నటుడిగా ఎన్నో సినిమాల్లో కనిపించి మెప్పించిన నందు, ఇప్పుడు శ్రీ నందుగా మారి ‘సైక్ సిద్ధార్థ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నందు హీరోగా నటించిన ఈ సినిమాని వరుణ్ రెడ్డి అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేశాడు. యామిని భాస్కర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని స్వయంగా నందు నిర్మించడం గమనార్హం. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాలాకాలం తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకు ఈ సినిమా నచ్చి, స్పిరిట్ మీడియా – సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సమర్పిస్తూ రిలీజ్ చేసింది. ముందు నుంచి సినిమా అద్భుతం అంటూ టీమ్ ప్రచారం చేస్తూ వచ్చింది; ప్రేక్షకులలో ప్రమోషనల్ కంటెంట్ కూడా అదే ఫీల్ తీసుకొచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
సైక్ సిద్ధార్థ కథ:
సిద్ధార్థ (శ్రీ నందు) ఓ బిజినెస్‌లో రెండు కోట్లు ఇన్వెస్ట్ చేస్తాడు. అయితే ఆ డబ్బుని తాను నమ్మి ఇన్వెస్ట్ చేసిన మన్సూర్, సుఖేష్ రెడ్డి మోసం చేస్తారు. అంతేకాక సిద్ధార్థ ప్రేయసి త్రిష (ప్రియాంక)ను కూడా లైన్లో పెట్టి తనకు కాకుండా చేశారని, అన్ని వదిలేసి ఒక బస్తీలోకి వెళ్లి, ఏ పని చేయకుండా వీడియో గేమ్స్ ఆడుతూ ఆ బస్తీలో అందరికీ తలనొప్పిగా మారుతాడు. అయితే, భర్త తాగి వచ్చి కొడుతూ ఉండడంతో ఇక అతనితో ఉండకూడదని ఫిక్సయిన శ్రావ్య (యామిని భాస్కర్), తన ఎనిమిదేళ్ల కొడుకుని తీసుకుని అదే బస్తీలో సిద్ధార్థ ఇంటి కింది పోర్షన్‌లో అద్దెకు దిగుతుంది. గొడవలతో మొదలైన వీరి పరిచయం క్రమంగా ప్రేమకు దారితీస్తుంది. త్రిష తనను మోసం చేసి వెళ్ళిపోయింది అనే బాధలో ఉన్న సిద్ధార్థ, శ్రావ్య ప్రేమతో ఏమయ్యాడు? మరోసారి ప్రేమ వల్ల బాధపడ్డాడా లేక లాభపడ్డాడా? తర్వాత ఏం జరిగింది? మన్సూర్, త్రిష పెళ్లి చేసుకున్నారా లేదా? సిద్ధార్థ, శ్రావ్యతో ఒక్కటయ్యాడా లేదా? అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ:
ఈ సినిమా ప్రమోషన్స్‌లో ముందు నుంచి సినిమా భిన్నంగా ఉంటుందని, ప్రేక్షకులు షాక్ అయ్యే విధంగా ఉంటుందని టీమ్ చెబుతూ వచ్చింది. సినిమా ఫస్టాఫ్ మొదలైన చాలాసేపటి వరకు ఆ షార్ట్ ఫీలింగ్ అలాగే ఉంటుంది; ఎందుకంటే ఇది ఒక రకంగా రెగ్యులర్ సినిమా అయితే కాదు. ఎక్కువగా జన్-జీ (Gen-Z) ఆడియన్స్‌ని టార్గెట్ చేసుకొని చేసినట్లే అనిపిస్తుంది. ముఖ్యంగా నందు చెప్పినట్లుగా ఫస్టాఫ్ అంతా ఏదో ఓ వీడియో గేమ్ అనే ఫీలింగ్ కలుగుతుంది.
ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయం, నందు క్యారెక్టర్ చుట్టూ అల్లుకున్న సీన్స్‌తో సాగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది కథతో నడిచే సినిమా కాదు, నందు క్యారెక్టర్ తో నడిచే సినిమా. సుమారు రెండు కోట్లు ఇన్వెస్ట్ చేస్తే, ఆ డబ్బుతో పాటు ప్రేయసి కూడా దూరమైపోయి ఒక సైకో క్యారెక్టర్‌గా మారిపోయిన నందు, మరొక ఫెయిల్యూర్ మ్యారేజ్ స్టోరీ ఉన్న శ్రావ్య జీవితంలోకి వచ్చాక ఎలా మారాడు అనే లైన్‌తో సినిమా తెరకెక్కించారు.
అయితే ఇది రెగ్యులర్ ఆడియన్స్‌కి ఎందుకో కాస్త భిన్నమైన ఫీలింగ్ కలిగించేలా ఉంటుంది. ‘ఎందుకు అరుస్తున్నారు?’, ‘ఎందుకంత లౌడ్ వాయిస్?’ అనే ఫీలింగ్ కలుగుతుంది కానీ, ఇప్పటి జన్-జీ కిడ్స్‌కి కావలసినట్టుగానే సినిమా తీసినట్లు అనిపించింది. ప్రమోషనల్ కంటెంట్ చూసినప్పుడు అనవసరమైన బూతు కంటెంట్ ఎక్కువ ఉందేమో అనిపించింది కానీ, సినిమా చూస్తున్నప్పుడు మాత్రం అలా అనిపించలేదు. జీవితం మీద ఆశ వదిలేసి ఏదో అలా దొరికినవి తింటూ కాలం వెళ్ళదీస్తున్న యువకుడి నుంచి అంతకన్నా మంచి మాటలు ఎక్స్పెక్ట్ చేయలేం.
ఫస్టాఫ్ అంతా సరదా సరదాగా సాగిపోతున్నట్లు అనిపించినా, సెకండాఫ్ మాత్రం కాస్త ఎమోషనల్‌గా రాసుకున్నాడు డైరెక్టర్. అయితే అది ఎమోషనల్ అనిపించే లోపే మరో సీన్ పడుతూ ఆ ఎమోషన్‌ని డైల్యూట్ చేసేసింది. ఈ రోజుల్లో ఉన్న కాంప్లెక్స్ రిలేషన్‌షిప్స్‌ని చూపిస్తూనే, మరోపక్క ఎత్తి పొడుస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్ ప్రీ-క్లైమాక్స్ మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తుంది. తెలుగు ఆడియన్స్ మైండ్ సెట్‌లను ప్రశ్నిస్తూ రాసుకున్న క్లైమాక్స్ అయితే కడుపుబ్బ నవ్వించింది.
అయితే నటీనటుల్లో నందు, యామిని మినహా మిగతా వారందరూ పెద్దగా తెలిసిన ముఖాలు కాకపోవడం సినిమాకి కాస్త మైనస్ అయ్యే అంశం. రెగ్యులర్ ఫేసెస్ పెడితే రొటీన్ అయిపోతుందనుకున్నారో ఏమో తెలియదు కానీ, కొత్త వాళ్లను పెట్టారు. కానీ వాళ్ల నుంచి పూర్తిస్థాయిలో నటనను రాబట్టుకోలేకపోయారు.
నటీనటుల పనితీరు:
శ్రీ నందు తన పాత్రలో జీవించాడు. ‘అసలు నందు ఏనా ఇలాంటి పాత్ర ఎలా చేశాడు?’ అనిపించేలా ఎన్నో సీన్స్ ఉన్నాయి. సినిమా మొత్తాన్ని తన భుజం మీద వేసుకుని, తనదైన క్యారెక్టరైజేషన్‌తో సినిమా నడిపించేశాడు. యామిని భాస్కర్ బయట ఉన్నంత బొద్దుగా సినిమాలో లేదు కానీ, ఆ పాత్రకి కరెక్ట్ ఫిట్ అనిపించింది. ఏడ ఎనిమిదేళ్ల కొడుకుని తీసుకుని, హింసించే మొగుణ్ణి కాదని సిటీకి వచ్చే యువతి పాత్రలో ఒదిగిపోయింది. ఇక త్రిష పాత్రలో కనిపించిన ప్రియాంక, టాలీవుడ్‌కి మరో కొత్త నటిని పరిచయం చేసినట్లే అనిపించింది. మిగతా పాత్రధారులు అందరూ పరిధి మేరకు నటించారు.
సాంకేతిక విభాగం:
టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే కీలకంగా చెప్పుకోవాల్సింది స్మరణ్ సాయి సంగీతం. అలాగే లొకేషన్స్ కూడా కొత్తగా ఉన్నాయి. మేకింగ్ విషయంలో ఇంకా కాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది; ఎందుకంటే చాలా సీన్స్ చూస్తున్న సమయంలో ఏదో షార్ట్ ఫిలిం మేకింగ్‌లాగా అనిపించింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. నిడివి సినిమాకి ప్లస్ పాయింట్.
ఫైనల్లీ: ‘సైక్ సిద్ధార్థ’ అందరి కప్ ఆఫ్ టీ కాదు