రివ్యూ: వినరో భాగ్యము విష్ణు కథ
‘రాజావారు రాణిగారు’ మూవీతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరంకు ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ చక్కని విజయాన్నే అందించింది. అయితే గత యేడాది వచ్చిన మూడు సినిమాలు ఫ్లాప్ కావడంతో అతని లేటెస్ట్ మూవీ ‘వినరో భాగ్యము విష్ణు కథ’ రిజల్డ్ లిట్మస్ టెస్ట్ లా మారింది. పైగా గీతా ఆర్ట్స్ కు చెందిన జీఏ 2 నుండి వస్తున్న సినిమా కావడంతో అందరి దృష్టి ఈ మూవీపైనే ఉంది. మరి కిరణ్ అబ్బవరంకు అల్లు అరవింద్ సంస్థ కలిసొచ్చిందో లేదో చూద్దాం.
విష్ణు (కిరణ్ అబ్బవరం) తిరుపతి వాస్తవ్యుడు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని తాతయ్య (శుభలేఖ సుధాకర్) ద్వారా తెలుసుకుంటాడు. జీవితంలో చిన్నప్పుడే ఎదురైన చేదు అనుభవాలతో అందరికీ మంచి చేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకుంటాడు.సెంట్రల్ లైబ్రరీలో జాబ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన విష్ణు, తన నైబర్ నంబర్ కు చెందిన రాజన్ (శరత్ లోహితస్య) ను కలిసి శుభలేఖ ఇద్దామనుకుంటాడు. అయితే… ‘ఈ నంబర్ నైబర్ కాన్సెప్ట్ ఏమిటీ?’ అని రాజన్ అడగడంతో తన కథను చెప్పడం మొదలెడతాడు. విష్ణు జీవితంలోకి యూ ట్యూబర్ దర్శన (కశ్మీర పర్దేశీ) ఎలా అడుగుపెట్టింది? ఆమె కారణంగా పరిచయం అయిన మరో నైబర్ నంబర్ శర్మ (మురళీ శర్మ)తో వీరికి ఎలాంటి చిక్కులేర్పడ్డాయి? తమ ప్రేమ కథలోకి క్రైమ్ ఎలా చొరబడిందనేది విడమర్చి చెబుతాడు… అలా ఈ విష్ణు కథ కంచికి చేరే సమయానికి థియేటర్ లోని ప్రేక్షకులకు రాజన్ ఎవరు? అతను హైదరాబాద్ ఎందుకు వచ్చాడు? అతన్ని ఎన్.ఐ.ఎ. అధికారులు ఎందుకు పట్టుకోవాలని చూస్తున్నారు? వాళ్ళ లక్ష్యం నెరవేరిందా? అనే విషయాలు అర్థమౌతాయి.
‘వినరో భాగ్యము విష్ణు కథ’ ప్రారంభం నుండి ముగింపు వరకూ ట్విస్టుల మయం. సహజంగా కథలో ట్విస్టులు ఉంటాయి. కానీ ఇది ట్విస్టులే కథగా సాగే సినిమా. హీరో విష్ణు క్యారెక్టర్ ను దేశం కోసం… ధర్మం కోసం అన్నట్టుగా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు రాసుకున్నాడు. దానికి తగ్గట్టుగా కథను మలుచుకున్నాడు. అందులో ప్రతి సీన్ లోనూ ఓ ట్విస్ట్ ఉండేట్టుగా చూసుకున్నాడు. కానీ ఈ ట్విస్టులను అర్థం చేసుకుని కథను ఫాలో అవుతుండటం కొంత కష్టంగా అనిపిస్తుంది. బట్… తెర మీద సీన్స్ ఎంగేజింగ్ గా ఉన్నాయి. విష్ణు జీవిత ప్రారంభం కాస్తంత సాదాసీదాగా అనిపించినా, మురళీశర్మ ఎంట్రీతో థియేటర్ లో వైబ్రేషన్స్ మొదలవుతాయి. అతన్ని డైరెక్టర్ పూర్తిగా వాడేసుకున్నాడు. మురళీ శర్మలోని అన్ని కోణాలను ఆవిష్కరించేశాడు. శత్రువులకు కూడా సాయం చేసే గుణం ఉన్న విష్ణు పాత్రను పకడ్బందీగా మలిచాడు. దాంతో ప్రతి ఒక్కరూ ఆ క్యారెక్టర్ తో కనెక్ట్ అవుతారు. ఎవరైనా ఇలా కదా ఉండాల్సింది అనిపించేలా కిరణ్ పాత్రను తీర్చిదిద్దాడు. ఈ మూవీ టీజర్ లో చెప్పినట్టు లవ్ స్టోరీగా మొదలై కామెడీతో సాగి, క్రైమ్ ఎలిమెంట్స్ జత అయ్యి, సస్పెన్స్ తో నడిచే ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ఇది!
షార్ట్ ఫిల్మ్ నుండి సినిమాల్లోకి వచ్చిన కిరణ్ అబ్బవరం ఎప్పుడూ సెటిల్డ్ పెర్ఫార్మెన్సే ఇస్తాడు. ఇందులోనూ అలానే చేశాడు. మరీ వేరియేషన్స్ లోకి పోకుండా పాత్రోచితంగా నటించాడు. కశ్మీర పర్దేశీకి రీ-ఎంట్రీ కలిసొచ్చింది. బబ్లీ గర్ల్ క్యారెక్టర్ లో ఆకట్టుకుంది. సినిమాలో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ అంటే మురళీ శర్మ క్యారెక్టరే. దాన్ని ఆయన సమర్థవంతంగా పోషించాడు. దర్శకుడు పాత్రధారుల ఎంపికలో తీసుకున్న జాగ్రత్త కారణంగా మూవీకి సరికొత్త ఫ్లేవర్ యాడ్ అయ్యింది. అలా ఇందులో ఎన్.ఐ.ఎ. టీమ్ లో మనకు మాథ్యూ వర్గీస్, భరత్ రెడ్డి, తారక్ పొన్నప్ప కనిపిస్తారు. ఇక శరత్ లోహితస్య, అతని టీమ్ ను చూస్తే మనీ హీస్ట్ గెటప్స్ గుర్తొస్తాయి. హీరోయిన్ తల్లిదండ్రులుగా ఆమని, దేవిప్రసాద్, హీరో తాతయ్యగా శుభలేఖ సుధాకర్, లైబ్రేరియన్ గా ఎల్.బి. శ్రీరామ్, స్నేహితుడిగా ప్రవీణ్ నటించారు. కేజీఎఫ్ ఫేమ్ లక్కీ లక్ష్మణ్ బావమరిది పాత్రలో పమ్మి సాయి, పోలీస్ ఆఫీసర్ గా వడ్లమాని సత్యసాయి శ్రీనివాస్ కనిపించేది కొద్దిసేపే అయినా బాగా నటించారు. సురభి ప్రభావతి, దయానంద రెడ్డి, ప్రభావతి, శ్రీనివాస్, కృష్ణ పెనుమర్తి ఇతర పాత్రల్లో కనిపిస్తారు. ఆర్టిస్టుల నుండి చక్కని పెర్ఫార్మెన్స్ దర్శకుడు రాబట్టుకున్నాడు. టెక్నీషియన్స్ లో చైతన్ భరద్వాజ్ అందించిన స్వరాలే కాదు… నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. హీరో క్యారెక్టరైజేషన్ తెలియచేసే ఇంట్రడక్షన్ సాంగ్స్ లో ఇది పూర్తిగా డిఫరెంట్. అలానే తిరుపతి గురించిన పాట కూడా చక్కగా ఉంది. హీరో, హీరోయిన్లపై డ్యుయేట్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. అలానే డేనియల్ విశ్వాస్ సినిమాటోగ్రఫీ కూడా చక్కగా ఉంది. మొత్తం మీద దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు తన మొదటి సినిమాతోనే సత్తా చాటుకున్నాడు. ‘గీత గోవిందం’ తర్వాత జీఏ 2 బ్యానర్ నుండి వచ్చిన చిత్రాల్లో అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ‘వినరో భాగ్యము విష్ణు కథ’లోనే ఉన్నాయి! అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు తీసిన ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందడం ఖాయం.
రేటింగ్: 3/5
ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథ
ఆకట్టుకునే కథనం
ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్
ప్రొడక్షన్ వాల్యూస్
మైనెస్ పాయింట్స్
మరీ ఎక్కువైన ట్విస్ట్స్
ట్యాగ్ లైన్: ప్రేక్షక భాగ్యం!