‘జానకి కలగనలేదు’ ఫేమ్ అమర్ దీప్ చౌదరి హీరోగా నటించిన సినిమా ‘ఐరావతం’. విశేషం ఏమంటే ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పంజాబీ భామ, ప్రముఖ మోడల్ తన్వీ నేగి డ్యుయల్ రోల్ ప్లే చేసింది. పాపులర్ నటి ఎస్తేర్ నొరోహా కీలక పాత్ర పోషించిన ‘ఐరావతం’ గురువారం నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
తన తల్లి (జయ వాహిని) నిర్వహించే బ్యూటీ పార్లర్ లో పనిచేసే శ్లోకా (తన్వీ నేగి)తో ప్రేమలో పడతాడు చిక్కు (అమర్ దీప్ చౌదరి). తల్లికి నిదానంగా తమ ప్రేమను గురించి చెప్పి, పెళ్ళి చేసుకోవాలని అనుకుంటాడు. శ్లోకా పుట్టిన రోజు సందర్భంగా చిక్కూ ఓ కెమెరాను గిఫ్ట్ గా ఇస్తాడు. తన బర్త్ డే సందర్భంగా ఓ వీడియోను తీసిన శ్లోకా, అది ప్లే అయ్యే సమయంలో షాక్ కు గురవుతుంది. తనలానే ఉండే వేరే అమ్మాయి ఆ వీడియోలో కనిపించి, అది తన ‘డెత్ డే’ చెప్పి సూసైడ్ చేసుకుంటుంది. ఈ విషయాన్ని చిక్కూకు చెప్పడంతో వాళ్ళు పోలీసులను ఆశ్రయిస్తారు. కానీ దీన్ని పోలీసులు పెద్దంత సీరియస్ గా తీసుకోరు. దాంతో టారో రీడర్ మాయా (ఎస్తేర్ నొరోహా) దగ్గరకు చిక్కూ, శ్లోకా వెళ్తారు. వీడియోలో కనిపించిన ప్రిన్సీ (తన్వీ నేగి) ఓ మోడల్ అనే విషయం వాళ్ళకు మాయా ద్వారా తెలుస్తోంది. అయితే… అతి త్వరలోనే శ్లోకా లేదా ప్రిన్సీలో ఒకరు చనిపోవడం ఖాయమని మాయా చెబుతుంది. అసలు శ్లోకా కెమెరాలో ప్రిన్సీ కనిపించడం ఏమిటీ? ఇద్దరిలో ఒకరు చనిపోవడం ఏమిటీ? ఒకేలా ఉండే శ్లోకా, ప్రిన్సీకి మధ్య కనెక్షన్ ఏమిటీ? వీళ్ళ గురించిన ఫ్యూచర్ మాయా చెప్పటానికి కారణం ఏమిటీ? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా.
వైట్ కెమెరాను బేస్ చేసుకుని ఈ కథంతా సాగడంతో మూవీకి ‘ఐరావతం’ అనే పేరును పెట్టారు. ఓ పిల్లాడి ద్వారా ఈ కథను చెప్పే ప్రయత్నం దర్శకుడు సుహాస్ మీరా చేశాడు. ప్రథమార్థమంతా తర్వాత ఏం జరుగుతుందోననే ఉత్కంఠతో సాగుతుంది. అయితే ద్వితీయార్థంకు వచ్చే సరికీ పేలవంగా మారిపోయింది. థ్రిల్లర్ జానర్ కాస్త…. హారర్ మూవీగా మారిపోయింది. క్లయిమాక్స్ ట్విస్ట్ పరమ రొటీన్ గా ఉంది. పరిమితమైన బడ్జెట్ లో సుహాస్ సినిమాను తన పరిథిలో బాగానే తీశాడు కానీ మరింత ఆసక్తికరంగా ఈ కథను తెరకెక్కించొచ్చు.
నటీనటుల విషయానికి వస్తే… బుల్లితెర నటుడు అమర్ దీప్ చౌదరి నటన ఆకట్టుకునేలా ఉన్నా, చాలా సందర్భాలలో అతను హీరో వెంకటేశ్ ను ఇమిటేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. హీరోయిన్ తన్వీ నేగికి ఇది మొదటి సినిమానే అయినా శ్లోకా, ప్రిన్సీ పాత్రల్లో చక్కగా ఇమిడిపోయింది. ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ చక్కగా సెట్ అయ్యింది. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు, వెబ్ సీరిస్ లలో కుర్రకారును కిర్రెక్కించే పాత్రలు చేసిన ఎస్తేర్ నొరోహా అందుకు భిన్నమైన పాత్రను ఇందులో సమర్థవంతంగా పోషించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఇక ఇతర ప్రధాన పాత్రలలో అరుణ్ కుమార్, రవీంద్ర, సంజయ్ నాయర్, జయ వాహిని, సప్తగిరి, రుద్రపట్ల వేణుగోపాల్ తదితరులు కనిపిస్తారు. ఈ థ్రిల్లర్ మూవీకి సత్య కశ్యప్ ట్యూన్స్ అందిస్తే, కార్తీక్ కొడకండ్ల నేపథ్య సంగీతం సమకూర్చాడు. సహజంగా ఇలాంటి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీస్ లో లాజిక్ గురించి ఎవరూ ఆలోచించరు. అంతమాత్రాన నేల విడిచి సాము చేస్తామంటే వ్యూవర్స్ అంగీకరించరు. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. ప్రారంభం బాగున్నా… పోను పోనూ కథ గాడితప్పింది. దాంతో ద్వితీయార్థం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. బట్… థ్రిల్లర్ జానర్స్ ను ఇష్టపడే వారు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోని ఈ మూవీని ఓ సారి చూడొచ్చు.
ప్లస్ పాయింట్స్
థ్రిల్లర్ జానర్ కావడం
నటీనటుల నటన
నేపథ్య సంగీతం
మైనెస్ పాయింట్స్
ఆసక్తి కలిగించని కథనం
కథకు అడ్డు నిలిచే పాటలు
పేలవమైన క్లయిమాక్స్
రేటింగ్: 2.25/ 5
ట్యాగ్ లైన్: సైకలాజికల్ థ్రిల్లర్!