Nachhindi Girl Friendu Movie Review: చిరంజీవి, రాధిక జంటగా రూపొందిన ‘అభిలాష’ సినిమాలోని “నవ్వింది మల్లెచెండూ.. నచ్చింది గర్ల్ ఫ్రెండూ..” అంటూ సాగే ఇళయరాజా బాణీల్లో రూపొందిన పాట తెలుగువారికి సుపరిచితమైంది. ఈ పాట పల్లవిలోని రెండో లైన్ ను టైటిల్ గా చేసుకొని గురుపవన్ తన ‘నచ్చింది Girl Frienడూ’ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘అభిలాష’ సినిమా వైజాగ్ నేపథ్యంలో సాగుతుంది. అలాగే ఈ చిత్రాన్నీ అదే ఊరిలో చిత్రీకరించడం విశేషం. అందులో కథలాగే ద్వితీయార్ధంలో సస్పెన్స్ తో ఈ థ్రిల్లర్ తెరకెక్కించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
‘నచ్చింది Girl Frienడూ’ కథ విషయానికి వస్తే- బీకామ్ చదివి పై చదువులకు వెళ్ళాలని తపిస్తున్న రాజా, పెళ్ళిళ్ళ పేరయ్య వద్ద శాండీ అనే అమ్మాయి ఫోటో చూస్తాడు. ఆ ఫోటోను పట్టుకొని, మిత్రుడిని ఇంటర్వ్యూకు తీసుకు వెళ్తుంటాడు. శాండీ తన ఫ్రెండ్ విదేశాలకు వెళ్తూండగా ఇచ్చే పార్టీ కోసం బయలుదేరుతుంది. అప్పుడే ఆమెకు “ఈ రోజు నీతో ఎవరు మాట్లాడినా చస్తారు” అనే మెసేజ్ వస్తుంది. అది ఫ్రెండ్ సరదాగా చేసిన పనే అనుకొని లైట్ తీసుకుంటుంది శాండీ. అనుకోకుండా శాండీ రాజాకు దారిలో తగులుతుంది. ఆమెను చూడగానే ‘ఐ లవ్ యూ’ చెప్పేస్తాడు రాజా. మొదట్లో చీదరించుకున్న శాండీ తరువాత అతనితో స్నేహం చేస్తుంది. చివరకు మరో అబ్బాయితో వచ్చి, ‘ఈ రోజు నాకు దొరికిన బకరా ఇతనే’ అని రాజాను పరిచయం చేస్తుంది. ఆమెకు మెసేజ్ వచ్చినట్టుగానే అంతకు ముందు ఆమెతో మాట్లాడిన వారు హత్యకు గురవుతారు. కొన్ని గంటల్లోనే ఓ అమ్మాయిని ప్రేమలో పడేసిన రాజాకు, ఆమె మోసం చేసిందని తెలియగానే భరించలేడు. ఆమెను నానా యాగీ చేయాలనుకుంటాడు. శాండీ రీపోర్ట్ చేయడంతో అతణ్ణి పోలీసులు పట్టుకుపోతారు. శాండీ బోయ్ ఫ్రెండ్ అని తిరుగుతున్న వాడిని రాజా తంతాడు. వాడు రాజానే బంధించి, అసలు శాండీ ఎవరు, ఆమెతో తామేమి చేయిస్తున్నామో అన్నీ వివరిస్తాడు. శాండీ తనను కాపాడడానికే పోలీసులకు పట్టించిందని రాజాకు తెలుస్తుంది. ఇంతకూ ఇదంతా ఆడిస్తున్నది విక్రమ్ రాయ్ అనేవాడు. సామాన్యులకు ఆశలు కల్పించి అసలు ఉనికిలో లేని తన కంపెనీల షేర్స్ కొనేలా చేస్తాడు. అందుకు అమాయకంగా శాండీ తండ్రి కృష్ణపాండే సాయం చేసి ఉంటాడు. అయితే నిజాయితీ పరుడైన కృష్ణపాండే తప్పు తెలుసుకొని జనానికి మేలు చేయాలని చూస్తాడు. పాండేను కత్తితో పొడుస్తాడు రాయ్. ఆ తరువాత ఏమయింది? పాండే బ్రతికాడా లేదా? శాండీని రాజా ఎలా రక్షించాడు? అన్న అంశాలతో మిగిలిన కథ సాగుతుంది.
షేర్ మార్కెట్ చుట్టూ గతంలోనూ కథలతో సినిమాలు రూపొందాయి. అయితే ఈ సినిమాలో ఓ సస్పెన్స్ చుట్టూ కథ తిరిగేలా చేశారు దర్శకుడు గురు పవన్. ప్రథమార్ధం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా ఉన్నా, ద్వితీయార్ధం పట్టుగానే సాగింది. ‘ఆటకదరా శివా’ చిత్రంలో తన పాత్రలో చక్కగా రాణించిన ఉదయ్ శంకర్ ఇందులో ఆ స్థాయిలో తన పాత్రను గా పండించలేదనే చెప్పాలి. శాండీగా జెన్నీఫర్ అందాలతో ఆకట్టుకొనే ప్రయత్నం చేసినా, ఏ మాత్రం మురిపించలేకపోయింది. హీరో ఫ్రెండ్ గా నటించిన మధునందన్ తనదైన టైమింగ్ తో అలరించాడు. కానీ, సుమన్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి వారు సైతం తమ సీన్స్ లో ఏదో నటించాలంటే నటించినట్టుగా అనిపిస్తుంది. ఈ థ్రిల్లర్ ను ఫార్ములాలోనే నడుపుతూ మధ్య మధ్యలో పాటలూ చొప్పించారు. కానీ, అవీ అంతగా అలరించలేకపోయాయి. నిర్మాత అట్లూరి నారాయణరావు మాత్రం రాజీ లేకుండా సినిమాను నిర్మించారు. అది మాత్రం అభినందించదగ్గ విషయం!
ప్లస్ పాయింట్స్:
– సెంటర్ పాయింట్
– ఆకట్టుకొనే సస్పెన్స్
– అలరించే ద్వితీయార్ధం
– ప్రొడక్షన్ వేల్యూస్
మైనస్ పాయింట్స్:
– బలం లేని సన్నివేశాలు
– సహనాన్ని పరీక్షించే ప్రథమార్ధం
– అలరించని పాత్రధారుల నటన
రేటింగ్: 2.5/5
ట్యాగ్ లైన్: మెప్పించని గర్ల్ ఫ్రెండ్!