NTV Telugu Site icon

Jawan Movie Review: జవాన్ రివ్యూ..

Jawan

Jawan

Jawan Movie Review: షారుఖ్ ఖాన్ హీరోగా నయన తార హీరోయిన్గా నటించిన తాజా చిత్రం జవాన్. సౌత్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే అందరిలో అసక్తి ఏర్పడింది. దానికి తోడుగా విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడని షారుఖ్ తో కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయిన హీరోయిన్లలో ఒకరైన దీపికా పదుకునే కూడా నటిస్తున్నారని తెలియడంతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరి అలాంటి ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్ల లోకి ఈరోజు వచ్చేసింది. ఆ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.

కథ ఏమిటంటే:
సినిమా ఓపెనింగ్ ఒక మెట్రో ట్రైన్ హైజాక్ తో ప్రారంభం అవుతుంది. ఆరుగురు యువతులు జైలర్ ఆజాద్( షారుఖ్) తో కూడిన ఒక టీం ఆ మెట్రో ట్రైన్ ను హైజాక్ చేసి అందులో అలియా అనే అమ్మాయి తండ్రి, బిజినెస్ మేన్ కాళీ గైక్వాడ్( విజయ్ సేతుపతి) నుంచి నలభై వేల కోట్లు డిమాండ్ చేస్తాడు. వచ్చిన డబ్బులతో రైతుల రుణమాఫీ చేసి తన పేరు విక్రమ్ రాథోడ్ అని అందరికీ రివీల్ చేస్తాడు. అదే తరహాలో ఆరోగ్య శాఖా మంత్రిని సైతం కిడ్నాప్ చేసి ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేస్తాడు. అయితే ఇవేం చెప్పకుండానే జైలర్ ఆజాద్ నర్మద (నయనతార)తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటాడు. ప్రజల్లో హీరోలా మారుతున్న అతన్ని పట్టుకోవాలని అటు ప్రభుత్వం, కాళీ కష్టపడి అతన్ని ట్రాప్ చేసి చంపబోతే అతని తండ్రి విక్రమ్ రాథోడ్ (షారుఖ్) ఎంట్రీ ఇస్తాడు. అసలు విక్రమ్ రాథోడ్ ఎవరు? జైలర్ ఆజాద్ ఎవరు? వీరికి సంబంధం ఏమిటి? నర్మద ఆజాద్ గురించి నిజం తెలుసుకుందా? అసలు కాళీ గైక్వాడ్ ఎందుకు విక్రమ్ రాథోడ్ ను చంపాలి అనుకున్నాడు. లాంటి విశేషాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
ఆర్మీలో పని చేసే నిజాయితీ గల ఒక వ్యక్తి దేశద్రోహిగా చిత్రీకరించబడి అనుమానాస్పద స్థితిలో మరణించడం, అతను దేశద్రోహి కాదు అని నిరూపించేందుకు అతని కుమారుడు ప్రయత్నించడం అనే కథాంశంతో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. జవాన్ కూడా పూర్తిగా అదే లైన్ తో వచ్చిన సినిమా. విక్రమ్ రాథోడ్ అనే స్పెషల్ ఫోర్స్ కి సంబంధించిన వ్యక్తి ఆర్మీలో జరిగిన ఒక అవినీతి బయటపెట్టిన క్రమంలో ఆర్మీలో కొందరికి టార్గెట్ గా మారి దారుణంగా హత్య చేయబడతాడు.. ఆ తర్వాత కొన ఊపిరితో ఒక కుగ్రామానికి చేరి అక్కడి వారి వల్ల రక్షింపబడతాడు. కథ ఎక్కడా కొత్తగా అనిపించకపోయినా హీరో ఎలివేషన్లతో చాలావరకు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు అట్లీ. నిజానికి షారుఖ్ ఖాన్ లాంటి హీరో దొరికినప్పుడు ఏదైనా కొత్త కథతో ప్రయోగం చేసాడేమో అని అందరూ అనుకున్నారు కానీ అట్లీ మాత్రం ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా సంప్రదాయంగా, రొటీన్ గా మనం ఇప్పటికే చూసిన ఎన్నో కథలను సమహారంగా చేసి బాలీవుడ్ ప్రేక్షకులకు ఒక ఫీస్టులాగా అందించే ప్రయత్నం చేశాడు. సౌత్ లో ఇలాంటి సినిమాలు మనం ఎన్నో చూశాం, బాలీవుడ్ లో కూడా ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమాలు వచ్చాయి. అయినా సరే షారుఖ్ ఖాన్ మార్క్ సినిమా మీద పూర్తి స్థాయిలో కనిపించింది. అలాగే ఇది ఒక బాలీవుడ్ సినిమా లాగా అనిపించకుండా సౌత్ సినిమాల ఎలిమెంట్స్ చాలా వరకు కనిపించాయి. ముఖ్యంగా విజయ్ సేతుపతి, నయనతార సహా ఈ మధ్య కాలంలో తమిళ సినిమాల్లో కనిపిస్తున్న అనేక మంది నటులు ఈ సినిమాలో కూడా కనిపించారు. ఆర్మీలో పనిచేసే తండ్రి చనిపోతే మీ తండ్రి చేసింది దేశద్రోహం కాదు అది నిరూపించాల్సింది నువ్వే అని తల్లి మాట నిలబెట్టేందుకు కొడుకు ఏం చేశాడు? అనే కథను ఎంచుకొని దానికి ఈ రోజు సమాజంలో ఉన్న రైతు ఆత్మహత్యలు, ప్రభుత్వ ఆసుపత్రులలో వసతుల లేమి, బ్యాంకులు లేని వారిని ఎలా వేధిస్తున్నాయి అనే విషయాలను హృదయాలకు టచ్ అయ్యే విధంగా తెరకెక్కించే ప్రయత్నం చేసి చాలావరకు అట్లీ సఫలమయ్యాడు. పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాగా సినిమాని చూపిస్తూనే మరోపక్క సోషల్ మెసేజ్ ఇస్తూ రెండు బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. కథలో చిన్న చిన్న లోపాలు పక్కన పెడితే ఓవరాల్ గా సినిమా మొత్తం ప్రేక్షకులను అలరించే విధంగా సాగింది.. సినిమాలోని కొన్ని చిన్న చిన్న ట్విస్టులు సైతం ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సంజయ్ దత్ స్పెషల్ ఎంట్రీ అయితే ఎవరు ఊహించని విధంగా డిజైన్ చేసుకున్నాడు డైరెక్టర్.

ఎవరెలా చేశారంటే
సౌత్ లో అనేక సినిమాలు చేసి సూపర్ హిట్లు అందుకున్న అట్లీ మొట్టమొదటిసారిగా షారుక్ ఖాన్ లాంటి ఒక సూపర్ స్టార్ ని డైరెక్ట్ చేస్తున్నాడు అంటే ఏదైనా కొత్త కథతో వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ కొత్త కథ కాకుండా అందరికీ తెలిసిన కథతోనే వచ్చి ఒక్కసారిగా అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా సినిమా మొత్తం మీద సౌత్ మార్క్ చాలా స్పష్టంగా కనిపించింది.. షారుఖ్ తో పలికించిన డైలాగులు కొన్ని ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. అదేవిధంగా షారుఖ్ లోని కామెడీ టైమింగ్ ని కూడా బాగా వాడుకున్నాడు అట్లీ. రొటీన్ కథే అయినా ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా.. అటు భావోద్వేగాలతో.. ఇటు యాక్షన్ తో ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. జవాన్ కథ పాతదైనా.. షారుఖ్ ఖాన్ సినిమా కోసం ప్రాణం పెట్టినట్టు అనిపించింది, అన్ని వేరియేషన్స్ చూపాడు.డైలాగ్ వెర్షన్ చాలా బావుంది. అనిరుద్ రవి చందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల గూస్ బాంప్స్ తెప్పించింది కానీ సాంగ్స్ మాత్రం పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేదు. కొన్ని పాటలు కాచీగా ఉన్నాయి కానీ మరికొన్ని మాత్రం విజువల్ గా బాగున్నాయి. నటీనటుల విషయానికి వస్తే తండ్రి కొడుకులుగా రెండు పాత్రలలో నటించిన షారుక్ ఖాన్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. నయనతార కూడా చాలా ఈజ్ తో నటించినట్లు అనిపించింది. విజయ్ సేతుపతి కూడా తనకు బాగా అచ్చొచ్చిన విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. కానీ విజయ్ సేతుపతినీ డామినేట్ చేసే విధంగా షారుఖ్ నటన ఉంది.. దీపికా పడుకొనే కనిపించింది కొంతసేపే అయినా షారుఖ్ తో కెమిస్ట్రీ బాగుంది. ప్రియమణి పాత్ర కూడా బాగా డిజైన్ చేశారు ప్రియమణి ఆకట్టుకునేలా నటించింది. మిగతా నటీనటులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

ప్లస్ పాయింట్లు:
షారుఖ్ ఖాన్
ఇంటర్వెల్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
యాక్షన్ సీన్స్
విజయ్ సేతుపతి

మైనస్ పాయింట్లు:
రొటీన్ స్టోరీ
సాంగ్స్

రేటింగ్: 3/5

ఫైనల్ గా:
జావాన్ ఒక రొటీన్ కథతో వచ్చిన ఫక్తు కమర్షియల్ సినిమా. షారుఖ్ మార్క్ హీరోయిజం కోసం హ్యాపీగా థియేటర్లలో సినిమా చూసేయచ్చు .

Show comments