మోహన్ లాల్ హీరోగా పృథ్వి రాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన లూసిఫర్ సినిమా మలయాళంలోనే కాదు తెలుగులో కూడా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి తెలుగు సహా అనేక భాషలలో అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సినిమాకి సీక్వెల్ గా ఎంపురాన్ అనే సినిమా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టు ట్రైలర్ కట్ కూడా బాగుండడంతో సినిమా ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు అందరూ ఎదురు చూశారు. ఇక ఈ సినిమా ఎట్టకేలకు ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
ఎల్ 2 ఎంపురాన్ కథ :
ఈ సినిమా కథ లూసిఫర్ కి కొనసాగింపుగా మొదలవుతుంది. లూసిఫర్లో కేరళ సీఎం గా జతిన్ రామ్ దాస్(టోవినో థామస్)ను ఎన్నిక అయ్యేలా చేసి తన పాత జీవితంలోకి వెళ్ళిపోతాడు స్టీఫెన్ అలియాస్ ఖురేషి అబ్రహం (మోహన్ లాల్). అయితే అలా వెళ్ళిపోయిన తర్వాత జతిన్ అవినీతికి అలవాటే కోట్ల రూపాయలు ముడుపులు తీసుకుంటూ ఉంటాడు. ఒకానొక సమయంలో ఒక చెక్ డాం నిర్మించేందుకు కోట్ల రూపాయలు, లంచం తీసుకున్న విషయం తెలియడంతో అతని మీద సొంత ప్రభుత్వంలోనే అసమ్మతి పెరుగుతుంది. సొంత అక్క ప్రియదర్శిని(మంజు వారియర్) కూడా తమ్ముడికి వ్యతిరేకంగా ఉద్యమాలలో పాల్గొంటూ ఉంటుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ అండ కోసం బాబా బజరంగి (అభిమన్యు సింగ్) సమక్షంలో కేంద్రంలో చేరతాడు జతిన్. అయితే ఈ విషయాలు తెలిసిన ఖురేషి ఏం చేశాడు? అసలు ఖురేషి దగ్గర జైద్ మసూద్( పృథ్వీరాజ్) ఎందుకు చేరాడు? జైద్ మసూద్ బ్యాక్ స్టోరీ ఏంటి? బజరంగీకి, జైద్ మసూద్ కి ఉన్న లింక్ ఏంటి? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ
ఇది ఒక సీక్వెల్ సినిమా కాబట్టి మొదటి భాగం చూసిన వారికి మాత్రమే ఈ రెండో భాగం అర్థమవుతుంది. మొదటి భాగంలో మంచి కథ తో పాటు స్టైల్, టెక్నికాల్టీస్ విషయం మీద ఫోకస్ పెడితే ఈ ఎంపురాన్ విషయంలో మాత్రం ఎందుకు కథ మీద ఎమోషన్స్ మీద కంటే ఎక్కువగా స్టైలిష్ మేకింగ్ టెక్నికల్ విషయంలో కేర్ తీసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా టెక్నికల్ గా ఒక రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ లో వచ్చి కొన్ని మాస్ సీక్వెన్స్ ప్రేక్షకులు విజిల్స్ వేసేలా ఉంటాయి. అయితే ఫస్ట్ పార్ట్ లో ఉండాల్సిన డ్రామా తో పాటు ఎమోషన్స్ మిస్ అయ్యాయి. ఫస్ట్ ఆఫ్ ఎందుకో కథ ఏమీ చెప్పకుండా అక్కడక్కడే తిప్పిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో ఎక్కువగా స్లో మోషన్ షాట్స్ వాడడం వల్ల మూడు గంటల నిడివి వచ్చిందేమో అనే ఫీలింగ్ కలిగి కొన్ని సందర్భాలలో బోర్ ఫీలింగ్ కూడా కలుగుతుంది. అలాగే ఫస్ట్ పార్ట్ అద్భుతమైన హిట్ కావడంతో సెకండ్ పార్ట్ మీద అందరిలోనూ అంచనాలుంటాయి. అయితే ఈ సినిమా ఆ స్థాయి అంచనాలను అందుకోవడంలో తడబడింది అని అనిపించవచ్చు. ఎందుకంటే ఎన్నో అంచనాలతో థియేటర్లోకి అడుగుపెట్టిన అభిమానులకు ఈ సినిమా ఆస్థాయి కిక్ ఇవ్వకపోవచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా స్టీఫెన్ వదిలేసి వెళ్లిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పడం, జతిన్ అధికారంలో ఉండి అవినీతికి అలవాటు పడ్డాడని అర్థమయ్యేలా చెబుతూనే అతను తన సర్వైవల్ కోసం కేంద్ర ప్రభుత్వ అండతో కొత్త పార్టీ పెట్టి కేంద్రంతోనే పొత్తుకు వెళుతున్నట్లుగా చూపించారు. ఈ ఎపిసోడ్ అంతా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని పరిస్థితులకు దగ్గరగా అనిపిస్తుంది. అయితే కొన్ని కొన్ని సింక్ అయినా కొన్ని మాత్రం సింక్ కాకుండా చూసుకోవడంలో జాగ్రత్త పడ్డారు. ఇక సెకండ్ హాఫ్ లో జతిన్ అండ్ కో ఆడుతున్న ఆటకు ఖురేషి అండ్ కో అడ్డుపడుతూ ప్రియను ఒక రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చే సీన్స్ బాగా పండాయి. అయితే ఈ సినిమాలో లూసిఫర్ గతాన్ని చూపిస్తారు అనుకుంటే ఎక్కువగా ఆ విషయం మీద ఫోకస్ చేయకుండా జైద్ మసూద్ అనే పాత్ర గతాన్ని చూపిస్తూ అతని శత్రువే భవిష్యత్తులో అబ్రహం ఖురేషీ సహా కేరళ ప్రజలందరికీ ఒక దుష్టశక్తిగా మారుతున్న క్రమాన్ని లింక్ చేసిన విధానం కొందరిని భలే ఆకట్టుకుంటుంది. మరికొందరికి మాత్రం అనవసరంగా ఈ లింకు కలిపారేమో అని ఫీలింగ్ కలుగుతుంది. మొత్తంగా ఈ సినిమా మొదటి భాగంతో లింక్ చేసి చూడాల్సిన సినిమాని అయినా దానితో పోల్చకుండా ఉంటే కొంతవరకు స్టైలిష్ మేకింగ్ టెక్నికల్ విషయంలో ఆకట్టుకుంటుంది.
నటీనటుల విషయానికి వస్తే మొదటి లూసిఫర్ సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో మోహన్ లాల్ స్క్రీన్ టైం కాస్త తక్కువగానే ఉంది. అయినా సరే కనిపించిన ప్రతిసారి తనదైన ఒక ‘ఆరా’తో ఆయన ఆకట్టుకున్నాడు. స్టైలిష్ లుక్స్ తో అత్యద్భుతమైన స్క్రీన్ ప్రజన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక పృథ్వీరాజ్ పాత్ర ఇంకా పరిమితం కానీ కనిపించిన కొద్దిసేపు తనదైన శైలిలో రెచ్చిపోయి నటించాడు.. టోవినో థామస్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో ఆకట్టుకున్నాడు. ఇక మంజు వారియర్ సహా సినిమాలో ఉన్న ఎన్నో పాత్రలు తమ పరిధి మేరకు నటించారు. టెక్నికల్ విషయాలకు వస్తే ఈ సినిమా సినిమాటోగ్రఫీ అత్యద్భుతంగా ఉంది. అలాగే ఫైట్స్ డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉన్నాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు ప్రతి ఫ్రేమ్లో కనిపించింది. ఇక ఎలివేషన్స్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే సినిమా డబ్బింగ్ విషయంలో ఏమాత్రం కేర్ తీసుకోలేదేమో అనిపిస్తుంది. మలయాళ డైలాగులను గూగుల్ ట్రాన్స్లేషన్ చేసి ఎప్పుడో వాడుక భాషలో లేని తెలుగు పదాలను ప్రేక్షకుల మీద రుద్దిన ఫీలింగ్ కలుగుతుంది. అమెజాన్ ప్రైమ్ లో ఉన్న లూసిఫర్ డబ్బింగ్ భలే కుదిరింది కానీ ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాల్సిన సినిమాకి మాత్రం డబ్బింగ్ సెట్ కాలేదు. ఆ విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి.
ఫైనల్లీ ఎల్ 2 ఎంపురాన్ అంచనాలు లేకుండా చూస్తే నచ్చే స్టైలిష్ ఫిలిం