NTV Telugu Site icon

The GOAT Review: విజయ్ ‘ది గోట్’ రివ్యూ.. హిట్ కొట్టాడా? లేదా?

The Goat Review

The Goat Review

Vijay’s The GOAT Review: దళపతి విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. స్నేహ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవా, లైలా, జయదేవ్ ఇతర కీలక పాత్రలలో నటించారు. ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మించిన ఈ సినిమాను పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేసింది. ప్రమోషన్స్ విషయంలో టీం అండర్ ప్లే చేస్తోన్న ‘The GOAT’ సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన తరువాత చేసిన చివరి సినిమా అని ప్రచారం జరగడంతో ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

కథ:
గాంధీ (తలపతి విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్. తన టీం మేట్స్ సునీల్ ( ప్రశాంత్), అజయ్ (అజ్మల్), కళ్యాణ్ సుందరం (ప్రభుదేవా)తో కలిసి సీక్రెట్ మిషన్స్ చేస్తూ ఉంటాడు. తన భార్య అను (స్నేహ) సహా ఎవరికీ ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఇక ఒక మిషన్ కోసం విదేశాలకు వెళ్లిన క్రమంలో ఐదేళ్ళ కొడుకు జీవన్ మరణిస్తాడు. అప్పటికే గర్భంతో ఉన్న అను ఒక పాపకు జన్మనిచ్చి కొడుకు దూరం కావడానికి భర్త ఉద్యోగమే కారణమని భావించి దూరం పెడుతుంది. గాంధీ కూడా కొడుకు తన వల్లే చనిపోయాడని భావించి గిల్టీగా ఫీల్ అవుతూ ఫోర్స్ కి దూరం అవుతాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పని కోసం మాస్కో వెళ్ళగా అక్కడ చనిపోయాడు అనుకున్న కొడుకు జీవన్ (తలపతి విజయ్ 2) కనిపిస్తాడు. సంతోషంగా ఇండియా తీసుకు వచ్చాక తన అనుకున్న వాళ్ళు మరణిస్తూ ఉంటారు. అసలు ఆ మరణాలు ఎలా చోటు చేసుకున్నాయి? అసలు చనిపోయాడు అనుకున్న జీవన్ ఎలా తిరిగి వచ్చాడు? తన వాళ్ల మరణాలను గాంధీ ఎలా ఆపాడు? అనే విషయం తెలియాలి అంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన గోట్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా కథ చూసుకుంటే కొత్త కథ ఏమీ కాదు. మనం గతంలో ఎన్నో సార్లు చూసిన కథే. రక్షణ విభాగాల్లో పని చేసే హీరో, అతని స్నేహితుల గాంగ్ అనే పాయింట్ తో చాలా సినిమాలు వచ్చాయి. దాదాపు ఇది కూడా అలాంటి పాయింట్ తోనే తెరకెక్కింది. అలాగే హీరో కొడుకుని విలన్ పెంచి హీరో మీదే ప్రయోగించే సినిమాలు కూడా చాలా వచ్చాయి. ఈ సినిమాల్లో కూడా అదే పాయింట్ను ప్రధానంగా ఎంచుకున్నారు. అయితే హీరో కొడుకు తండ్రి మీదే పగ తీర్చుకోవడానికి వచ్చిన తర్వాత రాసుకున్న సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా నడిపించాయి. అయితే హీరో కొడుకును హీరో కలిసేందుకు ఎంచుకున్న ఎత్తుగడ సినిమాని చాలా వరకు డ్రాగ్ చేయడానికి కారణమైంది.. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ తో పాటు ఇతర క్యారెక్టర్ లను ఎస్టాబ్లిష్ చేసేందుకు చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు. ప్రీ ఇంటర్వెల్ వరకు సినిమా మొత్తం ఊహించ తగ్గట్టే ఉంటుంది. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత చాలాసేపు ఊహక తగ్గట్టుగానే స్క్రీన్ ప్లే కూడా నడుస్తూ ఉంటుంది. కానీ క్లైమాక్స్ కాస్త ఆసక్తికరంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేసుకోవడంలో వెంకట్ ప్రభు సక్సెస్ అయ్యాడు. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు ఎక్కువ అనిపించినా అది మీ తప్పు కాదు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్ బెటర్ గా ఉంది. తండ్రిపై కొడుక్కి ఏర్పరిచిన పగ విషయం బానే ఉంది కానీ ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఈ సినిమా విజయ్ అభిమానులకు ముఖ్యంగా తమిళనాడులో బాగా నడవచ్చు. మిగతా ప్రేక్షకులకు మంచి ఎక్స్ పీరియన్స్ సినిమా అవచ్చు. అయితే సినిమా నిడివి విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.

నటీనటుల విషయానికి వస్తే:
దళపతి విజయ్ రెండు పాత్రలలో మెరిశాడు. అయినప్పటికీ చిన్న విజయ్ డిజిటలైజ్డ్ లుక్‌ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. నటనలో విజయ్ గురించి ఏమని చెప్పాలి ? ఇరగదీశాడు. కానీ ఎప్పటిలాగే ఎమోషనల్ సీన్స్ లో తేలి పోయాడు . అయితే డ్యాన్స్ కూడా దుమ్ము రేపాడు. ఇక ప్రభుదేవా, ప్రశాంత్, స్నేహ, మీనాక్షి చౌదరి పాత్రలు డీసెంట్‌గా ఉన్నాయి. ప్రేమ్ జీ, యోగిబాబు తమ పాత్రలో పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీం విషయానికి వొస్తే దర్శకుడు వెంకట్ ప్రభు స్క్రిప్ట్‌లో చాలా సినిమాటిక్ స్వేచ్ఛను తీసుకున్నాడు కానీ ఒక మంచి మాస్ సినిమాను అందించాడు. కానీ విజయ్ లాంటి హీరో చేతిలో పడితే ఇంకేమైనా చేయచ్చు కానీ కొన్ని చోట్ల చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో యువన్ శంకర్ రాజా ఫుల్స్ మార్క్స్ తెచ్చుకున్నాడు కానీ పాటల విషయంలో ఫుల్ మీల్స్ పెట్టలేదు అనిపిస్తుంది. ఇక స్టెంట్స్ డిజైనింగ్ బాగుంది. కానీ కీలకమైన ఎపిసోడ్స్ కొన్ని అప్ టు మార్క్ లేవు. ఎడిటింగ్ టేబుల్ మీద మరింత సమయం.కేటాయించి ఉంటే బాగుండేది.

ఫైనల్లీ: 

‘ది గోట్’ ఎ ట్రీట్ ఫర్ విజయ్ ఫ్యాన్స్.. మిగతా వాళ్లకు మాత్రం కండిషన్స్ అప్లై.

Show comments