NTV Telugu Site icon

Sabari Review: వరలక్ష్మీ శరత్ కుమార్ ‘శబరి’ రివ్యూ!

Sabari Movie

Sabari Movie

Varalaxmi Sarathkumar’s Sabari Movie Review: వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో శబరి అనే సినిమా తెరకెక్కింది. కేవలం తెలుగు మాత్రమే కాదు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైతం ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కొత్త దర్శక నిర్మాతలు అనిల్ కాట్జ్, మహేంద్ర కలిసి ఈ సినిమాని తెరకెక్కించారు. ట్రైలర్ తో ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడేలా చేసిన ఈ థ్రిల్లర్ మూవీ ఎట్టకేలకు మే మూడో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు చాలామంది ఎస్టాబ్లిష్డ్ నటీనటులు కనిపించడంతో సినిమా మీద సాధారణంగానే అంచనాలు ఏర్పడ్డాయి మరి ఆ అంచనాలను ఈ సినిమా ఏ మేరకు అందుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

కథ:
ఇంట్లో పెద్ద వాళ్లను సైతం ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్న అరవింద్(గణేష్ వెంకట్రామన్) నుంచి విడిపోయిన సంజన(వరలక్ష్మి శరత్ కుమార్) తన కుమార్తె రియా(నివేక్ష)ను తీసుకుని ముంబై నుంచి విశాఖపట్నం షిఫ్ట్ అవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకునే సమయంలో డిగ్రీ కూడా పూర్తి చేయకుండా పూర్తిగా అరవింద్ మాయలో పడి పోయిన సంజన కుమార్తెను పెంచి పోషించేందుకు ఎలాగోలా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్నో ఇబ్బందుల తర్వాత ఆమెకు ఒక ఉద్యోగం దొరుకుతుంది. అంతా సెట్ అయింది అనుకుంటున్న సమయంలో తన కుమార్తె గురించి ఆమెకు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. దానికి తోడు సూర్య(మైమ్ గోపి) అని పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకున్న ఒక వ్యక్తి తన కుమార్తె వెంట పడుతున్నాడని సంజన గ్రహిస్తుంది. తన కుమార్తెను సూర్య నుంచి కాపాడుకునేందుకు సంజన ఏం చేసింది? అసలు సూర్య సంజన, ఆమె కుమార్తె రియా వెనుక ఎందుకు పడుతున్నాడు? సంజన, అరవింద్ విడిపోవడానికి కారణం ఏమిటి? సూర్య జీవితంలో రాహుల్ ఎలాంటి కీలక పాత్ర పోషించాడు? చివరికి ఏం జరిగింది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు థ్రిల్లర్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. లవ్ స్టోరీ లాంటి సినిమాల కంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో దర్శక నిర్మాతలు కూడా అలాంటి సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదే కోవలో కొత్త దర్శకుడు అనిల్ ఈ శబరి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. నిజానికి ముందు ప్రమోషన్స్ లో చెప్పినట్టుగానే శబరి అనే టైటిల్ కి సినిమాకి సంబంధం లేదు. శబరి అనేది అమ్మదనం అని అర్థం వచ్చే ఒక పదం. దానికి తగ్గట్టుగానే సినిమా కంటెంట్ ఉంటుంది. సినిమా మొదలైనప్పటినుంచి అసలు విషయం రివీల్ కాకుండా చేసి ప్రేక్షకులను ఒక రకమైన కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేసి దాదాపు సఫలం అయ్యాడు దర్శకుడు. అయితే మొదటి భాగం ఎక్కువగా పాత్రల పరిచయానికే తీసుకున్నట్లు అనిపించింది. సంజన, ఆమె కుమార్తె రియా, సూర్య, అరవింద్, రాహుల్ అంటూ సినిమాలో ఉన్న ఒక్కొక్క పాత్రను రివీల్ చేస్తూ వెళ్ళాడు. అయితే ఫస్ట్ హాఫ్ లోనే కథ మొదలుపెట్టినా ఎందుకో సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఇంటర్వెల్ సమయానికి సినిమా మీద కొంత ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేశాడు. అయితే సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత కథ రివీల్ అవ్వడం మొదలవుతుంది. కానీ ఎన్నో వందల సినిమాలు చూసి ఉన్న తెలుగు ప్రేక్షకుడు కథని ఈజీగా గుర్తుపట్టగలగడం ఈ సినిమాకి మైనస్ అయ్యే అంశం. నిజానికి సినిమా మొదలైనప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసి ఇంకా ఏదో ఉందని ప్రేక్షకుడు ఒక అంచనాకు వస్తాడు. అయితే ఆ అంచనాలను మాత్రం తలకిందులు చేస్తూ చాలా సింపుల్ గా కథను ముగించే ప్రయత్నం చేశారు మేకర్స్. అయితే క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకులకు కాస్త నిరాశపరిచే విషయమే. ఇంకా ఏదో ఉంటుంది అనుకుంటే క్లైమాక్స్ కూడా రొటీన్ గానే ఉంటుందని చెప్పవచ్చు.

నటీనటుల విషయానికి వస్తే:
సంజన అనే ఒక అమ్మ పాత్రలో వరలక్ష్మి ఇమిడి పోయింది. గతంలో కూడా ఆమె చిన్నారులకు తల్లి పాత్రలో నటించింది. కానీ ఈ సినిమాలో మాత్రం ఆమె పూర్తిస్థాయిలో మెచ్యూర్డ్ యాక్టింగ్ కనబరిచింది అని చెప్పొచ్చు. గణేష్ వెంకట్రామన్, శశాంక్ వంటివాళ్లు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. మైమ్ గోపి ఎప్పటిలాగే తనకు బాగా ఈజీగా అనిపించే సైకో లాంటి పాత్రలో మెరిశాడు. సునయన సినిమాలో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసింది. ఎస్టాబ్లిష్డ్ నటినటులు చాలా మంది ఉన్నారు కానీ వారికి పూర్తిస్థాయిలో నటించే అవకాశం లేదు. ఎందుకంటే వారి వారి పాత్రలు చాలా పరిమితమే. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సినిమాలో ప్రధానంగా హైలైట్ అయినవి డైలాగ్స్. త్రివిక్రమ్ సినిమాలో డైలాగ్స్ ని గుర్తు తెస్తూనే ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. గోపి సుందర్ అందించిన పాటల కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. పాటలు కూడా బాగున్నాయి కానీ అంత క్యాచీ అనిపించలేదు. అందమైన లొకేషన్స్ ను సినిమాటోగ్రఫీ మరింత ఎలివేట్ చేసిందని చెప్పవచ్చు. ఎడిటింగ్ కూడా క్రిస్పీగా ఉంది. కొత్త నిర్మాత అయిన నిర్మాణ విలువలు విషయంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అయినట్టు అనిపించలేదు.

ఫైనల్‌గా చెప్పాలంటే.. ఎలాంటి అంచనాలు లేకుంటే శబరి కొన్ని చోట్ల థ్రిల్ చేస్తుంది.