NTV Telugu Site icon

Jithender Reddy Review: జితేందర్ రెడ్డి రివ్యూ

Jithender Reddy

Jithender Reddy

మన తెలుగులో బయోపిక్‌లు కొత్తేమీ కాదు. ఇప్పటికే సినీ, క్రీడాకారులు, రాజకీయ నాయకుల బయోపిక్స్ ఎన్నో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఏబీవీపీ కార్యకర్తగా మొదలై నక్సలైట్ల చేతిలో కన్నుమూసిన జితేందర్ రెడ్డి కథను తెరపై ఆవిష్కరించారు దర్శకుడు విరించి వర్మ. గతంలో ఆయన చేసిన ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాల ఎఫెక్ట్ తో ఈ సినిమా మీద కూడా ఆసక్తి ఏర్పడింది. జితేందర్‌ రెడ్డి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.

కథ:
జగిత్యాలలో బాగా ఉన్న వారి కుటుంబంలో పుట్టిన జితేందర్ రెడ్డి (రాకేష్ వర్రే) చిన్నతనంలో జరిగిన ఓ సంఘటనతో ప్రజల కోసమే ఈ బ్రతుకు అని పెరుగుతాడు. జాతీయ భావాలున్న గోపన్న (సుబ్బరాజు), రామన్నను ఆదర్శంగా తీసుకొని వామపక్ష భావజాలం ఉన్న వారితో నేరుగా పోరాడుతూ ఉంటాడు. కాలేజీలో వామపక్ష విద్యార్థి సంఘాలతో గొడవపడి నక్సలైట్ ఉద్యమానికి ఎదురు నిలబడుతాడు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా వస్తుంది. అయితే నక్సలైట్ ఉద్యమానికి ఎదురు నిలబడ్డ కారణంగా ఆయనని అంతమొందిస్తారు. అయితే అసలు చిన్నతనంలో జితేందర్ రెడ్డి ఆలోచన విధానాన్ని మార్చి వేసిన సంఘటన ఏమిటి? లెఫ్ట్ పార్టీ స్టూడెంట్ యూనియన్లపై జితేందర్ రెడ్డి ఎలాంటి పోరాటం చేశాడు? నక్సలైట్లను, స్థానిక ఎమ్మెల్యేను ఎలా ఎదిరించి ఎమ్మెల్యే టికెట్ సాధించాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
తెలంగాణలోని జగిత్యాలకు చెందిన దివంగత ఏబీవీపీ నాయకుడు జితేందర్‌ రెడ్డి జీవిత కథతో రూపొందిన సినిమా ఇది. దీని ముగింపు అందరికీ తెలుసు. 80లలో జగిత్యాలలో నక్సలైట్లకు, ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీ నేతలకు మధ్య జరిగిన పోరాటంలో జితేందర్‌ రెడ్డి కీలక పాత్ర పోషించగా చివరికి 72 బుల్లెట్లతో ఆయన శరీరాన్ని ఛిద్రం చేసి మరీ చంపారు నక్సలైట్లు. అయితే వామపక్ష ఉద్యమాలు ఉదృతంగా ఉన్న సమయంలో వారికి వ్యతిరేకంగా జితేందర్‌రెడ్డి ఎందుకు? ఎలా? ఎవరి అండతో పోరాటం చేశాడు అన్నది ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు ఈ సినిమా తెరకెక్కించారు. జితేందర్‌ రెడ్డి గురించి జగిత్యాల తాలూకాలో అందరికీ బాగా తెలుసు. నక్సల్స్ పై ఆయన చేసిన పోరాటం గురించి ఇప్పటికీ కధలు కధలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ సినిమాలో జితేందర్‌ రెడ్డి గురించి తెలియని ఎన్నో విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ సినిమాకు కథ అందించింది జితేందర్ రెడ్డి సోదరుడు కావడంతో ఇందులో నిజం ఎంతనేది పక్కన పెడితే సినిమాటిక్‌ లిబర్టీతో దర్శకుడు తను రాసుకున్న కథను అనుకున్నట్లుగా తెరపై చూపించడంలో సక్సెస్ అయ్యాడు. జితేందర్‌ రెడ్డి బాల్యం మొదలు చరమాకం వరకు కీలక ఘట్టాలన్నీ చూపారు. అయితే సినిమా అంటేనే డ్రామా కాబట్టి ఆయన విషయంలో దర్శకుడు చాలా విషయాలను ఓవర్ డ్రమటైజ్‌ చేసినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో జితేందర్‌ రెడ్డి బాల్యంతో పాటు ఆయన స్టూడెంట్‌ లీడర్‌గా ఎదిగిన తీరును చూపిస్తూనే నక్సల్‌కి ఎందుకు, ఎలా టార్గెట్‌ అయ్యారనేది చూపారు. అయితే సెకండాఫ్‌ ప్రారంభం నుంచే సినిమా మీద ఆసక్తి మొదలవుతుంది. ఎన్నికల ప్రచారం, క్లైమాక్స్‌ అయితే మంచి సినిమాటిక్ ఫీల్ తీసుకొచ్చాయి. ఈ తరహా కథలు తెరకెక్కించాలంటే ధైర్యం కావాలి.

నటీనటుల విషయానికి వస్తే జితేందర్‌ రెడ్డి పాత్రలో రాకేష్ పరకాయ ప్రవేశం చెసాడు. నటనతోపాటు యాక్షన్‌ సీన్స్‌ లో అదరగొట్టేశాడు. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు గోపన్నగా సుబ్బరాజు తనదైన నటనతో ఆకట్టుకోగా నక్సలైట్‌గా ఛత్రపతి శేఖర్‌, లాయర్‌గా రియా సుమన్‌, జితేందర్‌ రెడ్డి పీఏ పాత్రలో రవి ప్రకాశ్‌ ఆకట్టుకున్నారు. ఇక మిగతా ఆర్టిస్ట్‌లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
ఇక టెక్నీకల్ టీం విషయానికి వస్తే లెఫ్ట్‌ లిబరల్స్‌ ఐడియాలజీ, రైట్‌ వింగ్‌ ఐడియాలజీలను చెప్పిస్తూ వచ్చిన డైలాజులు ఆలోచింపజేసేలా ఉన్నాయి. సనాతన ధర్మం గొప్పతనం గురించి చెప్పిన అంశాలు బాగున్నాయ్. పాటలు మాత్రం పంటిలో రాయిలా ఇబ్బంది పెట్టాయి. సినిమా మంచి ఫ్లోలో ఉన్న సందర్భంలో పాటలు వచ్చి డిస్టర్బ్‌ చేశాయనే చెప్పాలి. అయితే చివర్లో వచ్చే పాట కంట తడిపెట్టించేలా ఉంది. 1980ల నాటి ఫ్రేమ్స్ ను తెరమీదకు తీసుకు రావడంలో ఆర్ట్‌ డిపార్ట్మెంట్ పనితీరు ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ ఇంకాస్త బెటర్ చేయచ్చు. అయితే నిర్మాతల నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్లీ ఈ జితేందర్ రెడ్డి జాతీయ భావాలున్న ఓ దివంగత నేత బయోపిక్.. ఓ వర్గానికి మాత్రం నచ్చక పోవచ్చు.

Show comments