King Of Kotha Review: మహానటి, సీతా రామం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ సల్మాన్ హీరోగా కింగ్ ఆఫ్ కొత్త సినిమా తెరకెక్కింది. దుల్కర్ సల్మాన్ కి లభించిన పాన్ ఇండియా ఇమేజ్ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెలుగు, తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. మలయాళంలో ఒక టాప్ డైరెక్టర్ కుమారుడైన అభిలాష్ డైరెక్టర్ గా లాంచ్ అవుతున్న సినిమాకి దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వ్యవహరించడంతో ఈ సినిమా మీద అందరిలో ఆసక్తి పెరిగింది. గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.
కథ:
క్రిమినల్స్ ఆగడాలతో అట్టుడికిపోతున్న కొత్త అనే ప్రాంతానికి కొత్తగా ఇన్స్పెక్టర్(ప్రసన్న)గా వచ్చి అక్కడ పరిస్థితికి కారణం కన్నా భాయి(షబీర్) అని తెలుసుకుంటాడు. తన స్టైల్లో అతని ఆగడాలు అరికట్టాలని ప్రయత్నించి అతన్ని అంతం చేయాలని నిర్ణయించుకుంటాడు. అతన్ని అంతం చేయాలి అంటే అది రాజు(దుల్కర్) ఒక్కడి వల్లే సాధ్యమవుతుంది అని సబ్ ఇన్స్పెక్టర్ టోనీ (గోకుల్ సురేష్ గోపి) వల్ల తెలుసుకుంటాడు. పక్కాగా ప్లాన్ చేసి రాజుని కొత్త ప్రాంతానికి మళ్ళీ రప్పించిన ఇన్స్పెక్టర్ కన్నా భాయ్ కథ ముగించాడా? చిన్ననాటి నుంచి కలిసిమెలిసి పెరిగిన రాజు కన్నా భాయ్ మధ్య గొడవలు ఎందుకు జరిగాయి? నిజంగానే ఇన్స్పెక్టర్ ప్లాన్ ప్రకారం వీరిద్దరి మధ్య జరిగిన గొడవ వల్ల ఎవరు మరణించారు? చివరికి అసలేం జరిగింది అనేది ఈ కింగ్ ఆఫ్ కొత్త అనే సినిమా కథ.
విశ్లేషణ:
కింగ్ ఆఫ్ కొత్త అనే సినిమా చూసిన తర్వాత ఇదేమీ కొత్త కథ కాదు అనే విషయం ఈజీగా అర్థమవుతుంది. ఊరిలో అల్లరి చిల్లరగా తిరిగే యువకుడు డాన్ గా ఎదగడం, తర్వాత అప్పటి వరకు అతని స్నేహితుడిగా ఉన్న వ్యక్తి మోసం చేయడంతో వారిద్దరి మధ్య గొడవలు జరగటం, తర్వాత వారిద్దరూ కొట్టుకుని వారిలో ఒకరు బతకడం లాంటి కాన్సెప్ట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా దాదాపుగా అదే కోవలో సాగుతుంది. కొత్త అనే ఒక క్రియేట్ చేయబడిన ప్రాంతంలో గ్యాంగ్స్టర్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. ఈమధ్య కాలంలో దుల్కర్ సల్మాన్ కి వస్తున్న పాన్ ఇండియా ఇమేజ్ ని వాడుకొని ఈ సినిమాని ఇతర భాషల్లో సైతం రిలీజ్ చేసేందుకు ప్రణాలికలు సిద్దం చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా కేవలం మలయాళ ఆడియన్స్ కోసమే చేసినట్టు అనిపించింది. తెలుగు ఆడియన్స్ లేదా కన్నడ, తమిళ ఆడియన్స్ ఇలాంటి గ్యాంగ్స్టర్ డ్రామా సినిమాలు ఎన్నో చూశారు. అయితే దుల్కర్ ను మొదటిసారిగా ఒక పూర్తి స్థాయి మాస్ పాత్రలో చూపించింది ఈ కింగ్ ఆఫ్ కొత్త అనే సినిమా. రౌడీయిజం చేసే తండ్రిని చూసి రౌడీలా పెరిగిన కొడుకు కుటుంబం నుంచి దూరమై పూర్తిగా ఆ రౌడీయిజానికి ఎలా బానిస అయ్యాడు ? జీవితాన్ని దానికే అంకితం చేసి చివరికి ప్రేమ వల్ల మారాడు అనేది ఈ స్థూలంగా ఈ కింగ్ ఆఫ్ కొత్తలో చూపించారు. దారుణమైన విషయం ఏమిటంటే సినిమా టైటిల్ ని తెలుగులో కింగ్ ఆఫ్ కొత్త అని అనౌన్స్ చేశారు. కానీ సినిమా ఆద్యంతం కింగ్ ఆఫ్ కొత్త పేరుతో నడుస్తూ ఉంటుంది. ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు తేడా పడిందో లేక డబ్బింగ్ చెప్పేటప్పుడు తేడా పడిందో తెలియదు కానీ కొత్త – కొత్త రెండింటిలో కరెక్ట్ పదం ఏమిటి అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే లేదు.
ఎవరు ఎలా చేశారు అంటే
ఈ సినిమాను మలయాళం సినీ పరిశ్రమలో మంచి పేరు ఉన్న జోషి అనే డైరెక్టర్ కొడుకు డైరెక్టర్ గా లాంచ్ అవుతూ తెరకెక్కించాడు. అభిలాష్ జోషి డైరెక్షన్లో ఈ కింగ్ ఆఫ్ కొత్త మనకి రొటీన్ అనిపిస్తుంది. రెగ్యులర్ గ్యాంగ్ స్టర్ డ్రామా అయినా అబ్బా భలే సీన్ పడిందే అనుకునే లోపే నిద్ర పుచ్చే సీన్స్ ఇబ్బంది పెడతాయి. ఈ సినిమాను అరగంట ముందే ముగించొచ్చు కానీ దర్శకుడు ఎందుకో పట్టుబట్టి ప్రతీ సీన్ నెమ్మదిగా తెరకెక్కించాడు. ఈ సినిమా నిడివి తగ్గించుంటే కచ్చితంగా దుల్కర్ సల్మాన్ కెరీర్లో మాంచి కమర్షియల్ సినిమా అయ్యుండేది, దర్శకుడికి కూడా పర్ఫెక్ట్ లాంచింగ్ అయి ఉండేది కానీ ఆ ఛాన్స్ చేతులారా మిస్ చేసుకున్నాడు దర్శకుడు అభిలాష్ జోషీ. చేజేతులా ల్యాగ్ సీన్స్ పెట్టి మాకు ఎందుకు ఈ కొత్త అనిపించేలా చేశాడు. ఒకపక్క యాక్షన్ మరోపక్క ఫ్యామిలీ సెంటిమెంట్ ఏవీ వర్కౌట్ అవలేదు. అన్నీ సగం సగం మిక్స్ చేసి ఆల్ మిక్చర్ చేయడంతో కొత్త ఇబ్బందికరంగా సాగింది. అయితే తెలుగు డబ్బింగ్ విషయంలో జాగ్రత్త పడాల్సింది. ఈ సినిమాకు మరో హీరో జేక్స్ బిజాయ్ బ్యాగ్రౌండ్ స్కోర్.. కొన్ని సీన్స్ కేవలం ఆయన రీ రికార్డింగ్ వల్లే ఎలివేట్ అయ్యాయి. నటీనటుల పనితీరు విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ మరోసారి అదరగొట్టాడు. తెలుగులో కూడా సొంత డబ్బింగ్ సినిమాకు ప్లస్.. సార్పట్టాలో డాన్సింగ్ రోజ్‌గా మెప్పించిన షబ్బీర్ ఇందులోనూ విలన్‌గా బాగున్నాడు. ఐశ్వర్య లక్ష్మీ, నైలా ఉష, చెంబన్ వినోద్, ప్రసన్న , శరణ్ శక్తి, అనిఖా వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేర నటించారు.
ఓవరాల్‌గా కింగ్ ఆఫ్ కొత్త.. సా…… గ తీసిన గ్యాంగ్ స్టర్ డ్రామా