NTV Telugu Site icon

ARM Movie Review: ఏఆర్ఎమ్ రివ్యూ: మలయాళ స్టార్ టోవినో థామస్ సినిమా ఎలా ఉందంటే?

Arm Review

Arm Review

Tovino Thomas ARM Movie Review: హీరో టోవినో థామస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్”ARM” తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టోవినో థామస్ 50మైల్ స్టోన్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్ గా నటించారు. డెబ్యుటెంట్ జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్ జకారియా థామస్‌తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించగా విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్ గా విడుదల చేస్తున్న “ARM” సెప్టెంబర్ 12న విడుదల అయింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం పదండి.

ARM కథ:
అజయన్ (టోవినో థామస్ 3) ఓ రేడియో మెకానిక్. చియోతి కావు అనే ఊరిలో అతని తాత మణియన్ (టోవినో థామస్ 2) దొంగ కావడంతో అజయన్ ను ఎవరూ గౌరవించరు సరికదా అన్ని విషయాల్లో అవమానిస్తూ ఉంటారు. ఊరిలో ఏ దొంగతనం జరిగినా పోలీసులు అజయ్ ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోతూ ఉంటారు. అయితే ఊరి ప్రజలు తమను గౌరవంగా చూడాలని అజయన్ తల్లి (రోహిణి) కలలు కంటూ ఉంటుంది. ఇక ఏడాదికి ఒకసారి జరిగే ఆ ఊరి ఉత్సవాలను డాక్యుమెంటరీగా చేయడానికి రాజవంశస్థుడు సుదేవ్ వర్మ (హరీష్ ఉత్తమన్) ఊరికి ఒక ప్లాన్ తో వస్తాడు. నిజానికి 1900ల కాలంలో కేరళలోని హరిపురం అనే ప్రాంతంలో తన రాజ్యాన్ని కాపాడిన కేలు (టోవినో థామస్ 1) ధైర్య సాహసాలను మెచ్చి ఎడక్కల్ మహారాజు బహుమతిగా ఒక మహిమాన్వితమైన శ్రీభూతి దీపం (అమ్మవారి విగ్రహం) ఇస్తాడు. అది అజయన్ ఊరిలో ఉండగా దానికే ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. సరిగ్గా ఆ ఉత్సవాల ముందు అమ్మవారి విగ్రహం ఒకరు దొంగిలిస్తారు. ఆ దొంగతనం అజయ్ మీదకు తోసివేసే ప్రయత్నం చేస్తే అప్పుడు అజయ్ ఏం చేశాడు? నిజమైన విగ్రహం ఎక్కడ ఉంది? ఆ విగ్రహం కోసం మణియన్, కేలు ఏం చేశారు? లక్ష్మి(కృతి శెట్టి)తో అజయ్ ప్రేమకథ ఏమిటి? అతను ప్రేమించిన లక్ష్మి(కృతి శెట్టి) ఎందుకు దూరం అయింది? చివరికి ఆమెను చేరుకున్నాడా? లేదా? ఈ మొత్తం కథలో సురేష్(బాసిల్ జోసెఫ్) పాత్ర ఏమిటీ అనేది తెలియాలి అంటే సినిమా మొత్తాన్ని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
ఈ సినిమా మొదలైనప్పుడు కథ చూస్తే కనుక ఏదో నడుస్తుందిలే అనిపిస్తుంది. ముందుగా పరిచయమైన ఒక యోధుడిగా టోవినో థామస్ చేసే యాక్షన్ భలే అనిపిస్తుంది. అయితే తర్వాత మహారాజు అమ్మవారి విగ్రహం ఇవ్వడం మొదటి టోవినో థామస్ పాత్ర మరణించడం వెంట వెంటనే జరిగిపోయి ప్రస్తుత కాలానికి కథ చేరుకుంటుంది. ఇక ప్రస్తుత కాలానికి వచ్చిన తర్వాత జరిగే సన్నివేశాలు గతంలో మనం కొన్ని సినిమాల్లో చూసినట్లే అనిపించినా కేరళ నేపథ్యం కాస్త కొత్తగా అనిపిస్తుంది. ఏదో అద్భుతం అనిపించే మూమెంట్స్ లేకపోయినా భలే సాగుతోంది అనిపించేలా స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. నిజానికి ఈ సినిమాలో మూడు పాత్రలు. ఒకటి యోధుడి పాత్ర అయితే మరొకటి దొంగ పాత్ర ఇంకొకటి ఆ దొంగ మనవడిగా ఆ దొంగ ముద్ర పడకుండా తన తల్లి బాధపడకుండా ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడానికి ప్రయత్నించే కుర్రాడు పాత్ర. కథ అద్భుతం అని చెప్పలేం కానీ నాన్ లినియర్ స్క్రీన్ ప్లే ని నమ్ముకుని ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశారు. నిజానికి దీనిని ఒక కుటుంబ తరతరాల కథగా చూపించినట్లు అనిపించింది కానీ ఇండైరెక్టుగా అప్పటి నుంచి ఇప్పటివరకు సాగుతున్న కుల వివక్షను అండర్ లైన్ గా చూపించిన ఫీలింగ్ కలుగుతుంది. కథ మూడు తరాలకు చెందిన కథ అయినా సినిమా మొత్తం పీరియాడిక్ వేలోనే సాగుతుంది. సినిమాలో విగ్రహం కోసం వెతుకుతున్న సమయంలో మనకు కొన్ని తెలుగు సినిమాలు జ్ఞప్తికి వచ్చినా ఇది మలయాళ ప్రేక్షకుల కోసం రాసుకున్న సినిమా కాబట్టి వాళ్ళను అలరించే లాగానే ఉంది అనిపించింది. ఎందుకంటే ఇప్పటివరకు దాదాపుగా మలయాళం లో ఎంత బడ్జెట్లో, ఇలాంటి యాక్షన్ బ్యాక్ డ్రాప్ అది కూడా పీరియాడిక్ సినిమాలు చేయలేదు. ఒకరకంగా ఇది వాళ్లకు బాహుబలి లాంటి సినిమా అని చెప్పొచ్చు. నిజానికి స్క్రీన్ మీద అలాగే కనిపించింది. అయితే ఈ సినిమా తెలుగు వారికి కనెక్ట్ అయ్యే అవకాశాలు కాస్త తక్కువే కానీ టెక్నికల్ గా చూసుకుంటే మాత్రం ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు.

ఇక నటీనటుల విషయానికి వస్తే సినిమాలో టోవినో థామస్ మూడు పాత్రలలో అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా ఆ పాత్రల మధ్య వేరియేషన్ చూపించిన విధానం ఆకట్టుకునేలా ఉంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు ప్రేమ సన్నివేశాల్లో కూడా జీవించాడు. ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణలలో టోవినో థామస్ ముందు వరుసలో ఉంటాడు. లక్ష్మీ అనే పెద్దింటి అమ్మాయి పాత్రలకు కృతి శెట్టి అందంగా కనిపించింది. తన పాత్ర పరిధికి తగ్గట్టు ఆమె ఆకట్టుకుంది. ఇక ఐశ్వర్య రాజేష్ పాత్ర చాలా పరిమితం. ఇక సురభి లక్ష్మీ నటన చాలా న్యాచురల్ గా ఉంది రోహిణి కూడా నాచురల్ ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకుంది. ఇక బాసిల్ జోసెఫ్ కనిపించింది కొంతసేపైనా ఉన్నంతలో నవ్వించాడు. టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాకి ప్రధానంగా చెప్పుకోవాల్సింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్. సినిమాలో పాటలు కొన్ని వినసొంపుగానే ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మాత్రం ఇరగదీసేసాడు డిబూ థామస్. ఇక కెమెరా వర్క్ కూడా అత్యద్భుతంగా ఉంది. అడవిలో అత్యధిక భాగం నడిచిన ఈ సినిమాను చాలా అద్భుతంగా తెర మీదకు తీసుకువచ్చే ప్రయత్నంలో కెమెరా పనితనం కనిపించింది.

ఫైనల్లీ ఏ ఆర్ ఎం టోవినో థామస్ ఫ్యాన్స్ కి ఒక ఫుల్ మీల్స్ లాంటి సినిమా. తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం కష్టమే కానీ మలయాళ ప్రేక్షకులు పట్టం కట్టేసే అవకాశాలున్నాయ్.

Show comments