The Night Manager 2 Review: ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లను విపరీతంగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు, ఈ క్రమంలో ఒక సీజన్ హిట్ అయితే మరో సీజన్ ను కూడా చేసి రిలీజ్ చేస్తున్నారు. అలా ది నైట్ మేనేజర్ సీజన్ కు కొనసాగింపుగా సెకండ్ సీజన్ రిలీజ్ చేశారు. అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, తిలోత్తమ షోమ్, శోభితా ధూళిపాళ, శాశ్వత్ ఛటర్జీ నటించిన ది నైట్ మేనేజర్ 2 ఈ మధ్యనే రిలీజ్ అయింది. మరి ఇంకెందుకు ఆలస్యం రివ్యూలో ఎలా ఉందో చూసేద్దాం పదండి.
కథ ఏమిటి:
అసలు ఈ రెండో సీజన్ కథ ఏంటి అనేది తెలియాలంటే మొదటి సీజన్ గురించి అవగాహన ఉండాలి. ఎందుకంటే ఈ సిరీస్‌ను 4 ఎపిసోడ్‌లు ఒక సీజన్ గా మరో మూడు ఎపిసోడ్‌లను రెండో సీజన్ గా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. అలా ‘ది నైట్ మేనేజర్ 2’ కథ మొదటి భాగం ముగిసిన చోట నుండి కొనసాగుతుంది. షాన్ సేన్ గుప్తా (ఆదిత్య రాయ్ కపూర్) శైలేంద్ర రుంగ్తా (అనిల్ కపూర్)కి సన్నిహితుడుగా మారతాడు. అయితే, బ్రిజ్‌పాల్ (శాశ్వత్ ఛటర్జీ) షాన్‌ని మొదటి నుంచీ అనుమానిస్తూనే ఉంటాడు. అయితే షాన్ శైలేంద్రను బహిర్గతం చేసే పనిలో ఉండగా అతనికి ఆ పనిని అప్పచెప్పిన లిపికా రావు (తిలోత్తమ షోమ్) పవర్ కోల్పోతుంది. అయితే షాన్ మారి శైలేంద్ర రుంగ్తాతో చేతులు కలిపినట్టు అనుమానిస్తుంది. ఇక మరోవైపు, కావేరి (శోభిత)కి కొన్ని రహస్యాలు ఉన్నాయని శైలేంద్ర నిలదీస్తాడు. ఈ క్రమంలో షాన్ సేన్ గుప్తా శైలేంద్రను ఇరికించాడా? కావేరితో మొదలయిన షాన్ రిలేషన్ ఎక్కడి దాకా సాగింది? లాంటి విషయాలు తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
‘ది నైట్ మేనేజర్ 1’ మీకు నచ్చి దాని కొనసాగింపు ఎలా ఉంటుంది అని మీరు చూసేందుకు ప్రయత్నిస్తుంటే కనుక సీజన్ 1 కంటే సీజన్ 2లో విషయం అయితే లేదు. షాన్ (ఆదిత్య రాయ్ కపూర్) నైట్ మేనేజర్ వృత్తిని వదిలి షెల్లీ (అనిల్ కపూర్) అంతర్గత సర్కిల్‌లో బలమైన స్థానాన్ని సంపాదిస్తాడు. లిపికా సైకియా రావు (తిలోత్తమ షోమ్) ఇబ్బందుల్లో పడడంతో షాన్ ఇప్పుడు సొంతంగా అన్నీ చేయాల్సి వస్తుంది. అలా షాన్ ముందుకు సాగుతున్న కొద్దీ కథలో థ్రిల్ పెరుగుతుంది. సీజన్ 2లో, కథాంశం, కథనం ఆసక్తికరంగా ఉన్నా ఇందులో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ట్రైలర్ మరియు టీజర్‌లో బాంబు పేలుడు దృశ్యాన్ని చూపించడం చూశాం, ఇది చూస్తుంటే సిరీస్ నిజంగా ప్రమాదకరంగా మారుతుందని అనిపించింది కానీ అయితే అదే సీన్‌ను సిరీస్ లో చూపించినప్పుడు అది జోక్‌గా అనిపించింది. ఎందుకంటే ఆ పేలుడు దృశ్యాన్ని చాలా తేలికైన రీతిలో షూట్ చేశారు. అలాగే సిరీస్ ముగింపు కూడా సోసోగా ఉంది. చివరి ఎపిసోడ్‌లో అనిల్ కపూర్ నటన చాలా నకిలీగా అనిపించింది. మిగిలిన కథ కూడా మధ్యలో కాస్త స్లోగా కనిపిస్తుంది, దాన్ని స్పీడ్‌గా చూపించవచ్చు. ‘ది నైట్ మేనేజర్’ రెండో భాగంలో మూడు ఎపిసోడ్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక గంట పడుతుంది. కాబట్టి మీకు మూడు గంటల కంటే ఎక్కువ సమయం ఉంటే, అప్పుడే దాన్ని చూడటానికి కూర్చోండి.
Lust Stories 2 Review: లస్ట్ స్టోరీస్ 2 రివ్యూ
నటీనటుల విషయానికి వస్తే షాన్ సేన్‌గుప్తా పాత్రలో ఆదిత్య రాయ్ కపూర్ చాలా అద్భుతమైన నటన కనబరిచారు. తన ఎక్స్‌ప్రెషన్‌స్ కంటే అద్భుతమైన యాక్షన్ కూడా చేశాడు. శైలేంద్ర రుంగ్తా పాత్రలో, అనిల్ కపూర్ ఒక వ్యాపార దిగ్గజం పాత్రను చాలా పర్ఫెక్ట్‌గా పోషించాడు. శైలేంద్ర ప్రియురాలు కావేరి పాత్రలో శోభిత ధూళిపాళ తన పాత్రకు న్యాయం చేసింది. ఆమె పాత్ర మొదటి సీజన్ కంటే చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. శాశ్వత్ ఛటర్జీ పాత్ర చిన్నదే అయినా, షెల్లీకి విధేయుడిగా నటించాడు. ఇక తిలోత్తమ షోమ్‌కి ఈసారి మంచి స్క్రీన్ టైమ్ వచ్చింది. రెండవ భాగంలో, తిలోత్తమ షోమ్ రా ఆఫీసర్ పాత్రలో శివంగిలా గర్జిస్తూ కనిపించింది.
టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే ఈ ‘ది నైట్ మేనేజర్’ అనేది 2016 అనే హాలీవుడ్ సిరీస్‌కి హిందీ అనుకరణ. ఈ సిరీస్‌కి సందీప్ మోదీ, శ్రీధర్ రాఘవ్ దర్శకత్వం వహించగా అందులో ఇద్దరూ బాగా పనిచేశారు. ప్రతి సన్నివేశం స్క్రీన్‌పై వివరంగా కనిపిస్తుంది. అదే సమయంలో, స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకుంది. ప్రతి సన్నివేశం ఉత్సాహంగా, అర్థవంతంగా ఉండడమే కాదు ఈ థ్రిల్లర్ సిరీస్‌లో అనవసరమైన డైలాగులు కూడా వినపడవని అంటే ఎంత శ్రద్ధ తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది, సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఎడిటింగ్ టేబుల్ మీద శ్రద్ధ పెట్టాల్సింది.
బాటమ్ లైన్: సీజన్ 1తో పోలిస్తే అంత ఇంట్రెస్టింగ్ అనిపించకున్నా వన్ టైమ్ వాచబుల్.