కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాతో ఒకపక్క నిర్మాతగా, మరోపక్క నటిగా పరిచయమైంది అమెరికాలో కార్డియాలజిస్ట్‌గా ప్రాక్టీస్ చేసే ప్రవీణ పరుచూరి. ఆ తర్వాత ఆమె ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరించింది. ఇక ఇప్పుడు ఆమె ఒకపక్క దర్శకత్వం వహిస్తూ, మరోపక్క నటిస్తూ, ఇంకోపక్క నిర్మాతగా వ్యవహరించిన కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఒక రకమైన ఆసక్తి సినిమా మీద ఏర్పడింది. దీంతో సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఎదురుచూశారు. దానికి తగ్గట్టుగానే రానా దీన్ని సమర్పిస్తూ ఉండడంతో సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కొత్తపల్లిలో ఒకప్పుడు కథ:
విశాఖ జిల్లా కొత్తపల్లి అనే చిన్న పల్లెటూరిలో అప్పన్న (రవీంద్ర విజయ్) ఒక వడ్డీ వ్యాపారస్తుడు. ఒకప్పుడు జమీందారైన రెడ్డి గారు (బెనర్జీ) ఇంట్లో పని చేసే వ్యక్తి కొడుకైన అప్పన్న, అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఊరిలో అందరికీ శత్రువుగా మారతాడు. రెడ్డి గారికి కూడా అప్పన్న అంటే అసలు ఏమాత్రం ఇష్టం ఉండదు. అప్పన్న దగ్గర పని చేస్తూ, రికార్డింగ్ డాన్సులు ఆడించి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రామకృష్ణ (మనోజ్ చంద్ర) శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. తాను ప్రేమించిన రెడ్డి గారి మనవరాలు (మౌని)తో రికార్డింగ్ డాన్స్ ఆడించాలనే ఉద్దేశంతో, వారి ఇంట్లో పనిచేసే అందం అలియాస్ ఆదిలక్ష్మి (ఉషా బొనెల్లి) అనే యువతీతో పరిచయం పెంచుకుంటాడు. ఒకానొక సందర్భంలో అందంతో గడ్డివాము పక్కన రామకృష్ణ దొరకడంతో, ఆమెకు అతనికి పెళ్లి చేయాలని ఊరి పెద్దయిన రెడ్డి గారు తీర్పిస్తాడు. ఈ క్రమంలో ఆ పెళ్లి నుంచి తప్పించి అప్పన్న రామకృష్ణకు సాయం చేస్తాడు. ఆ వెంటనే అప్పన్న అనూహ్య పరిస్థితుల్లో మరణిస్తాడు. ఆ తర్వాత అప్పన్న బైక్ పోలీస్ స్టేషన్ నుంచి మాయమై, యాక్సిడెంట్ అయిన చోటికి వచ్చి చేరుతుంది. దీంతో ఊరంతా అప్పన్న దయ్యం అయ్యాడనుకుంటారు. మరుసటి రోజే తాను దెయ్యం కాదు, దేవుడినయ్యానంటూ పూనకం వచ్చి ఆ ఊరి టిఫిన్ సెంటర్ నడిపే నాగమణి (ప్రవీణ) చెప్పడంతో, అందరూ అప్పన్నను అప్పన్న స్వామిగా కొలుస్తూ ఉంటారు. అయితే నిజంగానే అప్పన్న దేవుడా దయ్యమా? అప్పన్న స్వామి గుడిని కూల్చేందుకు రెడ్డి చేసిన ప్రయత్నాలు ఏమయ్యాయి? చివరికి రామకృష్ణ రెడ్డి గారి మనవరాలిని పెళ్లి చేసుకున్నాడా లేక వారి ఇంట్లో పని చేసే అందాన్ని పెళ్లి చేసుకున్నాడా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ మధ్యకాలంలో కేర్ ఆఫ్ కంచరపాలెం, బలగం లాంటి సినిమాలు బాగా వర్కౌట్ అయ్యాయి. ఒక రకంగా ఇది కూడా అదే తరహాలో విలేజ్ డ్రామాగా రాసుకున్నారు. సరైన వసతులు లేక ఇబ్బందులు పడే ఒక గ్రామం, అనుకోకుండా ఎదురైన ఒక పరిణామంతో, అప్పటివరకు ఇబ్బందులు పడిన ఒక వ్యక్తి కారణంగానే సెటిల్ అవుతున్న క్రమాన్ని చూపించిన తీరు ఆసక్తికరంగా ఉంది. మనుషులు అవసరాన్ని బట్టి ఒకలా, అవసరం తీరాక ఒకలా ప్రవర్తిస్తారని మనందరికీ తెలుసు కానీ, ఇక్కడ డైరెక్టర్ టచ్ చేసిన పాయింట్ ఆసక్తికరంగా ఉంది. నిజానికి ఆమె తీసుకున్న పాయింట్ చాలా మంచిది, చెప్పాలనుకున్న విషయం కూడా మంచిదే కానీ, దాన్ని కన్విన్సింగ్‌గా చెప్పే విషయంలో ఆమె పూర్తిస్థాయిలో తడబడింది. ఒక రకంగా చెప్పాలంటే, మంచి జరుగుతుందన్నప్పుడు గుడ్డి నమ్మకం కూడా మంచిదే అనే పాయింట్ ఆమె చెప్పాలనుకున్నారు. అదే సమయంలో బాబాల మీద, స్వాముల మీద వేసిన ఒక సెటైర్ లాగా కూడా ఈ సినిమా అనిపిస్తుంది. నిజానికి అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవరూ గుర్తించరు, జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు అనే ఒక సినిమా డైలాగ్ ఉంటుంది. అలాగే మనిషి బతికున్నప్పుడు అతన్ని ఎంత నీచంగా చూసినా, పోయిన వారందరూ మంచోళ్లే అని భావించే మన భారత సమాజంలో, అలా ఒక పీడించే వ్యక్తి చనిపోయాక అతన్నే దేవుడిగా కొలిచే తీరు కాస్త కన్విన్సింగ్‌గా రాసుకోకపోయినా, ఒకవేళ నిజంగానే బయట కూడా ఇలాంటి జరిగే పరిస్థితులు ఉన్నాయని ఆలోచింపజేసేలా రాసుకున్నారు ప్రవీణ. అయితే ఇది ఒక సినిమాలా కాకుండా, ఏదో ఒక ఊరిలో సీసీ కెమెరాలు పెట్టి షూట్ చేశారేమో అనే ఫీలింగ్ తీసుకొచ్చింది. ఒక రకంగా డాక్యుమెంటరీ ఫీల్ కూడా కలిగించింది. ఫస్ట్ హాఫ్ అంతా ఊరి ప్రజల పరిచయంతో సాగిపోయినా, అప్పన్న చావు తర్వాత సినిమాలో అసలు కథ మొదలవుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా ఒకపక్క సస్పెన్స్‌తో, మరోపక్క థ్రిల్లింగ్ అంశాలతో కథ నడిపించారు. తాను క్రియేట్ చేసిన దేవుడి గుడి తనకు ఇబ్బందికరంగా మారిన క్రమంలో రామకృష్ణ పడే వేదన, ఆ గుడిని తీసివేయడానికి చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇదంతా రామకృష్ణ చేసిన పని అని తెలిసిన తర్వాత సినిమా ఆసక్తికరమనిపిస్తుంది. అయితే పేపర్ మీద రాసుకోవడానికి బాగున్న ఈ కథను పూర్తిస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీసుకురావడంలో దర్శకురాలు తడబడింది. కేర్ ఆఫ్ కంచరపాలెం నిర్మాత నుంచి ఒక సినిమా వస్తుందంటే కచ్చితంగా సినిమా మీద అంచనాలు ఉంటాయి. అంచనాలే ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అంచనాలు పెట్టుకోకుండా థియేటర్‌కి వస్తే ఈ రూరల్ డ్రామా కొంతవరకు మెప్పించవచ్చు, కానీ అంచనాలతో వచ్చిన వాళ్లు మాత్రం నిరాశపడతారు. అలా అని తీసి పారేయదగ్గ సినిమా మాత్రం కాదు.
నటీనటులు: నటీనటుల విషయానికి వస్తే, రామకృష్ణ అనే పాత్రలో మనోజ్ చంద్ర ఒదిగిపోయాడు. మనోడు చాలా న్యాచురల్‌గా ఈజ్‌తో నటించాడు. కచ్చితంగా భవిష్యత్తులో తెలుగు సినీ పరిశ్రమకు మంచి నటుడు దొరికాడని చెప్పొచ్చు. ఇక బెనర్జీ, రవీంద్ర విజయ్ వంటి వారు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. ఇక హీరోయిన్ పాత్ర చిన్నదే. అందం పాత్రలో నటించిన ఉషా అదరగొట్టింది. మిగతా ఊరి వారందరితో పాటు దర్శకురాలు కూడా పాత్ర పరిధిలో ఆసక్తికరంగా నటించింది. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, వ్యక్తిగతంగా నన్ను ఇబ్బంది పెట్టిన అంశం సినిమాటోగ్రఫీ. ఈ సినిమాకి కొత్తగా ప్రయత్నించాలని ప్రవీణ అమెరికా నుంచి సినిమాటోగ్రాఫర్ తీసుకొచ్చారు కానీ, ఏదో చేయాలని ప్రయత్నించి చాలా ఫ్రేమ్స్ విషయంలో ప్లెజెంట్ ఫీల్ తీసుకురాలేకపోయారు. అందించిన సంగీతం బావుంది, కొన్ని పాటలు బాగా కుదిరాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకా కేర్ తీసుకుంటే బాగుండేదనిపించింది.
ఫైనల్లీ: కొత్తపల్లిలో ఒకప్పుడు ఒక రస్టిక్ రూరల్ డ్రామా.