Lal Salaam Review: రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం లాల్ సలాం. ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ కీలక పాత్రలలో నటించారు. అనంతిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జీవిత కూడా కీలక పాత్రలలో నటించారు. ఇక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం పదండి.
లాల్ సలాం కథ
దేశవ్యాప్తంగా ఒక కుదుపు కుదిపిన మసీదు కూల్చివేత ఘటన తరువాత 1993లో జరిగిన కథ ఇది. అప్పటి కసుమూరు అనే ప్రాంతంలో హిందూ, ముస్లింలు ఐకమత్యంగా కలిసి ఉండేవారు. అక్కడ ఒకానొక సమయంలో క్రికెట్ మ్యాచ్ లో పెద్ద గొడవ జరుగుతుంది. అదే ఊరు నుంచి వెళ్లి బొంబాయిలో సెట్ అయిన మొయిద్దీన్ (రజినీ కాంత్) కొడుకు శంషుద్దీన్(విక్రాంత్) చేతిని గురు (విష్ణు విశాల్) నరకడంతో అది రెండు మతాల మధ్య గొడవలకు దారి తీస్తుంది. ఒకప్పుడు గురు (విష్ణు విశాల్) తండ్రి (ఫిలిప్ లివింగ్‌స్టోన్ జోన్స్), మొయిద్దీన్ భాయ్ (రజనీకాంత్) ప్రాణ స్నేహితులు అయితే వారి కొడుకులు ఇద్దరికీ మాత్రం చిన్నప్పటినుంచి ఎందుకో ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు. మత కలహాల వల్ల ఏర్పడిన గొడవల్లో గురు ఇంటిని కూడా తగలబెట్టేస్తారు దుండగులు. అయితే ఊరు మొత్తం ఇలా కావడానికి కారణం గురు, శంషుద్దీన్ చేయి నరకడమే కారణమని.. అతన్ని ఊరందరూ దూరం పెడతారు. అలాంటి సమయంలో ఊరందరి వద్ద మంచి అనిపించుకోవడం కోసం గురు ఏం చేశాడు? కొడుకు లాంటివాడే కన్న కొడుకు చేయి నరికితే మొయిద్దీన్ భాయ్ ఏం చేశాడు? చివరికి గురు, శంషుద్దీన్ తమ పగ పక్కన పెట్టి ఎందుకు కలవాల్సి వచ్చింది? అనే విషయాలు తెలియాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే.
విశ్లేషణ
ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం, రజినీకాంత్ అతిథి పాత్ర అనగానే లాల్ సలాం సినిమా మీద అందరికీ ఆసక్తి ఏర్పడింది. అయితే ఏమనుకున్నారో ఏమో తమిళంలో చేసినంత ప్రమోషన్స్ తెలుగు లో మాత్రం సినిమా యూనిట్ చేయలేదు. ఇక సినిమా విషయానికి వస్తే ముందు నుంచి ప్రచారం జరిగినట్లు ఈ సినిమాలో ఎలాంటి వివాదాస్పద అంశాలు లేవు. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత కసుమూరు అనే ఒక గ్రామంలో జరిగిన గొడవగా ఈ సినిమా కనిపిస్తుంది. సాధారణంగా మత కలహాలు కొందరు స్వార్థపూరిత వ్యక్తులు సృష్టించిన కలహాలు గానే అందరూ భావిస్తూ ఉంటారు. అలా ఇద్దరు ప్రాణ స్నేహితుల కుటుంబ సభ్యుల కారణంగా ఈ కలహాలు ఏర్పడితే తన స్నేహితుడి కుటుంబాన్ని కూడా ఎలా మొయిద్దీన్ భాయ్ పాత్రలో రజనీకాంత్ కాపాడుకున్నాడు అనేది ఈ సినిమా. అయితే రజనీకాంత్ మార్క్ సినిమా చూడాలి అనుకున్న వారు ఈ సినిమాకి వెళ్తే నిరాశ పడక తప్పదు. ఒక పెద్ద మనిషి తరహా పాత్రలో నిలబడి కదలకుండా పనులన్నీ చేయించే మనిషిగా ఆయన కనిపించారు. ఒక ఊరి ఓట్ల కోసం రాజకీయ నాయకుడు రేపిన మతకలహాలు ఎలా ఇతరుల జీవితాన్ని చిన్నాభిన్నం చేశాయి? అనే విషయాన్ని చూపడానికి ఎక్కువగా ప్రయత్నం చేశారు. నిజానికి సినిమా ఓపెనింగ్ ఆసక్తికరంగా ఉంటుంది. విష్ణు విశాల్ అండ్ గ్యాంగ్ మొత్తం ఎక్కడో ఊరి చివర షెల్టర్ తీసుకుంటూ ఉండగా వారిని టార్గెట్ చేస్తూ వచ్చిన మరో గ్యాంగ్ ఎటాక్ చేస్తున్నట్లు కనిపించడంతో పాటు అసలు ఎందుకు విష్ణు అండ్ గ్యాంగ్ పారిపోతుంది అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే విషయంలో సక్సెస్ అయ్యారు. కొంత అక్కడ ప్రేక్షకులలో ఆసక్తి కలిగించినా సరే తరువాతి సన్నివేశాలు మాత్రం సహనానికి పరీక్ష పెట్టే విధంగా ఉంటాయి. కథనం అంతా అక్కడక్కడే తిరుగుతూ ఏది ప్రస్తుతం? ఏది ఫ్లాష్ బ్యాక్? అనేది క్లారిటీ ఇవ్వకుండా దర్శకురాలు నడిపించినట్లు అనిపించింది. చేయి నరికిన కేసు వల్ల ఊరంతా విష్ణు విశాల్ కి ఎదురు తిరిగినా తరువాత జరిగిన కొన్ని పరిణామాలతో అతన్ని మరింత ద్వేషించే పరిస్థితి ఏర్పడుతుంది. అతని వల్ల ఆ ఊరి గ్రామ దేవత రథోత్సవం కూడా ఆగిపోతుంది, ఆ ఊరి మొత్తానికి పెద్ద అవమానం జరుగుతుంది. అక్కడితో ఇంటర్వెల్ బ్లాక్ ఇచ్చి ఆ తరువాత ఊరి కోసం సొంతంగా రథం సిద్ధం చేసుకోవడమే లక్ష్యంగా సినిమాని నడిపించారు. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు కొన్ని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో ఐశ్వర్య సఫలం అయింది. అయితే విష్ణు విశాల్, అనంతిక లవ్ స్టోరీ ఇరికించినట్టు అనిపించింది. అలాగే సినిమాలో చిన్న చిన్న లోపాలు చాలా ఉన్నాయి, కథనం పరంగా అవి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే టైటిల్ జస్టిఫికేషన్ కూడా చేయలేదు. అంతేకాక సినిమా కథ ముందు ముందు ఏం జరుగుతుంది అనే విషయం సగటు ప్రేక్షకుడికి చాలా ఈజీగా అవగాహన వచ్చేస్తుంది. ఇక తమిళ నేటివిటీ ఎక్కువ కావడంతో తెలుగు ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువ.
ఇక సినిమాకు సంబంధించిన నటీనటుల విషయానికి వస్తే రజనీకాంత్ ది అతిథి పాత్ర అని ముందు నుంచి చెబుతూ వచ్చారు. కానీ ఎక్కడా అది అతిథి పాత్ర అనిపించలేదు. ఎందుకంటే సినిమాలో ఆయనకు స్క్రీన్ స్పేస్ ఒక హీరోకి తగినంతగా ఉంది. ఆయన కంటే తక్కువగా విక్రాంత్ కి స్క్రీన్ స్పేస్ ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రజినీకాంత్ ఎప్పటిలాగే నిలబడి సినిమాని నడిపించే ప్రయత్నం చేశారు. ఒక ఫైట్ లో ఆకట్టుకున్నారు. స్క్రీన్ మీద రజినీకాంత్ ఉంటే మిగతా వాళ్ళ పెర్ఫార్మెన్స్ లను కచ్చితంగా డామినేట్ చేస్తారు. కానీ, కొన్ని సీన్స్ లో విష్ణు విశాల్ రజినీకాంత్ పక్కన ఉన్నా సరే తన నటనని ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. ఇక విష్ణు విశాల్ తల్లి పాత్రలో జీవితకి చాలా కాలం తర్వాత సాలిడ్ పాత్ర దొరికినట్లు అయింది. ఈ సినిమాతో జీవిత సుమారు 32 ఏళ్ల తరువాత నటిగా రీ ఎంట్రీ ఇచ్చినా ఏమాత్రం పవర్ తగ్గలేదని నిరూపించింది. ఇక తమిళ వెర్షన్ లో ఆమె పాత్రకు సరిత దుబాయ్ లో డబ్బింగ్ చెప్పడం గమనార్హం. విక్రాంత్ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించాడు. చాలా కాలం తర్వాత సెంథిల్ స్క్రీన్ మీద కనిపించారు. పెద్ద పాత్ర కాకపోయినా సరే ఉన్నంతలో ఆకట్టుకున్నారు. అనంతిక పాత్ర అతిథి పాత్ర అనడంలో సందేహం లేదు. ఉన్నంతలో పర్వాలేదనిపించింది. ఇక మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రలో పరిధి మేర ఆకట్టుకునేలా నటించారు. అయితే టెక్నికల్ టీం విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ గా రెహమాన్ ఉన్నారనే సంగతి చాలా మందికి గుర్తు రాకపోవడం గమనార్హం. ఎందుకంటే రెహమాన్ కి ఒక మార్క్ ఉంటుంది. ఆ మార్క్ ని ఈ సినిమా ఏ మాత్రం అందుకోలేకపోవడం సినిమాకి బాగా మైనస్. ఒక్కటంటే ఒక్కటి కూడా గుర్తు పెట్టుకోదగ్గ పాట లేదు కదా కనీసం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా రెహమాన్ న్యాయం చేయలేదు అనిపించింది. రజనీకాంత్ కి ప్రతిసారి డబ్బింగ్ చెప్పే మనో కాకుండా సాయికుమార్ పాత్రతో డబ్బింగ్ చెప్పించడం వల్ల అది కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది. సినిమాటోగ్రాఫర్ పనితనం చాలా షాట్స్ లో కనిపించింది. ఎడిటింగ్ టేబుల్ మీద మరికొంత కత్తెరకు పని చెప్తే బాగుండేది అనిపించింది.
ట్యాగ్ లైన్ : లాల్ సలాం సినిమా చూసిన వారందరితో సలాం చేయించుకోలేకపోవచ్చు..