Viswam Movie Review and Rating: ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీను వైట్ల ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. అలాంటి ఆయన గోపీచంద్ హీరోగా విశ్వం అనే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రేక్షకులలో సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. కావ్య థాపర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాని చిత్రాలయ స్టూడియోస్తోపాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దసరా సందర్భంగా ఈ సినిమా ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ:
హైదరాబాదులో కేంద్రమంత్రి(సుమన్) హత్యకు గురవుతాడు. ఆ హత్యను కళ్ళారా చూసిన ఒక చిన్నారిని చంపేందుకు హంతకులు వెంబడిస్తూ ఉంటారు. అయితే ఆ చిన్నారి కుటుంబానికి పరిచయమైన గోపిరెడ్డి (గోపీచంద్) ఆమెను పలుసార్లు ప్రమాదం నుంచి కాపాడుతాడు. అయితే అసలు గోపిరెడ్డి వచ్చింది తాను ఇష్టపడిన సమైరా(కావ్య థాపర్)ను కలవడానికి. గతంలో ఇటలీలో పరిచయమైన సమైరాకు దూరమైన గోపిరెడ్డి మళ్లీ ఆమెను కలిసాడా? అసలు గోపిరెడ్డి ఎవరు? ఎందుకు చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తాడు? అసలు గోపిరెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? విశ్వం గోపి రెడ్డిగా ఎందుకు చిన్నారి కుటుంబం ముందుకు వచ్చాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
విశ్వం అనే సినిమా అనౌన్స్ చేసినప్పుడు నుంచి శ్రీను వైట్ల ఈసారి ఎలాంటి సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అనే ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. అయితే ఈసారి కూడా రొటీన్ ఫార్ములా తోనే ప్రేక్షకులను పలకరించాడు శ్రీనువైట్ల. టెర్రరిజం బ్యాక్ గ్రౌండ్ తీసుకుని ఒక చిన్నారితో లింక్ కలుపుకుంటూ ఒక ఆసక్తికరమైన కథను రాసుకున్నాడు. అయితే ఆ కథలో ఎక్కడా కొత్తదనం కనిపించదు. సినిమా ఓపెనింగ్ లోనే ఒక్కొక్క క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్లాడు. సినిమా ప్రారంభమైన కాసేపటికి ప్రేక్షకులకు తర్వాత ఏం జరగబోతోంది అనే విషయం మీద ఒక అవగాహన వచ్చేస్తుంది. అయితే సినిమా మొత్తాన్ని సీరియస్ నోట్లో తీసుకు వెళ్ళకుండా మధ్యలో తనకు బాగా అలవాటైన కామెడీ ట్రాక్ ని బాగా వాడుకున్నాడు డైరెక్టర్. ఫస్ట్ ఆఫ్ లో పృథ్వి, గోపీచంద్, నరేష్ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది.. మరీ ముఖ్యంగా పృథ్వి కనిపించినప్పుడల్లా అప్రయత్నంగా నవ్వులు వచ్చేస్తాయి. ఇక సెకండ్ హాఫ్ ప్రారంభమైన తర్వాత వచ్చే ట్రైన్ ఎపిసోడ్ కూడా బాగానే పండింది. వెన్నెల కిషోర్ తో ట్రైన్ లో చేయించిన కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. అయితే గతంలో వెంకీ ట్రైన్ ఎపిసోడ్ తో పోల్చితే మాత్రం నిరాశ పడక తప్పదు. ట్రైన్ సీన్ రిపీట్ అవుతుంది తప్ప కామెడీకి పోలిక ఉండదు. అయితే ఉన్నంతలో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం బాగానే చేశారు. ఇక క్లైమాక్స్ కూడా ప్రేక్షకులు ఊహించే విధంగానే రాసుకోవడం సినిమాకి కాస్త ఇబ్బందికర అంశం. అయితే శ్రీనువైట్ల సినిమా అంటేనే కామెడీ ఎక్స్పెక్ట్ చేసి వచ్చే ప్రేక్షకుడు ఈ సినిమాలో కామెడీతో ఎంజాయ్ చేసే విధంగా రాసుకున్నాడు డైరెక్టర్.
నటీనటుల విషయానికి వస్తే:
గోపీచంద్ ఎప్పటిలాగే తనకు బాగా అలవాటైన పాత్రలో మెరిశాడు. కామెడీతో పాటు యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా ఆకట్టుకున్నాడు. కావ్య థాపర్ గ్లామర్ గట్టిగానే ఒలక పోసింది. వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్, నరేష్, ప్రగతి సహా గిరి, షకలక శంకర్ వంటివాళ్లు కనిపించింది కొద్దిసేపు అయినా కడుపుబ్బా నవ్వించారు. విలన్ పాత్రలో నటించిన జిషుస్సేన్ గుప్తా తనకు అలవాటు అయిన పాత్రలోనే మెరిసాడు. సునీల్ పాత్ర కాస్త భిన్నం. కిక్ శ్యామ్ కి చాలా రోజుల తర్వాత కాస్త బరువున్న పాత్ర పడింది. చిన్నారి పాత్రలో నటించిన చిన్నారి ఎవరో కానీ ఎక్స్ప్రెషన్స్ తో అదరగొట్టింది. ఇక మిగతా పాత్రధారులు అందరూ తమ పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే సాంగ్స్ విషయంలో చైతన్ భరద్వాజ్ కి వంక పెట్టాల్సిన పనిలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలోనే అవసరం లేని చోట్ల కూడా బాక్స్లు దద్దరిల్లేలా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడేమో అనిపించింది. అయితే ఓవరాల్ గా తన పాత్రకు ఆయన న్యాయం చేసినట్లే అనిపించింది. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే సినిమాని చాలా కలర్ ఫుల్ గా ప్రేక్షకులు ముందుకు తీసుకురావడంలో సినిమాటోగ్రాఫర్ తన పాత్రకి పూర్తిగా న్యాయం చేశాడు. ఇక స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ కాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే సినిమాలో ఏం జరగబోతోంది అనేది ఈజీగా అర్థమయిపోయేలా ఉండడం కాస్త ఇబ్బందికర అంశం. అయితే కంప్యూటర్ గ్రాఫిక్స్ విషయంలో కూడా కాస్త కేర్ తీసుకుని ఉండాల్సింది. ఎడిటింగ్ టేబుల్ మీద గట్టిగానే వర్కౌట్ చేసినట్టు కనిపించింది. నిర్మాణ విలువలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్‌గా:
విశ్వం రొటీన్ కమర్షియల్ ఫార్ములాతో ప్రేక్షకులను నవ్వించే ఒక ఎంటర్టైనర్.. కానీ కండిషన్స్ అప్లై.