ఇంతవరకూ చిత్ర నిర్మాణంలో ఉన్న ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ ఇప్పుడు డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టారు. జీ 5తో కలిసి కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ లో ఆయన ‘పులి మేక’ వెబ్ సీరిస్ ను నిర్మించారు. లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, సిరి హన్మంత్, సుమన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సీరిస్ శుక్రవారం నుండి జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది.
హైదరాబాద్ లో పోలీస్ అధికారులను వరుస పెట్టి ఓ సీరియల్ కిల్లర్ హతమార్చుతూ ఉంటాడు. అప్పటికే ఇలాంటి కేసును కరీం నగర్ లో సాల్వ్ చేసిన డీసీపీ కిరణ్ ప్రభ (లావణ్య త్రిపాఠి)ని హైదరాబాద్ రప్పించి హంతకుడిని పట్టుకోమని డీజీపీ అనురాగ్ నారాయణ్ (సుమన్) పురమాయిస్తాడు. ఫోరెన్సిక్ నిపుణుడైన ప్రభాకర్ శర్మ (ఆది సాయికుమార్) సైతం ఆమె టీమ్ లోనే జాయిన్ అవుతాడు. ముగ్గురు పోలీసు అధికారుల తర్వాత ఓ గవర్నమెంట్ డాక్టర్ ని ఆ సీరియల్ కిల్లర్ హత్య చేయడంతో అతనెవరో, ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడో అర్థంకాక కిరణ్ ప్రభ టీమ్ తలలు పట్టుకుంటుంది.
ఈ కేసు ఇలా సాగుతున్న సమయంలోనే జాతకాలు చెప్పే ప్రభాకర్ శర్మ తండ్రి (గోపరాజు రమణ) తన కొడుక్కి సరైన వధువు కిరణ్ ప్రభ అని గుర్తిస్తాడు. ఇరు కుటుంబాల సమ్మతితో కిరణ్ ప్రభ, ప్రభాకర్ ల నిశ్చితార్థం జరుగుతుంది. ఇదిలా ఉంటే… తండ్రితో గొడవపడి ప్రభాకర్ అన్నయ్య కరుణ (రాజా చేంబ్రోలు) రెండేళ్ళ క్రితమే దేశం వదిలిపెట్టి అమెరికా వెళ్ళిపోతాడు. చిత్రంగా ఓ రోజున అతన్ని తల్లి ఇండియాలోనే చూస్తుంది. ఫ్యామిలీని కాదని విదేశాలకు వెళ్ళిన కరుణ ఇండియాకు ఎందుకు తిరిగొచ్చాడు? తన వాళ్ళను కలవకుండా ఎందుకు దూరంగా ఉన్నాడు? కిరణ్ ప్రభ, ప్రభాకర్ సాయంతో సీరియల్ కిల్లర్ ను పట్టుకోగలిగిందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఎనిమిది ఎపిసోడ్స్ తో రూపుదిద్దుకున్న ఈ వెబ్ సీరిస్ లో మనకు లభిస్తుంది.
‘పులి మేక’ సీజన్ 1లో దాదాపు 30 నిమిషాల నిడివి ఉన్న ఎనిమిది ఎపిసోడ్స్ ను తాజాగా స్ట్రీమింగ్ చేశారు. ఈ మధ్య కాలంలో సినిమా తారలంతా వెబ్ సీరిస్ వైపు మళ్ళారు. అలా ఇందులో లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్ నటించారు. మొదటి మూడు ఎపిసోడ్స్ లో లావణ్య త్రిపాఠి పాత్రను హైలైట్ చేసిన దర్శకుడు ఆ తర్వాత ఎపిసోడ్స్ లో ఆది సాయికుమార్ పాత్రకు ప్రాధాన్యమిచ్చాడు. మొదటి నాలుగు ఎపిసోడ్స్ ఆసక్తికరంగా సాగాయి. కిరణ్ ప్రభ ఫ్లాష్ బ్యాక్ నుండి గ్రాఫ్ కాస్తంత డౌన్ అయ్యింది. మరీ ముఖ్యంగా సిరి హన్మంతకు అన్యాయం జరిగే ఎపిసోడ్ లో కొత్తదనం లేకపోయింది. అయితే… కేవలం పోలీసుల హత్యకు, ఇన్వెస్టిగేషన్ కు పరిమితం కాకుండా కాస్తంత ఫ్యామిలీ సెంటిమెంట్ ను ఇందులో మిళితం చేయడం బాగుంది. మొదటి ఎపిసోడ్ నుండి చివరి వరకూ దర్శకుడు కథను ఆసక్తికరంగానే నడిపాడు. కానీ క్లయిమాక్స్ సీన్స్ ను హడావుడిగా ముగించేసిన భావన కలుగుతుంది. ఇక సెకండ్ సీజన్ కు లీడ్ ఇస్తూ… ఓ సర్ ప్రైజ్ ఎలిమెంట్ తో దీనిని ముగించాడు. కానీ అసలైన ‘పులి మేక’ ఆట మిగిలే ఉందని దర్శకుడు చెప్పకనే చెప్పాడు.
నటీనటుల విషయానికి వస్తే… లావణ్య త్రిపాఠి పోలీస్ ఆఫీసర్ పాత్రను చాలా కాన్ఫిడెంట్ గా చేసేసింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. ఆది సాయికుమార్ తన పాత్రకు చక్కని న్యాయం చేకూర్చాడు. ముక్కు అవినాశ్ తో కలిసి వినోదాన్ని అందించే ప్రయత్నం చేశాడు. సిరి హన్మంత లేట్ ఎంట్రీ ఇచ్చినా… ఆమె పాత్రను చక్కగా మలిచారు. రాజా చేంబోలు పాత్రను ఇంకాస్తంత బాగా రాసుకుని ఉండాల్సింది. హీరో తండ్రిగా గోపరాజు రమణ, హీరోయిన్ తండ్రిగా వడ్లమాని సత్యసాయి శ్రీనివాస్ బాగా నటించారు. ఇతర ప్రధాన పాత్రలను సుమన్, నోయల్, భరణి, మానిక్ రెడ్డి, సమ్మెట గాంధి, వాసు ఇంటూరి, స్పందన పల్లి తదితరులు పోషించారు. ఆర్టిస్టులంత తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. చిత్ర నిర్మాత, రచయిత కోన వెంకట్ అతిథి పాత్రలో మెరిశారు. ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కు సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ప్రధానబలం. ఆ రెండు విభాగాల నుండి బెస్ట్ అవుట్ పుట్ లభించింది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ సైతం షార్ప్ గా ఉంది. సంభాషణలు సహజంగా ఉండి, ఆకట్టుకోవడంతో ఫాస్ట్ గా ఎపిసోడ్ అయిపోయినట్టే అనిపించింది. బట్… మధ్యలో ఒకటి రెండు ఎపిసోడ్స్ కాస్తంత బోర్ కొట్టిం
చాయి. వీలైంత వరకూ అసభ్యతకు తావు లేకుండానే దీన్ని తీశారు. కానీ కొన్ని బూతు పదాలను, ఒకటి రెండు సీన్స్ ను కూడా పరిహరించి ఉంటే… ఇది ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే వెబ్ సీరిస్ అయి ఉండేది. అయితే… ఇప్పుడు వస్తున్న వెబ్ సీరిస్ లతో పోల్చితే ఇది చాలా చాలా బెటర్. గోపీచంద్ ‘పంతం’ సినిమాను సక్సెస్ చేయలేకపోయిన దర్శకుడు చక్రవర్తి రెడ్డి ఈ వెబ్ సీరిస్ ను మాత్రం చక్కగా డీల్ చేశాడు. వీకెండ్ లో చూసి ఎంజాయ్ చేసేలా ‘పులి మేక’ ఉంది. క్రైమ్ థిల్లర్స్ ను ఇష్టపడే వారికి ఇది నచ్చుతుంది.
ప్లస్ పాయింట్స్:
ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్
ఊహకందని ట్విస్టులు
మేకింగ్ వాల్యూస్
మైనెస్ పాయింట్స్
రొటీన్ ఫ్లాష్ బ్యాక్
డల్ గా ఒకటి రెండు ఎపిసోడ్స్
ట్యాగ్ లైన్: రక్తికట్టించే ఆట!