NTV Telugu Site icon

Upendra UI Movie Review: ఉపేంద్ర యూఐ రివ్యూ

Upendra UI Movie Review

Upendra UI Movie Review

ఉపేంద్ర హీరోగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. గతంలో ఆయన దర్శకుడిగా చేసిన ఉప్పి 2, సూపర్, ఉపేంద్ర లాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే కనెక్ట్ అయ్యాయి. చాలా కాలం తర్వాత ఆయన మెగా ఫోన్ పట్టుకుని మరోసారి యుఐ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. గత కొద్దిnరోజులుగా తెలుగు మీడియా ముందుకు వచ్చి ఆయన చేస్తున్న ప్రమోషన్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. దానికి తోడు ట్రైలర్ సహా మిగతా ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను మరింత అంచనాలు పెంచే విధంగా ఉండడంతో సినిమా ఎలా ఉంటుందని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

కథ :
సినిమా ఓపెనింగ్ లోనే తెలివైన వాళ్ళు థియేటర్ నుంచి వెళ్లిపోండి అంటూ టైటిల్ కార్డు వేసి మొదలుపెట్టిన ఉపేంద్ర తర్వాత తాను ఓ సినిమా దర్శకుడిగా మారి చేసిన సినిమా చూసి జనాల్లో కొంతమంది రియాలిటీలోకి వచ్చి స్వార్ధాన్ని, భవ బంధాలను వదిలి తనకు ఫోకస్ దొరికింది అంటూ బయటికి వెళ్లిపోతూ ఉండడం చూపిస్తాడు. తర్వాత తరణ్ ఆదర్శ్ ను పోలిన క్యారెక్టర్ చేసిన మురళీ శర్మ అసలు ఆ సినిమా రివ్యూ చేయడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఉపేంద్ర రాసుకున్న మరో కథ చదువుతాడు. ఆ కథలోనే ఏముంది? తన తల్లి భూమాతను రియల్ ఎస్టేట్ మైనింగ్ మెడికల్ మాఫియాలు రేప్ చేశాయి అంటూ మొదలుపెట్టి ఆ రేప్ చేసిన తర్వాత పుట్టిన ఇద్దరు పిల్లలుగా సత్య, కల్కి అనే ద్విపాత్రాభినయం చేస్తూ ఉపేంద్ర కనిపిస్తాడు. భూమాతను ఇలా తయారు చేసిన వారందరికీ బుద్ధి చెబుతా అంటూ అదే భూమిని మరింత విధ్వంశానికి గురిచేస్తాడు. చివరికి మురళీ శర్మ తేల్చింది ఏంటి? అసలు ఉపేంద్ర తాను రాసుకున్న కథను ఎందుకు మార్చి సినిమా చేశాడు? చివరిగా యుఐ సినిమా ద్వారా ఉపేంద్ర చెప్పాలనుకున్న విషయం ఏమిటి? ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ: ఉపేంద్ర సినిమాలంటే ఎలా ఉంటాయో గతంలో ఆయన సినిమాలు చూసిన వారికి ఒక ఐడియా ఉంటుంది. ఆయన హీరోగా నటించిన సినిమాలు సంగతి పక్కన పెడితే ముఖ్యంగా ఆయన దర్శకుడిగా మారి చేసిన సినిమాలు మాత్రం భిన్నంగా ఉంటాయి. ఈ సినిమా కూడా ఆ భిన్నత్వానికి ఏమాత్రం లోటు తీసుకురాలేదు. సమాజంలో ఉన్న వివిధ వర్గాల వారిని ప్రశ్నిస్తూ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలను ఆలోచింపచేసేలా ఎత్తి చూపిస్తూ సూటిగా సుత్తి లేకుండా కొన్ని విషయాలు సుతిమెత్తగా కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశాడు. నిజానికి ఈ సినిమాలో చూసిన విషయాలు ఏవి కొత్తవి కాదు. కానీ ఉపేంద్ర తనదైన శైలిలో మనల్ని ప్రశ్నిస్తూ కథ నడిపించాడు. ఈ సినిమా ఉపేంద్ర సినిమాలు ఐడియా ఉన్నవారికి కనెక్ట్ అవ్వచ్చు కానీ కామన్ ఆడియన్స్ అలాగే సినిమాని ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చేవారికి కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అయితే సినిమాలో టచ్ చేసిన అనేక లేయర్స్ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా జాతీ, మతం లాంటి విషయాలను ఎత్తి చూపిస్తూనే 2040లో కూడా అలాంటి వాటికోసం కొట్టుకు చస్తున్నారు అన్నట్టుగా సినిమా చూపించడం మాత్రం కాస్త రియాలిటీ కి దగ్గరగానే ఉంది. అలాగే తిండి దొరకడం కూడా కష్టమైపోయిన రోజుల్లో క్రికెట్, బిగ్ బాస్ లాంటి వాటిని ఇంకా ప్రోత్సహిస్తూ ఉన్నట్టుగా చూపించిన విధానం ప్రేక్షకులను ఆలోచింపచేసే విధంగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమా నుంచి ఏదో ఎంటర్టైన్మెంట్ ఆశించి వెళ్ళిన వారికి కాస్త నిరాశ ఎదురవుతుంది ఎందుకంటే చీప్ సాంగ్, అలాగే ట్రోల్ సాంగ్ మినహా మిగతా ఎంటర్టైన్మెంట్ ఆశించడం కష్టం. ఉపేంద్ర మార్క్ సినిమా మొత్తం కనిపించింది. ఫస్ట్ ఆఫ్ అంత దర్శకుడిగా ఉపేంద్ర ఒక సినిమా చేసినట్టు ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది మారిపోయినట్టు చూపించడం మాత్రం రియాల్టీకి కాస్త దూరం అనిపిస్తుంది. ఆ తర్వాత ఉపేంద్ర రాసుకుని పడేసిన కథ కూడా ఒక ఫిక్షనల్ వరల్డ్ లోకి తీసుకువెళ్లి కాస్త బుర్రక పదును పెడుతుంది కానీ చివరికి ఊహించని విధంగా ప్రేక్షకులలో మెదడులలోనే అనేక ప్రశ్నలు రేకెత్తించే విధంగా ముగించడం గమనార్హం.. కథగా చూసుకుంటే ఇందులో ఏమీ లేదు. ప్రేక్షకులను ప్రశ్నించాలి వాళ్లలో ప్రశ్నించే గుణాన్ని పెంచాలి అనే ఉపేంద్ర తాపత్రయం తప్ప ఏమీ కనిపించదు.

ఇక నటీ నటుల విషయానికి వస్తే ఉపేంద్ర నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది ? ఎంతో అనుభవం ఉన్న ఆయన మరోసారి సత్య, కల్కి, ఉపేంద్ర అనే మూడు పాత్రలలో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. ఒకరకంగా వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. సినిమాను ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకునే విధంగా ముందుకు నడిపించాడు. హీరోయిన్ రీష్మ నన్నయ్య పాత్ర అనవసరమే. కేవలం సాంగ్ కోసమే తీసుకున్నట్టు అనిపించింది. ఇక సాయికుమార్ సోదరుడు రవిశంకర్ పాత్ర ఆధ్యంతం ఆసక్తికరంగా ఉంది. మిగతా పాత్రధారులు అందరూ కన్నడ వారే కావడం తెలుగువారికి కాస్త మైనస్ అయ్యే అంశం. అయితే పాత్రధారులు అందరూ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. టెక్నికల్ విషయానికి వస్తే ఉపేంద్ర మార్క్ స్క్రీన్ ప్లే, కథనం ఆకట్టుకుంటుంది. తెలుగు డైలాగ్స్ రాసిన రచయితకు వందకు వంద మార్కులు వేయాలి. అలాగే రాంబాబు గోసాల అందించిన లిరిక్స్ కూడా ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉన్నాయి అనడంలో సందేహం లేదు. ఉపేంద్ర పాత్రకు ఆర్సిఎం రాజు చెప్పిన డబ్బింగ్ కూడా కరెక్ట్ గా సెట్ అయింది. అయితే సినిమా గ్రాఫిక్స్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉండాల్సింది. ఎందుకంటే గ్రాఫిక్స్ కాస్త తక్కువ రకం అని కొన్నిచోట్ల అనిపిస్తుంది కూడా. బడ్జెట్ కూడా భారీగా అయినట్లు చెప్పారు కానీ అంత స్కోప్ ఉందా అని అనుమానం కలిగితే అది మీ అనుమానం కాదు. అయితే నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్లీ ఈ యూఐ ఉప్పీ ఫ్యాన్స్ కి మాత్రమే!!