మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఏడు పదుల వయసులోనూ ఎక్కడా తగ్గడం లేదు. వరుసగా సినిమాలలో నటిస్తూ, కొడుకు దుల్కర్ సల్మాన్ తో పోటీ పడుతున్నాడు! ఆయన నటించిన తాజా చిత్రం ‘రోషాక్’. నిస్సమ్ బషీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మమ్ముట్టినే నిర్మాత కావడం విశేషం.
ఇదో సైకలాజికల్ థ్రిల్లర్. ఎన్.ఆర్.ఐ. లూక్ ఆంటోని తన భార్యతో కలిసి కేరళ వస్తాడు. అక్కడో గ్రామంలో అతని కారు ప్రమాదానికి గురౌతుంది. అతనికి స్పృహ వచ్చే సరికీ భార్య కనిపించదు. దాంతో దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు వెళ్ళి కంప్లయింట్ ఇస్తాడు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆంటోని భార్య ఆచూకీ కోసం పరిసర ప్రాంతాలలో తీవ్రంగా ప్రయత్నిస్తారు. కానీ ఎలాంటి ఆధారాలు వాళ్ళకు లభించవు. లూక్ ఆంటోనీ ప్రవర్తన, అతని వ్యవహార శైలి వాళ్ళను సందిగ్థంలో పడేస్తుంది. అసలు అతనికి భార్య ఉందా? అనే సందేహం కూడా కలుగుతుంది. ఇదిలా ఉంటే… తన భార్యను వెతికి పెట్టే వరకూ ఆ ఊరిని వదిలి వెళ్ళలని ఆంటోని గట్టిగా చెబుతాడు. అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న ఆ ఊరిలో ఆంటోని రాకతో రకరకాల పుకార్లు షికారు చేయడం మొదలవుతుంది. అసలు లూక్ ఆంటోనీ నేపథ్యం ఏమిటీ? అతను ఎవరికి కోసం ఈ ఊరికి వచ్చాడు? నిజంగానే అతని భార్య మిస్ అయ్యిందా? ప్రతీకారానికి పరాకాష్టగా ఆంటోనీ చేసే చర్యలకు కారణం ఏమిటనేది మిగతా కథ.
సగటు ప్రేక్షకుడికి పెద్దంత అవగాహన లేని ఓ అంశాన్ని తీసుకుని దర్శకుడు నిస్సమ్ బషీర్ ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ను తెరకెక్కించాడు. ఎంచుకున్న విషయాన్ని విపులంగా అర్థమయ్యేట్టు చెప్పడానికి కాస్తంత కష్టపడ్డాడు. చెప్పిన సంఘటనలే మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల మధ్యలో కాస్తంత బోర్ కొట్టే ప్రమాదం ఉంది. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తిని కలిగిస్తుంది. ఓ మనిషి పగ బడితే ఏ స్థాయికైనా వెళతాడనే అంశాన్ని చాలా లోతుగా చెప్పే ప్రయత్నాన్ని దర్శకుడు బషీర్ తో కథను అందించిన సమీర్ అబ్దుల్ చేశారు. వీళ్ళిద్దరూ హ్యూమన్ సైకాలజీ మీద పి.హెచ్.డి. ఏమైనా చేశారా అనే సందేహమూ కలుగుతుంది. ఇలాంటి అబ్ నార్మల్ స్టోరీని ఎంపిక చేసుకుని ప్రేక్షకుల ముందు పెట్టడం అనేది ఓ రకంగా ప్రయోగమే. ఇతర నిర్మాతలను ఎందుకు రిస్క్ లో పెట్టడం భావించి మమ్ముట్టీనే దీన్ని ప్రొడ్యూస్ చేసి ఉండొచ్చు.
నటీనటుల విషయానికి వస్తే… మమ్ముట్టి తో పాటుగా బిందు ఫణిక్కర్ అద్భుత నటన కనబరిచింది. తల్లి ప్రేమను చూపడానికి, తన కొడుకు గౌరవాన్ని కాపాడటానికి ఎలాంటి ప్రయత్నమైనా చేయడానికి సిద్ధపడే మహిళగా బాగా నటించింది. ఇతర ప్రధాన పాత్రలలో గ్రేస్ ఆంటోని, జగదీశ్, షరాఫుద్దీన్, కొట్టయాం నాజిర్, సంజూ శివరామ్ తదితరులు కనిపిస్తారు. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ తో పాటు మిథున్ ముకుందన్ సమకూర్చిన నేపథ్య సంగీతం బాగుంది. ద్వితీయార్థం మీద, పతాక సన్నివేశం మీద దర్శకుడు ఇంకాస్తంత వర్క్ చేసి ఉండాల్సింది. నిజానికి ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ అన్ని వర్గాలను ఆకట్టుకోలేవు. మమ్ముట్టి అభిమానులకు, ఈ జానర్ మూవీస్ ను ఇష్టపడే వారికీ ‘రోషాక్’ నచ్చే ఆస్కారం ఉంది. ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే వరకూ ఓపిక పడితే బెటర్.
రేటింగ్: 2.5 / 5
ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథ
మమ్ముట్టి, బిందు నటన
మిథున్ నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
బిగువ సడలిన ద్వితీయార్థం
ఆకట్టుకోని పతాక సన్నివేశం
ట్యాగ్ లైన్: సైకలాజికల్ థ్రిల్లర్