KGF2 Movie Review : 2.75 / 5
నటవర్గం : యశ్, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, అర్చన, రామచంద్ర రాజు, అచ్యుత్ కుమార్, మాళవిక అవినాశ్, వశిష్ఠ ఎన్.సింహ, ఈశ్వరీరావు, రావు రమేశ్, టి. యస్. నాగాభరణ, శరణ్ శక్తి తదితరులు.
సినిమాటోగ్రఫి : భువన్ గౌడ
సంగీతం : రవి బస్రూర్
నిర్మాత : విజయ్ కిరగండూర్
కథ, దర్శకత్వం: ప్రశాంత్ నీల్
కన్నడ నాట ఒకప్పుడు దక్షిణాది అంతటికీ తెలిసిన ఏకైక హీరో రాజ్ కుమార్. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగానూ, పాన్ ఇండియా మూవీస్ క్రేజ్ తోనూ కన్నడ తారలు సైతం దక్షిణ, ఉత్తర భేదం లేకుండా అందరినీ ఆకట్టుకుంటున్నారు. అలా యంగ్ హీరో యశ్ ఇంతకుముందు `కేజీఎఫ్ – ఛాప్టర్ 1`తో అందరినీ ఆకర్షించారు. యశ్ బాడీ లాంగ్వేజ్, స్టైల్ తెలుగువారినీ ఆకట్టుకున్నాయి. దాంతో `కేజీఎఫ్ -1` తెలుగునాట సైతం మంచి విజయం సాధించింది. ఆ చిత్రం సీక్వెల్ గా రూపొందిన `కేజీఎఫ్-2` పైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకు ముందు ఏ కన్నడ హీరోకు లభించని ఆదరణ ఉత్తరాదిన యశ్ కు ఈ సినిమా ద్వారా లభిస్తోంది. భారీ సౌత్ మూవీస్ స్థాయిలో `కేజీఎఫ్-2` కు ఉత్తరాదిన బాక్సాఫీస్ సందడి మొదలుకావడం విశేషం.
కథ విషయానికి వస్తే – కేజీఎఫ్ మొదటి భాగంలో హీరో రాకీ బంగారు గనుల్లోపనిచేసే కార్మికులను హింసించి, వారి ప్రాణాలను పూచిక పుల్లలా భావించేవారి అంతు చూస్తాడు. తరువాత ఆ గనుల యజమాని గరుడనే అంతమొందిస్తాడు. దాంతో అప్పటి దాకా దినదిన గండం చూసిన కార్మికుల్లో రాకీ అంటే అభిమానం పెరుగుతుంది. అతని అండ ఉండడం వల్ల వారిలో ధైర్యమూ కలుగుతుంది. ఏ రోజుకైనా తాను కింగ్ అవుతానని కలలు కన్న రాకీ, ఆ తరువాత ఆ బంగారు గనులపై కన్నేసిన ఒక్కొక్కరినీ తన దారికి తెచ్చుకొనే ప్రయత్నం మొదలు పెడతాడు. అందులో పనిచేసే కార్మికులను సొంత మనుషుల్లా చూసుకుంటాడు.
కేజీఎఫ్ రాకీ పరం కావడంతో అతనితో తప్పనిసరి పరిస్థితుల్లో రీనా తండ్రి రాజేంద్ర దేశాయ్, గరుడ సోదరుడు దయా, ఆండ్రూస్ తదితరులు చేతులు కలుపుతారు. అయితే రాకీ ఎప్పటి కప్పుడు వీరిని ఓ కంట కనిపెడుతూనే రీనా ను తనతో పాటు కేజీఎఫ్ కు తీసుకెళ్ళిపోతాడు. అతన్ని అక్కడ నుండి బయటకు తీసుకురావడానికి వీరంతా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అదే సమయంలో అధీరా బ్రతికే ఉన్నాడనే విషయం తెలుస్తుంది. మొత్తానికి తమ కుయుక్తులు ఉపయోగించి రాకీని కేజీఎఫ్ నుండి బయటకు తీసుకొస్తారు. దాంతో అధీరా తన విశ్వరూపం చూపించి, రాకీని చావుదెబ్బ తీస్తాడు. అధీరాను ఎదుర్కోడానికి ఇది సమయం కాదని గ్రహించిన రాకీ దుబాయ్ వెళ్ళిపోతాడు. అక్కడ నుండి తిరిగి రాకీ కేజీఎఫ్ కు ఎలా వచ్చాడు? అధీరాకు ఎలాంటి గుణపాఠం నేర్పాడు? సీబీఐ ఆఫీసర్ సలహాతో కేజీఎఫ్ ను తన చెప్పుచేతల్లోకి తీసుకోవాలనుకున్న ప్రధానిని ప్రయత్నం నెరవేరిందా? అనేది అసలు కథ. అయితే… పడిలేచిన కడలి తరంగం మాదిరి రాకీ వ్యక్తిగత జీవితంలోనూ ఆటుపోటులు సంభవిస్తాయి. చివరకు తన సన్నిహితులు పన్నిన కుట్రలోంచి బతికి బయట పడ్డాడా? లేదా? అనేది సస్పెన్స్. ‘కేజీఎఫ్’ మూవీ రెండు భాగాలనే మేకర్స్ గతంలో ప్రకటించినా ఇప్పుడు మరో భాగం ఉంటుందనే ఆశనైతే ప్రేక్షకులకు కలిగించారు.
మొదటి భాగంలో లాగే యశ్ తన రాకీ పాత్రను పోషించారు. ఇందులో ప్రత్యేక ఆకర్షణ సంజయ్ దత్, రవీనా టాండన్ అనే చెప్పాలి. చిత్రమైన ఆహార్యంతో అధీరాగా సంజయ్ దత్, అద్భుత నటనతో ప్రధానిగా రవీనా టాండన్ ఆకట్టుకున్నారు. సినిమా ప్రథమార్ధం, ద్వితీయార్థంలో రాకీ, అధీరాకు మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు గూస్ బంప్స్ కలిగిస్తాయి. ఎత్తులు పై ఎత్తులతో సినిమా ఆసక్తికరంగా సాగిపోయింది. ప్రథమభాగం కంటే ఇందులో కథానాయిక శ్రీనిధి శెట్టికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. సీబీఐ ఆఫీసర్ గా రావు రమేశ్ ఈ ద్వితీయ భాగంలో కీలక పాత్ర పోషించాడు. ప్రథమ భాగంలో కథను చెప్పిన అనంత్ నాగ్ పాత్రను ఇందులో అతని కొడుకుగా ప్రకాశ్ రాజ్ తీసుకున్నాడు. బి. ఎస్. అవినాశ్, తారక్ పొన్నప్ప, వినయ్ బిడప్ప, లక్కీ లక్ష్మణ్, అయ్యప్ప పి. శర్మ, అర్చన జోయిస్, మాళవిక అవినాశ్, ఈశ్వరీరావు తో పాటు అచ్యుత్ కుమార్ కీలక పాత్రను పోషించాడు. కథ కేజీఎఫ్ దాటి దుబాయ్ వెళ్ళడం వరకూ ఓకే కానీ, రాజకీయ రంగు పులిమి భారత పార్లమెంట్ లోనూ దాడికి తెగబడటం అనేది కాస్తంత అతిగానే ఉంది.
మొదటి భాగంలాగే ఈ సినిమాకూ సినిమాటోగ్రఫీయే ప్రాణం. భువన్ గౌడ కథకు అనుగుణమైన కెమెరా పనితనం చూపించి, అడుగడుగునా ఆకట్టుకున్నారు. ఎబౌవ్ ఆల్ అన్నట్టుగా కథకుడు, దర్శకుడు ప్రశాంత్ నీల్ నిలిచారు. తాను చెప్పదలచుకున్న అంశాన్ని `జిగ్ జాగ్`గా చెప్పినా, ప్రేక్షకునికి అర్థమయ్యేలా చెప్పడంలో ఈ సారి కూడా ఆయన సక్సెస్ అయ్యారు. హనుమాన్ చౌదరి తెలుగు వర్షన్ కు రాసిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. ‘కేజీఎఫ్ చాప్టర్ 1 కా బాప్’ అన్నట్టుగా ఇందులోని యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఒకానొక సమయంలో ఇంత వయొలెన్స్ అవసరమా! అనే భావనా ప్రేక్షకుడికి కలుగుతుంది. భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో వాటిని అందుకోవడానికి ప్రశాంత్ నీల్ టీమ్ బాగానే కష్టపడింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ కు ఎక్కువ స్కోప్ ఇచ్చింది. అయితే హీరోహీరోయిన్ల మీద ఓ చక్కని పాటనో, కనీసం ద్వితీయార్థంలో… చాప్టర్ 1లో మాదిరి ఓ స్పెషల్ సాంగ్ నో పెట్టి ఉంటే, యాక్షన్ హోరును భరిస్తున్న ప్రేక్షకులకు కాస్తంత రిలీఫ్ దక్కేది. కానీ ఎందుకు ప్రశాంత్ నీల్ అలాంటి ప్రయత్నం చేయలేదు. దాంతో మొదటి భాగమంత థ్రిల్ ను ఈ ద్వితీయ భాగం కల్పించలేకపోయింది.
ప్లస్ పాయింట్స్:
`కేజీఎఫ్`కు సీక్వెల్ కావడం
ప్రశాంత్ నీల్ దర్శకత్వ ప్రతిభ
యశ్ అభినయం
భువన్ గౌడ సినిమాటోగ్రఫి
మైనస్ పాయింట్స్:
భారీతనం కోసం కథను సాగదీయడం
మరీ ఓవర్ గా యాక్షన్ సీన్స్
పెద్దంత పండని సెంటిమెంట్ సీన్స్
KGF2 Movie Review : 2.75 / 5