ఈ మధ్య మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తున్న ట్రెండ్ బాగా ఎక్కువైంది. ఒక్కోసారి తమ సినిమాల మీద నమ్మకం ఉంటే ఆ సినిమాలతో పాటే తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. అలా మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘తుడరుమ్’ అనే సినిమా నిన్న మలయాళంలో రిలీజ్ కాగా ఈ రోజు తెలుగులో రిలీజ్ అయింది. శోభన మోహన్‌లాల్ సరసన నటించగా, భారతీ రాజా సహా పలువురు మలయాళ స్టార్ యాక్టర్స్ నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
కథ:
షణ్ముగం అలియాస్ బెంజి(మోహన్ లాల్) కేరళలోని పెరునాడ్ ప్రాంతంలో టాక్సీ నడుపుతూ జీవితం గడుపుతూ ఉంటాడు. భార్య(శోభన) సహా ఇద్దరు పిల్లలతో సాఫీగా సాగిపోతున్న జీవితం, అయితే అనుకోకుండా ఒక మర్డర్ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుంది. అయితే తన కుమారుడు కనిపించడం లేదని తెలుసుకొని, కుమారుడిని ట్రేస్ చేసే పనిలో పడగా, తన కొడుకును చంపి పాతిపెట్టిన వ్యవహారంలో తాను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నానని తెలుసుకుంటాడు. అసలు తన కొడుకును ఎవరు చంపారు? ఎందుకు చంపాల్సి వచ్చింది? చివరికి తన చేతనే ఎందుకు శవాన్ని మాయం చేయించాలని ప్రయత్నించారు? అసలు బెంజి పూర్వాశ్రమం ఏమిటి? తన భార్య మొదటి భర్త ఎవరు? అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ:
సినిమా ఓపెనింగ్ ఈ మధ్యకాలంలో కేరళలో జరిగిన ల్యాండ్‌స్లైడ్ తలపించే దృశ్యాలతో మొదలవుతుంది. ఇదేదో కొత్తగా ఉందని అనుకుంటూ ఉండగానే, అదేమీ లేదని దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. ఒక తండ్రి, ఒక తల్లి, ఒక కుమారుడు, ఒక కుమార్తె సాఫీగా సాగిపోతున్న జీవితం. అనుకోకుండా వీరి జీవితంలో కొన్ని కుదుపులు వస్తాయి. ఆ తర్వాత వాటి నుంచి బయటపడేందుకు హీరో సహా కుటుంబం ఎలా ప్రయత్నించింది అనేది మెయిన్ పాయింట్. అయితే ఇక్కడ ఫ్యామిలీ మధ్య ఎమోషన్స్ క్రియేట్ చేసే విషయంలో దర్శకుడు పూర్తిస్థాయిలో సఫలం కాలేదు. దానికి తోడు ఫస్ట్ హాఫ్ కథ సాగుతున్న ఫీలింగ్ మరియు దారణంగా అనిపిస్తుంది. ఎందుకు కథను ఎక్కడెక్కడో తిప్పుతున్నాడని అనుమానాలు కూడా ప్రేక్షకులకు కలుగుతాయి. అయితే ఎప్పుడైతే ఇంటర్వెల్ వస్తుందో, ఇక అప్పటినుంచి కథ వేగం పుంజుకుంటుంది. కానీ ట్విస్ట్ రివీల్ అయిపోయిన తర్వాత ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా కథ రాసుకోవడంలో దర్శకుడు తడబడ్డాడు. నిజానికి హీరో కుమారుడిని చంపేసి, ఆ నింద హీరో కుటుంబం మీద వేయడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నిస్తున్న క్రమంలో తన కుటుంబం మీద పడ్డ నిందను తొలగించడం కంటే ఎక్కువగా పగ తీర్చుకోవడం మీద హీరో ఫోకస్ పెట్టాడు. బహుశా తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తే దృశ్యం ఫ్రాంచైజ్ ఛాయలు దీని మీద పడతాయని భావించాడో ఏమో తెలియదు. కానీ ఆ విషయంలో దర్శకుడు చాలా జాగ్రత్త పడ్డాడు. కానీ ఇలా లైన్ తీసుకున్నా కూడా దాన్ని మరింత ఎలివేట్ చేసేలా రాసుకుని ఉండొచ్చు. కానీ హీరో ఎలివేషన్స్ మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు దర్శకుడు. చివరిలో అడవి నుంచి వచ్చిన అడవి ఏనుగులా విరుచుకుపడతాడు హీరో. ఆ దానికోసమే ఈ కథంతా రాసుకున్నారేమో అనే ఫీలింగ్ కలిగితే అది మన తప్పు కాదు. నిజానికి ఏనుగుల కుటుంబంతో హీరో కుటుంబాన్ని చూపిస్తూ, ఒక గుండె ఏనుగు తప్పిపోతే ఆ గుండె ఏనుగు కోసం ఆ ఏనుగుల గుంపు పడే తపనను సింబాలిక్‌గా చూపించిన విధానం బాగుంది. అలాగే కొన్ని డీటెయిల్స్ అబ్బురపరుస్తాయి. కానీ ఫస్ట్ హాఫ్ సాగదీయడం, ఎమోషన్స్ ఎస్టాబ్లిష్ చేయడంలో తడబడటం కారణంగా ఈ సినిమా మన ప్రేక్షకులకు ఎక్కడం కష్టమే. అలా అని మంచి సినిమా కాదా అంటే అలా అని కూడా అనలేను. ఎందుకంటే టెక్నికల్‌గా ఈ సినిమాను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో టీం కష్టపడింది. అన్నట్టు, ఈ సినిమా టైటిల్‌కి అర్థం కొనసాగింపు లేదా కొనసాగుతోంది అంటే ఈ సినిమాకి సీక్వెల్ ఉండే అవకాశాలు మిక్కిలి ఎక్కువే.
నటీనటుల విషయానికి వస్తే:
ఈ సినిమాలో మోహన్‌లాల్ ఎప్పటిలాగే విశ్వరూపం చూపించాడు. శోభన సహా మలయాళ నటీనటులందరూ ఆకట్టుకునేలా నటించారు. ముఖ్యంగా సీఐఎస్ఐ పాత్రలలో నటించిన నటీనటులు ఇద్దరూ తమ పాత్రలతో సినిమాను చాలా వరకు నడిపించారనడంలో సందేహం లేదు. ఇక ఆ తర్వాత దీనికి సీక్వెల్ కోసమో ఏమో తెలియదు, కానీ విజయ్ సేతుపతి ఫోటోలు వాడారు. బహుశా సెకండ్ పార్ట్‌లో ప్లాన్ చేసే అవకాశం ఉందేమో. టెక్నికల్ టీం విషయానికి వస్తే: షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ వర్క్ ఈ సినిమాకి ప్రధానమైన ప్లస్ పాయింట్. వరదల కారణంగా ఏర్పడిన బీభత్సాన్ని డ్రోన్ షాట్స్‌తో కవర్ చేసిన తీరు, నైట్ షాట్స్‌ను, లైటింగ్‌ను మ్యానేజ్ చేసిన విధానం అభినందనీయం. అలాగే సినిమాకి సంబంధించి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ కూడా ప్రధానమైన ప్లస్ పాయింట్స్‌లో ఒకటిగా చెప్పవచ్చు. ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకా కష్టపడి ఉంటే ఫలితం ఇంకా తెలుగు ప్రేక్షకులకు కూడా వర్కౌట్ అయ్యేలా ఉండేదేమో.
ఫైనల్‌గా: ఈ తుడరుమ్ అంచనాలు లేకుండా వెళ్తే ఎంగేజ్ చేసే థ్రిల్లర్.