ప్రేమ కథలతో సినిమాలు ఎవరైనా చేస్తారు కానీ వాటిలో మా సినిమా భిన్నం అంటుంది మన ఇద్దరి ప్రేమ కథ సినిమా యూనిట్. ఇక్బాల్ దర్శకత్వం వహించిన ‘మన ఇద్దరి ప్రేమ కథ’లో తానే హీరోగా నటించి, దర్శకత్వం వహించి నిర్మించాడు. గట్టి పోటీలో సుమారు 12 సినిమాలతో పాటు ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ:
నాని (ఇక్బాల్) ఓ అనాథ. శృతి (మోనికా) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. నాని ప్రేమను శృతి యాక్సెప్ట్ చేశాక, వాళ్లిద్దరూ బీచ్‌కి వెళ్లాలని అనుకుంటారు. అయితే ఇక్కడే కథ ఊహించని మలుపు తిరిగి నాని, శృతి మధ్యలోకి అను (ప్రియా జస్పర్) అనే అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఆమె రాకతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఈ క్రమంలోనే నాని, అను క్లోజ్‌గా ఉన్న వీడియో వైరల్ అవుతుంది. దీంతో గ్రామస్తులు వారిద్దరికీ పెళ్లి చేస్తారు. అయితే శృతిని ప్రేమించిన నాని.. అనుకోకుండా పెళ్లి చేసుకున్న అనుతో జీవితాంతం ఏం చేశాడు? అసలు నాని, అను ఎందుకు క్లోజ్ అయ్యారు? చివరికి ఏమైంది అనేది తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ రోజుల్లో ఏదైనా ఒక పని చేయడమే కష్టం అయిపోతుంది. అలాంటిది ఒకపక్క దర్శకత్వం చేస్తూ మరోపక్క హీరోగా నటిస్తూ నిర్మాతగా కూడా వ్యవహరించడం అనేది కత్తి మీద సాము లాంటి విషయం. అయితే ఇక్బాల్ కథనే నమ్ముకుని ముందుకు వెళ్లినట్లు కనిపిస్తోంది. ఇక్బాల్ రాసుకున్న కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన విధానం ఆకట్టుకునేలా ఉంది. కథ చాలా రియలిస్టిక్‌గా ఉండటమే కాక ఈ రోజుల్లో జరుగుతున్న అనేక విషయాలను గుర్తు చేస్తూ ఆలోచింపజేసే విధంగా రాసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఒక అమ్మాయితో ప్రేమలో ఉండి మరో అమ్మాయితో సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు రావడంతో అప్పటివరకు ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులు అవుతాయి. తాను ప్రేమించిన అమ్మాయితో కాకుండా మరో అమ్మాయితో పెళ్లి పీటలు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ఎందుకు, ఎలా అనే విషయాలను ఆసక్తికరంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విషయంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యాడు. అయితే కథనం ఊహకు అందేలా ఉండడం కాస్త మైనస్ అయిన అంశం. కాకపోతే క్లైమాక్స్ రాసుకున్న తీరు మాత్రం అభినందనీయం. క్లైమాక్స్ మాత్రం ఒక షాక్ ఫ్యాక్టర్‌ని మిగిలిస్తుంది అని చెప్పక తప్పదు.
ఇక నటీనటుల విషయానికి వస్తే ఒకపక్క దర్శకుడిగా మరోపక్క నిర్మాతగా వ్యవహరిస్తూనే హీరోగా నటించిన ఇక్బాల్ పక్కింటి అబ్బాయి పాత్రలో నటన బాగుంది. ముఖ కవళికలు, హావభావాలు చాలా సహజంగా వచ్చాయి. ఇక హీరోయిన్ ప్రియా జాస్పర్ తెరపై క్యూట్‌గా ఉంది. తన నటనకు ప్రాధాన్యతనిచ్చే పాత్రను ఆకట్టుకునే విధంగా చేసింది. మరో హీరోయిన్ మోనికా కూడా అంతే ఈజ్‌తో నటించింది. టెక్నికల్ టీం విషయానికి వస్తే సంగీత దర్శకుడు రాయన్ సినిమాకు పెద్ద అసెట్ అనుకోవచ్చు. మనోడు అందించిన సాంగ్స్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇక సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది. సినిమాలో సహజమైన లొకేషన్లను కళ్లకు ఇంపుగా చిత్రీకరించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పదును పెట్టాల్సింది. పరిమిత బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నిర్మాణ విలువలు కొంతవరకు బాగున్నాయి.
ఫైనల్లీ: ‘మన ఇద్దరి ప్రేమ కథ’ షాకింగ్ క్లైమాక్స్‌తో ఉన్న ఓ మెసేజ్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ