ప్రియదర్శి హీరోగా, నిహారిక హీరోయిన్ గా ‘మిత్రమండలి’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాని బన్నీ వాసు, గీత ఆర్ట్స్ బ్యానర్ కాకుండా, సొంత బ్యానర్ లో తన మిత్ర మండలితో కలిసి నిర్మించారు. అనుదీప్ స్నేహితుడైన విజయేందర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత, ఇదేదో ‘జాతి రత్నాలు’ తరహా సినిమా అని అందరూ భావించారు. మేకర్స్ కూడా దాదాపుగా అదే రకమైన ఫీలర్లు ఇచ్చారు. “లాజిక్ లెస్ కదా! సరదాగా నవ్వుకోవడానికి మాత్రమే థియేటర్లకి రండి” అని చెప్పకనే చెప్పేశారు. అయితే, చివరి నిమిషంలో తమ సినిమా మీద టార్గెట్ చేసి నెగటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని ప్రకటించి, బన్నీ వాసు అటెన్షన్ సినిమా వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ, మరి అది ప్రేక్షకుల వరకు ఎంతవరకు వెళ్ళింది, సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
మిత్రమండలి రివ్యూ:
జంగ్లీ పట్టణంలో ఎమ్మెల్యే సీటు కోసం పోటీలో ఉన్న నారాయణ (వీటీవీ గణేష్)కి కుల పిచ్చి ఎక్కువ. తన తుట్టె కులం మిగతా కులాల కంటే ఎక్కువ అని భావించే అతని కుమార్తె స్వేచ్ఛ (నిహారిక) మిస్ అవుతుంది. ఆమెను ఎవరో కిడ్నాప్ చేశారని నారాయణ, అదే ఊరిలో ఉన్న ఎస్సై సాగర్ (వెన్నెల కిషోర్)ను ఆశ్రయిస్తాడు. అయితే, ఆమె కిడ్నాప్ కాలేదని, అదే ఊరికి చెందిన నలుగురు స్నేహితుల (ప్రియదర్శి, ప్రసాద్ బెహరా, విష్ణు, రాగ్ మయూర్)లో ఒకరితో లేచిపోయిందని ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ (సత్య) ద్వారా తెలుస్తుంది. అయితే, లేచిపోయిన స్వేచ్ఛను వెనక్కి తీసుకు రాగలిగారా? స్వేచ్ఛ వారిలో ఎవరిని ప్రేమించింది? చివరికి వారిద్దరూ ఒకటయ్యారా లేదా అనే విషయం తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ
నిజానికి సినిమాలో కథలేదని దర్శక నిర్మాతలతో పాటు సినిమాలో నటించిన వారు కూడా ముందే చెప్పేశారు. ఇది ఒక సెటైరికల్ సినిమా అని, సరదాగా వచ్చి నవ్వుకుని వెళ్లిపోవాలని చెప్పారు. కానీ, అదే మనసులో పెట్టుకొని వెళ్లిన వారు మాత్రం సినిమాని ఎందుకో పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయలేని పరిస్థితి. సినిమా మొదలైనప్పుడే ఇటీవల సూపర్ హిట్ లుగా నిలిచిన కొన్ని సినిమాల మీద సెటైర్ వేస్తూ ఉండడం కాస్త ఆసక్తికరం అనిపించింది. అయితే, ఎప్పుడైతే అసలు విషయంలోకి దించారో, అప్పటినుంచి సినిమా మీద ఉన్న ఆసక్తి సడలుతూ వచ్చింది. ప్రారంభంలోనే నలుగురు మిత్రుల పరిచయం, ఆ తరువాత కుల పిచ్చి పాత్ర పరిచయంతో ఏదో చేయబోతున్నారేమో అనే ఆసక్తి కలిగింది. కానీ, ఆ తరువాత తెరమీద కామెడీ చేస్తున్నా, ఎందుకో అది ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా లేదు. నిజానికి, ‘జాతి రత్నాలు’ సినిమాలో కూడా పెద్దగా కథ లేదు. కానీ, ఆ సినిమా చూస్తున్నప్పుడు అనుకోకుండా మనకు తెలియకుండానే పెదవిపై చిరునవ్వులు విరుస్తాయి. కానీ, ఈ సినిమా విషయంలో మన ముందు నలుగురు కామెడీలో ఆరితేరిన నటులు కామెడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నా, మనకు నవ్వు మాత్రం రాదు. ఒకవేళ హాస్య గ్రంథులు చనిపోయాయా అని పక్క వాళ్ళను చూసే ప్రయత్నం చేస్తే, వాళ్లు కూడా దాదాపు అదే పరిస్థితిలో ఉన్నారు. నిజానికి ఈ సినిమాలో కామెడీ చేయించే ప్రయత్నం చేశారు, నటీనటులు చేశారు కూడా. కానీ, అది ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా మాత్రం లేదు. ఒక కులాన్ని సృష్టించి, దాని చుట్టూ కామెడీ లేయర్స్ రాసుకున్నారు. కానీ, అవి రాత వరకే బాగున్నాయేమో. బహుశా అక్కడ కూడా బాగుండి ఉండకపోతే, బన్నీ వాస్ లాంటి జడ్జిమెంట్ ఉన్న నిర్మాత ఇలాంటి స్క్రిప్ట్ ని తన ప్రొడక్షన్ లో మొదటి సినిమాగా చేసి ఉండేవారు కాదు. అయితే, ఆ స్క్రిప్ట్ గా ఉన్నదాన్ని సినిమాగా రూపొందించే విషయంలో మాత్రం సినిమా టీమ్ తడబడింది. మంచి నటులు ఉన్నా, కామెడీ చేసే స్కోప్ ఉన్నా, ఆ కామెడీ వర్కౌట్ కాలేదు. కాబట్టి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో తడబడింది అని చెప్పాలి. ఫస్టాఫ్ అంతా సరదాగా సాగిపోతే, సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అప్పటినుంచి కథ రోడ్డు ఎక్కుతుంది. ఈ సన్నివేశాలన్నీ గతంలో మనం కొన్ని సినిమాల్లో చూసామే అనే ఫీలింగ్ కలిగేలా ఉంటుంది. ఇక క్లైమాక్స్ కూడా ఊహకు అందేలానే ఉండడం సినిమాకి మైనస్ అయ్యే అంశం.
నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమాలో ప్రియదర్శి హీరో అయినా సరే, నలుగురు మిత్రులలో ఒకరిగానే ఆయన కనిపించాడు. ప్రియదర్శితోపాటు రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్ బెహరా వంటి వారు కనిపించినంత సేపు నవ్వించే ప్రయత్నం చేశారు. నిజానికి వారి పాత్రలు బాగున్నాయి. చేయడానికి ప్రయత్నించిన కామెడీ వర్కౌట్ కాకపోవడం కాస్త ఇబ్బందికర అంశం. నలుగురు ఎవరికి వారు పోటాపోటీగా నటించారని చెప్పాలి. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటూ వచ్చిన సత్య కొంతవరకు ఇంపాక్ట్ చూపించాడు. ఇక సోషల్ మీడియా స్టార్ నిహారికకు ఈ పాత్ర సూట్ కాలేదేమో అనిపిస్తుంది. ఎందుకో ఆమె ఒక్కొక్క సీన్ లోనూ ఒక్కొక్క లా కనిపించటం మైనస్ అయ్యే అంశంలానే ఉంది. వీటీవీ గణేష్, వెన్నెల కిషోర్ కాస్త నవ్వించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, కథగా రాసుకున్నప్పుడు బాగున్నా, ఈ సినిమాని తెరమీదకు తీసుకొచ్చేటప్పుడు దర్శకుడు పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. కథగా కూడా పెద్ద కథ అని చెప్పలేం. డైలాగ్స్ ఉన్నంతలో పర్వాలేదు. సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్టే ఉంది. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. పాటలు స్క్రీన్ మీద చూడడానికి బాగున్నాయి కానీ, వినేందుకు ఎందుకు ఇబ్బందిగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొత్తగా అనిపించింది. ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకా వర్క్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. నిర్మాణ విలువలు అయితే బాగున్నాయి.
ఫైనల్లీ: ‘మిత్రమండలి’… కొరవడిన కామెడీ