Nayakudu Movie 2023 Telugu Review: ఈ మధ్య కాలంలో ఇతర దక్షిణాది భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. గతంలో ఎప్పటికో రిలీజ్ చేసేవారు కానీ ఇప్పుడు మాత్రం వారాల వ్యవధిలోనే రిలీజ్ చేస్తున్నారు. అలా ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ అయి సూపర్ హిట్ కాగా తాజాగా తమిళంలో సూపర్ హిట్ అయిన మామన్నన్ సినిమాను తెలుగులో నాయకుడు పేరుతో రిలీజ్ చేశారు. మారి సెల్వరాజ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ఫహాద్ ఫాజిల్, వడివేలు, కీర్తి సురేష్ వంటి భారీ స్టార్ కాస్ట్ కూడా ఉండడంతో సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ఉదయనిధి స్టాలిన్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లేముందు చివరి సినిమా అని చెప్పడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? లేదా అనేది రివ్యూలో చూద్దాం.
కథ ఏమిటంటే?
రఘువీరా (ఉదయనిధి స్టాలిన్) ఒక ఎమ్మెల్యే కొడుడు. తండ్రి తిమ్మరాజు (వడివేలు) రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే అయినా రఘువీరా తండ్రి బాటలో నడవకుండా ప్రాచీన మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గా పని చేస్తూనే ఇంటి దగ్గరలో పందులను కూడా పెంచుతూ ఉంటాడు. ఇక మరో పక్క లీల (కీర్తి సురేష్), రఘువీరా క్లాస్‌మేట్, ఆమె కాలేజీలో ఉన్నప్పటి నుంచే ఇద్దరికీ మాటలు ఉండవు. ఈ క్రమంలో లీల పేదవారికి ఉచితంగా విద్య అందించడం కోసం ఇన్‌స్టిట్యూట్ ప్రారంభిస్తుంది కానీ కొన్ని ఇబ్బందులు రావడంతో లోకల్ ఎమ్మెల్యే అయిన తిమ్మరాజు దగ్గరకు వెళ్తారు. అదే సమయంలో వారి మంచి కారణం విని రఘువీరా తన మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌ను ఇన్‌స్టిట్యూట్ కోసం వాడుకోమని చెబుతాడు. అయితే ఒక రోజు కొంతమంది దుండగులు బిల్డింగ్‌పై దాడి చేసి మొత్తం ధ్వంసం చేయడంతో వాకబు చేస్తే తిమ్మరాజు పార్టీకే చెందిన కాకాని రత్నవేలు (ఫహాద్ ఫాజిల్) అన్న(సునీల్ రెడ్డి) హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. గొడవ పెద్దది కావడంతో సెటిల్మెంట్ కు కూర్చునే సమయంలో గొడవ మొదలయింది. అయితే అప్పటిదాకా తండ్రితో మాట్లాడని రఘువీరా తండ్రి కోసం రత్నవేలు మీద తిరగబడతాడు. ఈ క్రమంలో ఆ తర్వాత ఏమైంది? రఘువీరా తన తండ్రి తిమ్మరాజుతో 15 ఏళ్లు ఎందుకు మాట్లాడటం లేదు? చివరికి తండ్రి కోసం రఘువీరా ఏమి చేశాడు? రత్నవేలు తిమ్మరాజు కుటుంబాన్ని ఏమి చేశాడు ? అనేదే సినిమా కథ.
విశ్లేషణ: దళితులు లేదా నిమ్న వర్గాల పై దాడులు, ఆకృత్యాలు ప్రాంతాలతో సంబంధం లేకుండా దేశంలో అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. సో ఈ దేశవ్యాప్తంగాప్రతి ఒక్కరూ సినిమాలోని కథకు కనెక్ట్ అవుతారు. అయితే కథనం అలాగే పాత్రలను కూడా పూర్తిగా తమిళ నేటివిటీకి బాగా దగ్గరగా ఉండడంతో తెలుగు ప్రేక్షకులు పూర్తి స్థాయిలో కనెక్ట్ అవలేరు. అయితే గుండెలను పిండేసే విధంగా చూపించిన కొన్ని సీన్స్ కు మాత్రం అందరూ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నిజానికి ముందు నుంచి మారి సెల్వరాజ్ సినిమాలు రొటీన్ సినిమాలకు భిన్నమే. ఆయన చేసే సినిమాల్లో కథ కంటే సీన్స్ అలాగే కొన్ని ఫ్రేమ్స్ కూడా ఎక్కువగా మాట్లాడతాయి. ఇక మారి సెల్వరాజ్ చేసిన మొదటి రెండు సినిమాల తరహాలోనే ఈసారి కూడా కుల సమస్యనే ప్రధానంగా ఎంచుకుని చూపారు. ఎలా అంటే హీరోకు పందులంటే చాలా ఇష్టం కావడంతో పందులను పెంచుకుంటూ ఉంటాడు. విలన్ రేసుల కోసం కుక్కలను పెంచుతూ ఉంటాడు. అలా వారు ఇద్దరూ వాటితో నడుచుకునే తీరుతో వారి మనస్తత్వాలు సినిమా మొదట్లోనే చూపే ప్రయత్నం చేస్తాడు. ఇక ఆ తరువాత ఆత్మాభిమానం, సామజిక న్యాయం అనే కోణంలో సినిమా నడుస్తుంది.
ప్లస్ పాయింట్
ఇంటర్వెల్ బ్యాంగ్
ఉదయనిధి స్టాలిన్ సహా స్టార్ కాస్ట్
డైలాగ్స్
మ్యూజిక్
మైనస్ పాయింట్స్
నిడివి
తెలుగు వారికి నచ్చేలా తెలుగీకరించలేక పోవడం
ఎవరెలా చేశారంటే?
ఈ సినిమాలో హీరో ఉదయనిధి అయినా మనకి మాత్రం వడివేలు ఒకసర్ప్రైజ్ ప్యాకేజ్. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఒక కమెడియన్ లా మాత్రమే చూసిన వడివేలు ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా నిస్సహాయుడిగా, సెకండ్ హాఫ్ లో మాత్రం కొడుకు కోసం ఎంతకైనా తెగించే వాడిలా వడివేలు నటన నభూతో న భవిషత్.. కొన్ని సీన్స్ ఆయన పెర్ఫార్మెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక ఉదయనిధి కూడా తన పాత్రతో అందరినీ మెప్పించాడు. అయితే ఫహద్ కి నటించే స్కోప్ ఉన్న రోల్ దొరికింది. ఎందుకంటే ఇప్పటిదాకా చాలా నెగిటివ్ రోల్స్ లో నటించాడు కానీ ఈ రత్నవేలు పాత్ర వాటన్నిటికీ బాప్ లాంటిది. ఎన్నో భావాలు ఫహాద్ కళ్ళల్లో స్పష్టంగా కనిపించేలా జీవించాడు. కీర్తి సురేష్ హీరోయిన్ అనుకొన్నా ఆమెది సైడ్ క్యారెక్టర్ లా అనిపించింది. ఇక టెక్నికల్ విభాగానికి వస్తే దర్శకుడు మారి సెల్వరాజ్ గత సినిమాల కంటే హింస తగ్గించాడు. దర్శకుడిగా, కథకుడిగా, కొన్ని డైలాగ్స్ తో రచయితగా కూడా మారి సెల్వరాజ్ మూడోసారి కూడా మంచి విజయం సాధించాడు. సినిమాటోగ్రాఫర్ తేని ఈశ్వర్ 80స్ అలాగే వర్తమానం మధ్య ఉన్న తేడాను లైటింగ్ తో చాలా క్లారిటీగా చూపించగా కొన్ని సీన్స్ అయితే గూజ్ బంప్స్ తెప్పించేలా షూట్ చేశారు. రెహమాన్ సంగీతం గురించి చెప్పేదేముంది కానీ తెలుగు వారికి కనెక్ట్ అవడం కష్టమే, ప్రాణమే అనే సాంగ్ మాత్రం వినసొంపుగా ఉంది. ఇక ఆయన నేపధ్య సంగీతంలో కొత్తదనం ఉందనిపించింది. అయితే తెలుగీకరించే విషయంలో కొంచెం కేర్ తీసుకుని ఉండాల్సింది. మరీ ముఖ్యంగా డిస్క్లైమర్ ను కూడా గూగుల్ ట్రాన్స్ లెట్ చేసి వేసేయకుడా ఉండాల్సింది.
బాటమ్ లైన్:
వడివేలు యాక్టింగ్, రెహమాన్ ఆర్ఆర్, మారి సెల్వరాజ్ మార్క్ సీన్స్ కోసం “నాయకుడు” ఒకసారి చూసేయచ్చు కానీ తెలుగు వారందరికీ కనెక్ట్ కాకపోవచ్చు.