NTV Telugu Site icon

Sundaram Master Review: వైవా హర్ష ‘సుందరం మాస్టర్’ రివ్యూ!

Sundaram Master Review

Sundaram Master Review

Viva Harsha’s Sundaram Master Movie Review: యూట్యూబ్ లో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించిన వైవా హర్ష తర్వాత సినిమాల్లో కూడా కమెడియన్ పాత్రలు పోషిస్తూ వచ్చాడు. ఇక ఆయన ప్రధాన పాత్రలో సుందరం మాస్టర్ అనే సినిమా తెరకెక్కుతుందనే ప్రకటన వచ్చినప్పటి నుంచి అందరిలో ఆసక్తి నెలకొంది. దానికి కారణం ఈ సినిమాకి మాస్ మహారాజా రవితేజ నిర్మాత కాగా సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేలా చేసింది. ఇక ఈ సినిమా ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది అంతకంటే ఒకరోజు ముందే హైదరాబాద్ ఏఎంబి థియేటర్లో ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ సినిమా ఎలా ఉంది ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

కథ:
విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ ఉంటాడు సుందర్రావు (వైవా హర్ష). పెళ్ళికాని అతను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ ఉండడంతో కట్నం బాగానే వస్తుందని ఆశతో వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టుకుంటూ ఇంకా ఎక్కువ కట్నం వస్తుందేమో అని ఎదురుచూస్తూ ఉంటాడు. ఇలాంటి తరుణంలో ఆ ప్రాంత ఎమ్మెల్యే (హర్ష వర్ధన్) అతనికి ఒక ఆసక్తికరమైన పని అప్పు చెబుతాడు. అడవుల్లో ఉండే ఒక గూడానికి వెళ్లి అక్కడ ఉన్నవారికి చదువు చెప్పాలని, చదువు చెప్పిన తర్వాత వాళ్లని నియోజకవర్గంలో ఓటర్లుగా చేర్చేందుకు ప్రయత్నించాలని చెబుతాడు. అంతేకాక రహస్యంగా మరొక పని కూడా అప్పచెబుతాడు. దీంతో ఆ గూడానికి వెళ్లిన సుందరం మాస్టర్ ఎమ్మెల్యే చెప్పిన పని చేశాడా? ఆ గూడెం పెద్ద (కేజిఎఫ్ బాలకృష్ణ), మైనా(దివ్య శ్రీపాద) అలాగే ఆ గూడెంలో ఉన్న ఇతరులు సుందరం మాస్టర్ ను అనుమానించి చెట్టుకు కట్టేస్తారు. అలాంటి పరిస్థితుల్లో సుందరం మాస్టర్ ఏం చేశాడు? ఎమ్మెల్యే చెప్పిన పని చేసేందుకు అక్కడికి వెళ్లిన సుందరం మాస్టర్ చివరికి ఏం చేశాడు? అసలు రహస్యంగా ఎమ్మెల్యేలు తీసుకురమ్మని పంపించింది ఏంటి? లాంటి వివరాలు తెలియాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే.

విశ్లేషణ:
సినిమా మొదలైనప్పటి నుంచి ఎక్కువగా నాన్చకుండా సూటిగా సుత్తి లేకుండా కథలోకి తీసుకువెళ్లాడు దర్శకుడు. అత్యాశ కలిగిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు డీఈవో పోస్ట్ వస్తుందని ఆశపడి అడవిలో ఒక గూడానికి వెళ్లి అక్కడ విలువైన వస్తువు ఒకదాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతాడు. ఇంగ్లీష్ పెద్దగా రాని సోషల్ టీచర్ నల్లగా ఉన్నాడనే ఒకే ఒక కారణంతో ఆ గూడానికి వెళ్లాల్సి వస్తుంది. అలా గూడానికి వెళ్లిన అతను మొదటి రోజే టీచర్ కాదేమో అని అక్కడి గూడెం ప్రజలకు అనుమానం రావడంతో అతన్ని బంధిస్తారు. అక్కడే ఉన్న ఒక గూడెం వ్యక్తి సాయంతో వాళ్లు పెట్టిన పరీక్ష పాసైన సుందరం మాస్టర్ చేసే పనులన్నీ ఫన్నీగా ఉంటాయి. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా లైటర్ వేలో ఉంటుంది. కథాంశాన్ని మొదటి సగంలోనే ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమా మీద ఆసక్తి పెంచేలా రాసుకున్నాడు దర్శకుడు. అయితే మొదటి భాగం అంతా కొంచెం కామెడీ అనిపించినా ఇంటర్వెల్ తర్వాత నుంచి సీరియస్ గా కథ మొత్తం సాగుతూ ఉంటుంది. ఆ గూడెం ప్రజల ప్రవర్తన, వారి పరిస్థితిని చూసిన తర్వాత సుందరం మాస్టర్ వారిపై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉన్నా, కొన్ని కామెడీ సీన్స్ బాగా వర్కవుట్ అవుతుండగా, సెకండ్ హాఫ్ లో మాత్రం ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేయలేదనిపించింది. నిజానికి కథగా ఇది ఒక మంచి పాయింట్ కానీ దాన్ని ప్రేక్షకులకు కన్వెన్సింగ్ విధానంలో చెప్పే విషయంలో దర్శకుడు అలాగే సినిమా టీం మొత్తం తడబడిన ఫీలింగ్ కలిగింది. సినిమా మొదలైన వెంటనే భలే లైన్ రా అనుకున్న ప్రేక్షకుడు ఆ తర్వాత ఎందుకో పూర్తిస్థాయిలో ఎగ్జయిట్ అయ్యే పాయింట్ లోపించింది. గ్రామస్థులు ఇంగ్లీషులో మాట్లాడినప్పుడు సుందరం షాక్ కావడం, ఆ తర్వాత ఎపిసోడ్‌లు కొన్ని ఆకట్టుకుంటాయి. గ్రామ దేవత విగ్రహం కోసం వెతుకుతున్న సమయంలో వచ్చే ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా ఉత్కంఠగా ఉంది. అయితే సుందరం మాస్టర్ ఇంకేదో అద్భుతం చేస్తాడని ఆశిస్తున్న అందరిని నిరాశపరిచాడు. ఇంకేదో ట్విస్ట్ ఉంటుంది, ఇంకేదో అద్భుతంగా ప్లాన్ చేశారేమో అని అందరూ అనుకుంటున్న సమయంలో ఒక సోషల్ మెసేజ్ ఇచ్చి సినిమాని ముగించే ప్రయత్నం చేశారు. దేని కోసమో పరుగులు పెట్టకుండా ఉన్నంతలో ఆనందంగా ఉండాలని చెప్పిస్తూ సినిమాని ముగించే ప్రయత్నం చేశారు. అయితే గ్రామస్తులు అమాయకత్వం, విలువైన వస్తువు కోసం సుందరం మాస్టర్ పోరాటం ఎక్కువగా సాగదీసిన ఫీలింగ్ కలిగేలా చేసింది.

నటీనటుల విషయానికి వొస్తే:
సుందరం మాస్టర్ అనే పాత్రలో హర్ష చెముడు ఇమిడిపోయాడు. స్వతహాగా కమెడియన్లా కామెడీ పండించే హర్ష ఈ సినిమాలో కూడా కామెడీ పండించే ప్రయత్నం చేశాడు అందులో సూపర్ సక్సెస్ అయ్యాడు. కథ సీరియస్ గా మారిన తర్వాత హర్షలో ఉన్న నటుడు బయటికి వచ్చాడు. బాలకృష్ణ, దివ్యశ్రీ పాద, హర్షవర్ధన్, భద్రం వంటి వాళ్ళు తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. గూడెం ప్రజలుగా నటించిన వారు బహుశా అక్కడివారు ఏమో తెలియదు కానీ వారంతా చాలా న్యాచురల్ గా అడవి బిడ్డలలానే కనిపించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడి లైన్ బాగుంది కానీ దాన్ని పూర్తిస్థాయిలో ఎగ్జిక్యూట్ చేసే విషయంలో తడబడిన ఫీలింగ్ కలిగింది. కొన్ని డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి కొన్ని ఆలోచింపజేసేలా ఉన్నాయి. అడవి అందాలను క్యాప్చర్ చేయడంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్నిచోట్ల బాగా వర్క్ అవుట్ అయింది కొన్ని చోట్ల అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. పాటలు పెద్దగా గుర్తుంచుకోదగినట్లు అనిపించలేదు. ఎడిటింగ్ విషయంలో వంక పెట్టలేము కానీ నిడివి మాత్రం ఎందుకో సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం బాగుంది.

ఫైనల్ గా లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే కొందరికి సుందరం మాస్టర్ నచ్చొచ్చు.

Show comments