బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన తెలుగులో చేసిన సినిమాలు అలా ఉంటాయి కాబట్టి. ఈసారి ఈ సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సోదర. మన్మోహన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారు. అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని హైలైట్ చేసేలా రూపొందించిన ఈ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్‌తో ప్రేక్షకులలో అంచనాలు ఏర్పరచుకుంది. ఆ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
సోదర కథ: తెలంగాణలోని ఒక పల్లెలో అన్నదమ్ములైన చిరంజీవి (సంపూర్ణేష్ బాబు), పవన్ (సంజోష్) సాదాసీదా జీవితం గడుపుతుంటారు. అందులో చిరు సోడాలు కొట్టి షాపులకు వేసి జీవనం సాగిస్తుంటే, పవన్ మాత్రం చదివి పెద్ద స్థాయికి వెళ్లాలని కలలు కంటూ ఉంటాడు. వయసు పైపడుతున్నా చిరు పెళ్లి మాత్రం కాదు. 98 పెళ్లి చూపులకు వెళ్లినా ఏ ఒక్కటీ సెట్ కాదు. ఇలాంటి సమయంలోనే వీరి ఎదురింటిలోకి దివి (ఆర్తి గుప్తా) కుటుంబం అద్దెకు వస్తుంది. ఆమెను మొదటి చూపులోనే చూసి ప్రేమించిన చిరు, ఎలాగైనా ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. తన తమ్ముడు ఎక్కడ అడ్డు వస్తాడో అనే భయంతో అతన్ని పై చదువుల కోసం సిటీకి పంపిస్తాడు. అక్కడ పవన్ భువి (నేహా) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. వారిద్దరూ చాలా డీప్‌గా ప్రేమలో పడిన క్రమంలో, మరోపక్క చిరు లవ్ బ్రేకప్ అవుతుంది. అనూహ్యంగా పవన్ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చూపులు చూసేందుకు చిరు వెళ్తాడు. పవనే పెళ్లి కొడుకు అనుకుని ఆమె పెళ్లికి ఓకే చెప్పుతుంది. ఈ క్రమంలో పవన్ తన ప్రేయసిని దక్కించుకోగలిగాడా? చిరు తమ్ముడు పెళ్లి చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడా? చివరికి ఏం జరిగింది? అనే విషయం తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
సోదర అనే సినిమా ప్రమోషన్స్‌లో సినిమా యూనిట్ ఇది అన్నదమ్ముల మధ్య ఉన్న ఒక మంచి అనుబంధానికి సంబంధించిన సినిమా అని చెబుతూ వచ్చారు. సినిమా ఓపెనింగ్ కూడా అలాగే ఉంటుంది. ఇద్దరు అన్నదమ్ములు సరదాగా సాగిపోయే వారి జీవితం ఇలా సాగుతున్న క్రమంలో అన్నకు ఎంతకూ పెళ్లి కాకపోవడంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే, అందరూ ఊహించిన విధంగానే ఇద్దరూ ఒకే అమ్మాయితో ప్రేమలో పడేలా కథ రాసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ, అక్కడే దర్శకుడు తన పనితనాన్ని చూపించాడు. అన్న ప్రేమలో పడితే తమ్ముడు ఆ అమ్మాయిని చూసి లైట్ తీసుకుంటాడు. సిటీకి వెళ్లిన తర్వాత మరో అమ్మాయితో ప్రేమలో పడడం, అదే అమ్మాయిని అన్నతో కలిసి అన్న కోసం పెళ్లి చూపులు చూసేందుకు వెళ్లాల్సి రావడం సినిమాలో ఒక ట్విస్ట్. ఆ తర్వాత ఇద్దరూ ఓకే అనుకున్న క్రమంలో ఆ పెళ్లి ఎలా క్యాన్సిల్ చేయాలా అని తర్జనభర్జనలు పడుతూ చేసిన యత్నాలు ఒకపక్క నవ్విస్తూనే ఉన్నా, ఎందుకో సినిమా అవుట్‌డేటెడ్ అనే ఫీలింగ్ కూడా కలుగుతూ ఉంటుంది. నిజానికి ఇది ఒక ఆహ్లాదకరమైన అటెంప్ట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కథలు లేదా కథనంలో ఏదో అద్భుతాలు జరిగిపోవాలని ప్రేక్షకులు భావిస్తున్న క్రమంలో ఇలాంటి అటెంప్ట్ చేయడం ఒక మంచి ప్రయత్నం. చక్కటి పల్లెటూరి వాతావరణంలో పెద్దగా హంగులు లేకుండా తక్కువ బడ్జెట్‌లో ఒక మంచి ప్రయత్నమే చేశారు. కానీ, ఇప్పటి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా లేదనిపించింది. అలా అని సినిమా బాలేదా అంటే అలా అని చెప్పలేం. సినిమా బానే ఉంది, కానీ ఇప్పటి ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు మాత్రం సినిమాలో లోపించాయి. అక్కడక్కడ సంపూర్ణేష్ సంజోష్ మధ్య సీన్స్ పండాయి కూడా.
నటీనటుల విషయానికి వస్తే, చిరు అనే పాత్రలో సంపూర్ణేష్ బాబు ఒదిగిపోయాడు. అతనికి ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు. కాకపోతే, ఇది కాస్త సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే రోల్ అని చెప్పవచ్చు. ఇక సంజోష్ ఒక జోష్ ఉన్న కుర్రాడిలా నటించి ఆకట్టుకున్నాడు. ఆర్తి గుప్తా సహా మరో హీరోయిన్ కూడా సినిమా స్క్రీన్ మీద చాలా బాగున్నారు. ఇక బాబు మోహన్, సురభి ప్రభావతి సహా మిగతా పాత్రధారులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే, మ్యూజిక్ డైరెక్టర్ అందించిన పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. సినిమాటోగ్రఫీ ప్లెజెంట్ ఫీల్ తీసుకురావడంలో సక్సెస్ అయింది. ఎడిటింగ్ మీద మరింత ఫోకస్ పెట్టి ఉంటే మరింత బాగుండేదేమో.
ఫైనల్లీ, ‘సోదర’లో కొత్తదనం లేకపోయినా వాచబుల్ మూవీ.