Sapta Sagaralu Dhaati Side B Telugu Review: రక్షిత్ శెట్టి హీరోగా నటించిన సప్త సాగరలు దాటి సైడ్ ఏ అనే సినిమా కన్నడలో సూపర్ హిట్ కావడంతో దాన్ని తెలుగులో సైతం డబ్ చేసి రిలీజ్ చేశారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ వారు. హేమంత్ రావు డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో రక్షిత్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక అలాంటి సినిమాకి సీక్వెల్ గా సప్త సాగరాలు దాటి సైడ్ బీ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో వీరికి తోడు కన్నడ నటి చైత్ర ఆచార్ కూడా ఒక కీలక పాత్రలో నటించింది. టీజర్, ట్రెయిలర్ సినిమా మీద ఆసక్తి పెంచయగా ఇప్పుడు ఎట్టకేలకు ఈ సైడ్ బీ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.
సప్త సాగరాలు దాటి సైడ్ బీ కథ:
సప్త సాగరాలు దాటి సైడ్ బీ కథ విషయానికి వస్తే మొత్తం సప్త సాగరాలు దాటి సైడ్ ఏ సినిమా కొనసాగింపుగా ఉంటుంది. ఒక తప్పుడు కేసులో జైలుకు వెళ్లిన మను(రక్షిత్ శెట్టి) తాను ప్రేమించిన ప్రియ(రుక్మిణీ వసంత్)కి దూరం అవుతాడు. మను తిరిగి జైలు నుంచి బయటకు వచ్చాక మొదలు అవుతుంది. జైలు నుంచి బయటకు వచ్చిన మను జైల్లో పరిచయం అయిన ప్రకాష్ సాయంతో కొత్త జీవితం మొదలు పెట్టే పనిలో పడతాడు. ఈ క్రమంలో ఒక బట్టల తయారీ షాపులో పనిచేస్తూనే క్యాబ్ కూడా నడుపుతూ ఉంటాడు. ప్రియను మరిచి పోలేక ఒక కాల్ గర్ల్ అయిన సురభి(చైత్ర) దక్కరకి వెళ్తాడు. ఇక ఆ తరువాత ప్రియకు ఇష్టమైన సముద్రం దగ్గరకు వెళ్లిపోయే ముందు ఆమెను చివరి సారిగా చూడాలి అనుకుంటాడు.. సురభి సాయంతో ప్రియాను చూసి షాక్ అవుతాడు. తాము కలగన్నట్టు ప్రియ బ్రతకడం లేదని, ఆమె భర్త సరిగా లేడని అనుకుని ఆమె జీవితాన్ని సెట్ చేసే పనిలో పడతాడు. ఈ క్రమంలోనే మను సురభితో ప్రేమలో పడతాడు. మరి ప్రియ లైఫ్ ను మను సెట్ చేశాడా? అసలు ప్రియ జీవితానికి ఏమైంది? ప్రియ భర్త ఎందుకు దారితప్పాడు? సురభి మను ఒక్కటయ్యార? జైల్లో నుండి రిలీజ్ అయిన సోము మను జీవితంలోకి వచ్చి ఏం చేశాడు? అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. I
విశ్లేషణ:
సప్త సాగరాలూ సైడ్ ఏ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకోలేదు. ఎక్కువగా లవ్ స్టోరీలు ఇష్టపడే వారికి మాత్రమే ఈ సినిమా నచ్చింది. అందుకే కన్నడలో ఒకలా తెలుగులో ఒకలా రిజల్ట్ ఉంది. ఇప్పుడు మొదటి భాగం చూసిన అందరూ రెండో భాగం ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురు చూశారు ? దానికి కారణం ఈ సినిమా మొత్తం రివెంజ్ స్టోరీలా ఉంటుంది అని ప్రమోషనల్ కంటెంట్ మనల్ని భ్రమింపచేయడమే, అయితే అందుకు భిన్నంగా ఈ సినిమా మొత్తం సాగుతుంది. అదెలా అంటే ఈ సినిమా ఆద్యంతం ఎవరూ ఊహించని విధంగా సాగుతూ ముందుకు వెళుతుంది. ప్రేమలో విఫలమై తన ప్రేయసి ఇప్పుడు ఎలా ఉంది అని చూడడానికి వెళ్లిన ప్రేమికుడు ఆమె జీవితాన్ని సెట్ చేసి వెనక్కి రావడానికి ఇంతలా కష్టపడతారు? అని అంటే ఎవరూ ఊహించని విధంగా ఉంది. ఈరోజుల్లో మనకి దక్కని ప్రేమ ఉంటే ఎంత పోతే ఎంత అని ఏకంగా వాళ్ళను చంపడానికి సిద్ధం అవుతుంటే, ఆ ప్రేమ ఇప్పుడు మనతో లేకుంటే ఏంటి మనం కలగన్నట్టే బ్రతికే విధంగా చేయాలి అని అనుకుని దానికోసం జీవితం మొత్తాన్ని పణంగా పెట్టడం అనేది మామూలు విషయం కాదు. అయితే ఈ విషయం కాస్త రియాలిటీ దగ్గరగా లేకపోయినా నిజమైన ప్రేమ ఎప్పుడో ప్రేమించి వారి సంతోషాన్ని మాత్రమే కోరుకుంటుంది అనే పాయింట్ ను చాలా బలంగా చెప్పారు. అయితే సినిమా మొత్తానికి ప్రధానమైన మైనస్ పాయింట్ స్లో నేరేషన్. సినిమా ఎందుకో సా………………గుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. నిజానికి చెప్పాలనుకున్న పాయింట్ ఇంకా క్రిస్పీగా చెప్పవచ్చు. అయితే ఆ ఫీల్ ఆడియన్స్ కూడా ఫీల్ అవ్వాలి అంకున్నాడో ఏమో తెలియదు కానీ ఈ సినిమా అయిపోయాక బయటక వచ్చే ఆడియన్స్ కూడా అంతే నెమ్మదిగా బయటకు వచ్చేలా చేశారు. ప్రేమ ఎప్పుడో ఆనందాన్ని మాత్రమే ఇవ్వదు, ఒక్కోసారి అంతులేని దుఃఖాన్ని సైతం ఇస్తుందని చెప్పడమే ఈ సినిమా మెయిన్ పాయింట్, అంతలా దుఃఖాన్ని ఇచ్చినా ప్రేమ మనదగ్గర ఉన్నా లేకున్నా, మనం ప్రేమించిన వారు సంతోషంగా ఉండాలని అనుకోవాలని కాస్త గుండెలు పిండే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు.
నటీనటుల విషయానికి వస్తే రక్షిత్ శెట్టి ఎప్పటిలాగే మ్యాజిక్ చేశాడు. జైలు నుంచి తిరిగి వచ్చిన మను పాత్రలో ఒదిగిపోయాడు, నిజజీవితంలో ఒక ఒక బ్రేకప్ అయిఉన్న క్రమంలో అక్కడి అనుభవమో ఏమో తెలియదు కానీ మను పాత్ర మీద సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సానుభూతి వ్యక్తం చేసేలా నటించాడు. నిజానికి ఈ సినిమాలో ప్రియ పాత్రలో రుక్మిణీ కూడా జీవించింది. ఇక వేశ్యగా చైత్ర నటన బాగుంది, రక్షిత్ తో కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. అచ్యుత్, ప్రకాష్ పాత్రలో నటించిన నటుడితో పాటు సోము పాత్రలో నటించిన నటుడు కూడా పాత్రలకు కరెక్ట్ గా సెట్ అయ్యారు. ఇక మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గుండెలను పిండేసేలా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా సినిమా మూడ్ కి తగ్గట్టు ఉండేలా ప్లాన్ చేశారు. పాటలు పెద్దగా గుర్తుంచుకో దగ్గవి లేవు. అయితే ప్రధానమైన సమస్య స్లో నేరేషన్, మూడ్ కోసం సినిమాను బాగా సాగతీసినట్టు అనిపించింది. ఎడిటింగ్ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. అయితే ఆర్ట్ వర్క్ మాత్రం సినిమాకి మరో ప్లస్ పాయింట్ అయింది.
ఫైనల్లీ సప్త సా………..గరాలను కొంచెం త్వరగా దాటించి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది.