మాస్ మహారాజా రవితేజ ఒక సాలిడ్ హిట్ అందుకుని చాలా కాలమే అయింది. అయితే ఆసక్తికరంగా, తన చివరి సినిమా డైరెక్టర్ కిషోర్ తిరుమలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, దానికి “భర్త మహాశయులకు విజ్ఞప్తి” అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది. డింపుల్ హయతి, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని, ‘దసరా’ నిర్మాత సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా ఎట్టకేలకు సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
భర్త మహాశయులకు విజ్ఞప్తి కథ:
రామ సత్యనారాయణ (రవితేజ) ఒక వైన్ డిస్టీలరీ నడుపుతూ ఉంటాడు. స్పెయిన్‌లో మానస శెట్టి (ఆశికా రంగనాథ్)కు చెందిన వైన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థతో కొలాబరేషన్ కోసం ప్రయత్నం చేయగా, మానస పీఏ విందా అలియాస్ బెల్లం (సత్య) వల్ల అది ఫెయిల్ అవుతుంది. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన రవితేజ, స్పెయిన్ వెళ్లి మానసను కలిసి తాను ఫలానా అని చెప్పకుండానే పని పూర్తి చేస్తాడు. అయితే ఈలోపే మానసకి బాగా క్లోజ్ అవుతాడు. కానీ, అప్పటికే తన భార్య బాలామణి (డింపుల్ హయతి) ఉండగా ఇలా చేయడం తప్పని గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక జీవితంలో మానసను కలిసే అవకాశం లేదని భావిస్తున్న సమయంలో, మానస మరోసారి రామ సత్యనారాయణ జీవితంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలో అటు భార్య, ఇటు మానస మధ్య ఇరుక్కున్న రామ సత్యనారాయణ ఏం చేశాడు? అసలు భార్య ఉండగా మానసకు అతను ఎందుకు దగ్గరయ్యాడు? చివరికి ఈ విషయం బాలామణి వరకు వెళ్లిందా? మధ్యలో సుదర్శన్, సునీల్, లీల (వెన్నెల కిషోర్) పాత్రలేమిటి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
నిజానికి ఈ సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా కథ లేదు. ఇద్దరు భామల మధ్య ఇరుక్కున్న ఓ భర్త, ఆ ఇరకాటం నుంచి ఎలా బయటపడ్డాడు అనే చాలా చిన్న లైన్ ఆధారంగా చేసుకుని సినిమా మొత్తం నడిపించారు. కథగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా.. వన్ లైనర్స్, కమెడియన్లతో పూర్తిగా బండి నడిపించాడు దర్శకుడు కిషోర్ తిరుమల. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో సత్యా కామెడీ, రవితేజ, ఆశికా రంగనాథ్, డింపుల్ హయతి సహా సునీల్ పాత్రతో పాటు వెన్నెల కిషోర్ పాత్రతో చేయించిన కామెడీ వర్కౌట్ అయింది.
సెకండ్ హాఫ్ విషయానికి వస్తే.. కామెడీ పర్వాలేదు కానీ, ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే డోస్ బాగా తగ్గింది. సెకండ్ హాఫ్‌లో ఏదైనా కథ ఉంటుందేమో అని భావించిన ప్రేక్షకులకు నిరాశ కలిగించేలా, దర్శకుడు ఎందుకో క్లైమాక్స్‌ను అర్ధాంతరంగా, హడావుడిగా ముగించిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే సినిమా మొత్తానికి ప్రధానమైన అసెట్స్ ట్రెండింగ్ మీమ్ కంటెంట్. సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్న చాలా జోక్స్ వాడుకున్నారు. సినిమా మొత్తానికి అది ఒక రకమైన ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్‌తో పాటు సెకండ్ హాఫ్‌లో చాలా చోట్ల కామెడీ వర్కౌట్ అయింది. కానీ సినిమాలో ఎమోషన్స్ కానీ, డెప్త్ ఫీలయ్యే కథ గాని ఏమీ లేదు. ఆ విషయంలో కూడా కేర్ తీసుకుని ఉంటే రిజల్ట్ మరింత బ్రైట్ గా ఉండేది అని చెప్పక తప్పదు.
నటన & సాంకేతిక విభాగం:
రామ సత్యనారాయణ అనే పాత్రలో రవితేజకి ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు, కొట్టిన పిండే. ఆ పాత్రలో రవితేజ అద్భుతంగా నటించారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం హద్దులు పెట్టుకోలేదేమో అనిపించింది. డింపుల్ హయతి డాన్స్ ఇరగదీసింది, అలాగే నటన విషయంలో కూడా ఇంప్రూవ్ అయిందని చెప్పాలి. వెన్నెల కిషోర్, సత్య, సునీల్ కామెడీ ట్రాక్స్ అన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక మిగిలిన పాత్రధారులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ టీం విషయానికి వస్తే.. ఈ సినిమా సాంగ్స్ అన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. భీమ్స్ సంగీతంతో పాటు నేపథ్య సంగీతం కూడా సినిమాకి ప్రధానమైన అసెట్. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సినిమాటోగ్రఫీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా గట్టిగానే కష్టపడింది. ముఖ్యంగా ప్రొడక్షన్ డిజైన్ అయితే అద్భుతం అని చెప్పాలి. సినిమా బడ్జెట్ పరిమితులతో పోలిస్తే, నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు.
ఓవరాల్‌గా: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఒక ఎంటర్ టైనింగ్ మూవీ విత్ నో లాజిక్స్.