శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్… చంటబ్బాయ్ తాలూకా అనేది ట్యాగ్ లైన్. ముందు పెద్దగా ఎవరికీ తెలియని ఈ సినిమాని ఈ మధ్య మంచి ఫామ్ లో ఉన్న డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవ్వడం, ఆ తరువాత చేసిన అగ్రెసివ్ ప్రమోషన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది.ఈ సినిమా ట్రైలర్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో క్రిస్మస్ కానుకగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఎలా ఉన్నాడు, ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అనేది రివ్యూలో చూద్దాం.
కథ:
ఈ సినిమా కథ చాలా సింపుల్.ట్రైలర్ లో చూపించినట్టుగానే మేరీ అనే ఒక అమ్మాయి హత్యకి గురవుతుంది.ఆ అమ్మాయిని ఎవరు హత్య చేసారు అనే విషయం తెలుసుకోవడానికి పోలీసులు డిటెక్టివ్ అయిన ఓం (వెన్నెల కిషోర్)ని నియమించుకుంటారు. ఎలాంటి క్లూ లేని ఆ హత్య కేసుని ఈ ఓం అలియాస్ షెర్లాక్ హోమ్స్ ఎలా సాల్వ్ చేసాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
ఎంత పెద్ద డిటెక్టివ్ సినిమా తీసుకున్నా కూడా పైన చెప్పుకున్న రొటీన్ టెంప్లెట్ కథని దాటి చెప్పడం అనేది జరగదు.కానీ అందరికి తెలిసిన అదే కథని ఎలాంటి కట్టిపడేసే మలుపులతో తీశారు,వీలైతే ఎలాంటి హత్తుకునే సన్నివేశాలతో చెప్పారు అనే విషయం పైనే ఈ జోనర్ సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.అయితే ఈ సినిమాకి ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ అనే టైటిల్ పెట్టి,చంటబ్బాయ్ తాలూకా అనే ట్యాగ్ లైన్ తగిలించి,మెయిన్ లీడ్ గా వెన్నెల కిషోర్ ని తీసుకోగానే ప్రేక్షకుల అంచనాలు ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.వెన్నెల కిషోర్ నవ్విస్తూ చేసేపనులు తెరపై అనుకోని మలుపులు తిరిగి అసలు విషయం అనూహ్యంగా రివీల్ అవుతుంది అని అనుకుంటారు.కానీ ఈ సినిమా రైటర్ కమ్ డైరెక్టర్ వేరే విధంగా అనుకున్నాడు.కామెడీకి కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన వెన్నెల కిషోర్ ని సినిమాలో పెట్టుకుని ఒక్కటంటే ఒక్కటి కూడా కామెడీ పేలే డైలాగ్ రాసుకోలేదు.అలాంటప్పుడు ఆ మాత్రం దానికి ఈ సినిమాకి వెన్నెల కిషోర్ ఎందుకో అర్ధం కాదు (ఆ విషయం వెన్నెల కిషోర్ కి కూడా అర్ధం కాలేదనుకుంటా…అందుకే ప్రమోషన్స్ కి వచ్చి ఉండడు).
ఇక సినిమాకి శ్రీకాకుళం అనే పేరు తగిలించినప్పుడు ఆ యాస, ఆ భాష వాడితే తప్ప నేటివ్ ఫీల్ రాదు.కానీ వెన్నెల కిషోర్ ఒక్కడే శ్రీకాకుళం యాసలో మాట్లాడుతుంటాడు.కానీ అది చాలా ఆర్టిఫీషియల్ గా అనిపిస్తుంది. మిగిలిన వాళ్లంతా ఏదో
గుర్తొచ్చినప్పుడు,తోచినప్పుడు అక్కడక్కడా ఆ భాష వాడే ప్రయత్నం చేసారు తప్ప మిగిలిన టైం లో మామూలుగా మాట్లాడేస్తుంటారు.అదే చిత్రమో అర్ధం కాదు.ఇక హత్య కేసుని సాల్వ్ చేసే క్రమంలో వచ్చిన ఒక ఉప కథ అయితే అసలు మనం ఏ సినిమాకి వచ్చాం అనే కన్ఫ్యూషన్ కి గురి చేస్తుంది.అక్కడ వచ్చే కొన్ని డైలాగ్స్ అయితే మరీ కృతకంగా, బూతు సినిమాల్లో వాడే డైలాగ్స్ స్థాయిని తలపించాయి.సినిమాలో చాలా చోట్ల కూడా అలాంటి డైలాగ్స్ ఇబ్బందిపెట్టేలా ఉన్నాయి.
ఫస్ట్ హాఫ్ వరకు ఇలా అతలాకుతలంగా రోడ్డులేని దారిలో ఎడ్ల బండి ప్రయాణంలా కుళ్ళబొడిచిన షెర్లాక్ హోమ్స్ సెకండ్ హాఫ్ నుండి గుంతల రోడ్డులోకి జర్నీ మారిన ఫీలింగ్ కలిగిస్తుంది.ఉన్నంతలో చివర్లో సినిమా టీమ్ భారీ ట్విస్ట్ లా ఫీల్ అయిన క్లైమాక్స్ రివీలింగ్ ఎదో కాస్త బెటర్ అనే ఫీలింగ్ తప్ప అద్భుతం అన్న భావన కలగదు.అయితే అక్కడ కూడా చేసిన పాయింట్ ఎప్పుడో చూసేసిన సినిమాల తాలూకూ పాతవాసనలతో ఉండడంతో ఈ సినిమాకి చంటబ్బాయ్ తాలూకా అనే పాత సినిమా టైటిల్ ని తగిలించడం తప్పుకాదు అనిపిస్తుంది.
నటీనటులు:
ఈ సినిమాలో నటనని బట్టి వెన్నెల కిషోర్ ని జడ్జ్ చెయ్యాల్సిన పనిలేదు.పావుగంట పాత్రతో కూడా సినిమాలని నిలబెట్టేసిన టాప్ కమెడియన్ ఈ సినిమాలో మాత్రం ఎక్కడా ఆకట్టుకోవడానికి స్కోప్ దొరక్క ఇబ్బందిపడ్డాడు.కానీ ఇందులో అతని తప్పు ఏమీ లేదు.అందంతో పాటు అభినయంలో కూడా మంచి మార్కులు వేయించుకునే అనన్య నాగళ్ళకి ఈ సినిమాలో కాస్త డిఫరెంట్ రోల్ దక్కింది.ఆమెలో ఉన్న మరోకోణం ప్రేక్షకులకు పరిచయం చేసే అవకాశం వచ్చింది.ఈ సినిమా అందరికంటే ఆమెకే ఎక్కువ ఉపయోగపడింది అని చెప్పుకోవచ్చు.ఇప్పుడూ ఒక రకం పాత్రలతో రొటీన్ అనిపిస్తున్న టైం లో ఆమెకి ఇది ఒక మంచి అవకాశం.
ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన రవితేజ సహా మిగతావాళ్ల పాత్రలు సైతం ఎలాంటి ప్రత్యేకత లేకుండా నిలిచాయి.అసలు చాలా గ్యాప్ తర్వాత తెలుగులో నటిస్తున్న శియా గౌతమ్(అదితి గౌతమ్) ఏం చూసి ఆ పాత్ర ఒప్పుకుందో తెలియదు.ఆమెకి ఉన్న ఒకటి రెండు సీన్స్ లో సైతం అవసరానికి మించిన అభినయం చేసింది అనిపిస్తుంది.ఇక కాలకేయ ప్రభాకర్, అనీష్ కురువిల్లా లాంటి నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతిక నిపుణులు:
ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ సినిమాకి ఇంత బజ్ రావడానికి కారణం ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి.ఆయన ఈ మధ్య కాలంలో డిస్ట్రిబ్యూట్ చేసిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలవడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు ఏర్పడ్డాయి.కానీ సినిమా చూసాక ఈ సినిమా విషయంలో అతని జడ్జ్మెంట్ కూడా తప్పింది అనిపిస్తుంది.ఈ సినిమాకి సంబందించిన ప్రధాన లోపం రైటింగ్ లోనే ఉంది. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ డైరెక్టర్ కమ్ రైటర్ అయిన రైటర్ మోహన్ ఒక హాఫ్ బేక్డ్ స్టోరీ లైన్ తో ఈ సినిమాని తెరెకెక్కించారు అనిపించింది.టైటిల్ లో ఉన్న కామెడీ సినిమాలో లేక, ఎమోషన్స్ పండక,ట్విస్టులు పేలక చాలా ఇబ్బందిపడుతున్న స్క్రిప్ట్ ని ఎలా డైరెక్ట్ చేసారా అనే ఆశ్చర్యం కలుగుతుంది.
ఇక ఈ సినిమా నిర్మాతకి.. సినిమా నిర్మాణంపై అవగాహన లేదు కాబట్టి ఆయన్ని తప్పుబట్టలేం. సినిమాకి తగినట్టుగా ఖర్చు చేసారు అని అర్ధమవుతుంది. కెమెరా వర్క్ పర్లేదు. నేపధ్య సంగీతం ఓకే. మంగ్లీ పాడిన శ్రీకాకుళం పాట బావుంది.
చివరగా:
ఏ విధంగానూ ఆకట్టుకొని బోరింగ్ హోమ్.