దర్శకుడు, సంగీత దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి భలేగా సక్సెస్ రూటులో సాగుతున్న సమయంలో తెరకెక్కించిన చిత్రం ‘మావిచిగురు’. అప్పటికే ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు ‘శుభలగ్నం’ వంటి బంపర్ హిట్ మూవీలో నటించి ఉండడంతో, ‘మావిచిగురు’ ఆరంభం నుంచీ ఓ ప్రత్యేకమైన క్రేజ్ నెలకొల్పింది. అందుకు తగ్గట్టుగానే మహిళాలోకాన్ని ఆకట్టుకొనే కథాంశంతో రూపొందిన ‘మావిచిగురు’ కూడా విజయకేతనం ఎగురవేసింది. 1996 మే 30న విడుదలైన ‘మావిచిగురు’ ప్రేక్షకులను భలేగా మెప్పించింది.
భర్తంటే ప్రాణం పెట్టే కథానాయిక, తాను ఎక్కువ రోజులు జీవించనని తెలుసుకుంటుంది. ఈ నేపథ్యంలో తన భర్తకు మరో పెళ్ళి చేయాలని నిర్ణయించుకుంటుంది. కానీ, భార్యంటే ప్రాణంగా భావించే కథానాయకుడు అందుకు అంగీకరించడు. తాను కన్నుమూసేలోగా ఎలా భర్తను ఆమె రెండో పెళ్ళికి ఒప్పించింది అన్నదే ‘మావిచిగురు’ చిత్రకథ. అంతకు ముందు జగపతిబాబు, ఆమని జంటగా ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన ‘శుభలగ్నం’లో డబ్బు కోసం భర్తను మరో స్త్రీకి ఇచ్చి పెళ్ళి చేస్తుంది నాయిక. అందులో భార్యగా నటించిన ఆమని, ఇందులోనూ జగపతిబాబుతో జోడీ కట్టింది. అయితే ‘మావిచిగురు’లో తన భర్తకు తాను దూరమైనా, ఓ తోడు ఉండాలని తపించే పాత్రలోనూ ఆమని జీవించింది. అలా ‘మావిచిగురు’ సైతం జనాన్ని ఆకట్టుకోగలిగింది.
‘మావిచిగురు’ చిత్రంలో రంజిత, బ్రహ్మానందం, బాబూమోహన్, తనికెళ్ళ భరణి, ఆలీ, అల్లు రామలింగయ్య, శివాజీరాజా, గుండు హనుమంతరావు, శ్రీలక్ష్మి, శివపార్వతి, నిర్మలమ్మ తదితరులు నటించారు. ఈ చిత్రానికి దివాకర్ బాబు సంభాషణలు అలరించాయి. ఈ చిత్రానికి ఎస్వీ కృష్ణారెడ్డి సంగీతం సమకూర్చగా, సిరివెన్నెల, భువనచంద్ర పాటలు రాశారు. సదాశివ బ్రహ్మేంద్ర రాసిన “మానస సంచరరే…” గీతాన్ని సందర్భానికి అనువుగా ఉపయోగించుకున్నారు. “మావిచిగురు తిని నీకు శుభమని…”, “కోదండరాముడంట…”, “కొమ్మన కులికే కోయిల…”, “కొండమల్లి…కొండమల్లి…”, “మాట ఇవ్వమ్మా చెల్లి…” పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అల్లు రామలింగయ్యపై చిత్రీకరించిన “రంజు భలే రామ్ చిలకా…” పాట భలేగా వినోదం పంచింది. ఈ చిత్రాన్ని శ్రీస్రవంతి మూవీస్, చంద్రకిరణ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి. చిత్రానికి పి.ఉషారాణి నిర్మాత. ఈ చిత్రాన్ని మళయాళంలో “కుంకుమచెప్పు”గా, తమిళంలో “తోడరుమ్” పేరుతో రీమేక్ చేశారు.
(మే 30తో ‘మావిచిగురు’కు 25 ఏళ్ళు)