశి అయిన ధనవంతురాలి కోడలిని ప్రేమించి ఉంటాడు. ముసలి గెటప్ లో ఉన్న హీరోని చూసి ధనవంతురాలు సైతం మనసు పారేసుకుంటుంది. చివరకు అసలు విషయం తెలిసి, హీరో, హీరోయిన్ ను కలపడంతో కథ ముగుస్తుంది. ఆఖరులో అసలు ట్యూషన్ మాస్టర్ ప్రవేశించి నవ్వులు పూయిస్తాడు. ఇదీ ‘పెద్దింటల్లుడు’ కథ. ఈ కథను దర్శకుడు శరత్ జనరంజకంగా తెరకెక్కించారు.
ధనవంతురాలి పాత్రలో వాణిశ్రీ నటించిన ఈ చిత్రంలో బాబూ మోహన్, భీమేశ్వరరావు, పొట్టి ప్రసాద్, డబ్బింగ్ జానకి, సీమ తదితరులు నటించారు. పి.వాసు కథ సమకూర్చిన ఈ చిత్రానికి ఓంకార్ మాటలు రాశారు. శ్రీఅన్నపూర్ణ సినీచిత్ర పతాకంపై టి.ఆర్.తులసి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి రాజ్-కోటి స్వరకల్పనలో వేటూరి రాసిన పాటలు అలరించాయి. “జిందాబాద్ జీవితం…”, “జోహారే భామా…”, “కన్నుకొట్టు కన్నుకొట్టు…” వంటి పాటలు జనాన్ని ఆకట్టుకున్నాయి. సుమన్ హీరోగా నటించిన చిత్రాలలో ‘పెద్దింటల్లుడు’ ఓ సూపర్ హిట్ గా నిలచింది.
(మే 30న ‘పెద్దింటల్లుడు’కు 30 ఏళ్ళు)