NTV Telugu Site icon

Hunt Telugu Movie Review: హంట్ రివ్యూ

Hunt

Hunt

Hunt Telugu Movie Review: ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా వైవిధ్యమైన పాత్రలు చేసి నటుడిగా పేరు తెచ్చుకోవడానికి సుధీర్ బాబు ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే దశాబ్దం క్రితం వచ్చిన మలయాళ చిత్రం ‘ముంబై పోలీస్’ రీమేక్ కు సుధీర్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘కథలో రాజకుమారి’ ఫేమ్ మహేశ్ డైరెక్షన్ లో ‘హంట్’ పేరుతో ఈ సినిమాను ఆనంద్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు. గురువారం జనం ముందుకొచ్చిన ‘హంట్’ ఎలా ఉందో చూద్దాం.

ఏసీపీ అర్జున్ (సుధీర్ బాబు) రోడ్ యాక్సిడెంట్ లో మెమొరీ లాస్ అవుతాడు. తన స్నేహితుడు ఏసీపీ ఆర్యన్ దేవ్ (భరత్ నివాస్) హత్యకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ను అతను ఛేదించిన తర్వాత ఈ దుర్ఘటన జరుగుతోంది. ఎలాగైనా గతాన్ని గుర్తు చేసుకుని, ఆర్యన్ హత్యకు కారకుడు ఎవరో తెలుసుకోమని అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ మోహన్ (శ్రీకాంత్) అర్జున్ ను ఒత్తిడి చేస్తుంటాడు. అతను గతాన్ని మర్చిపోయిన విషయాన్ని దాచిపెట్టి, డ్యూటీలో చేరేట్టు చేస్తాడు. అసలు అర్జున్ గతం ఏమిటీ? అతను ఎలాంటి వాడు? ఈ ముగ్గురి మధ్య ఉన్న స్నేహబంధాన్ని బ్రేక్ చేస్తూ ఆర్యన్ ను ఎవరు, ఎందుకు టార్గెట్ చేసి చంపేశారు? దాన్ని అర్జున్ ఎలా ఛేదించాడన్నదే ఈ సినిమా కథ.

నిజం చెప్పాలంటే ఇదో మర్డర్ మిస్టరీ. పైగా పోలీస్ అధికారికి సంబంధించి పబ్లిక్ గా జరిగిన మర్డర్. దీన్ని ఛేదించే పనిని స్వీకరించిన అర్జున్ కు ఎదురయ్యే ప్రశ్నలు, వాటికి లభించే జవాబులు ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించాలి. కానీ సినిమా ప్రారంభం నుండి ప్రీ క్లయిమాక్స్ వరకూ ఏదో సాగుతోందంటే సాగుతుంది… అంతే! ఎక్కడా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ను చూస్తున్నామనే భావన కలగదు. పైగా లేని పోని సందేహాలు కలగడం కోసం దర్శకుడు నానా రకాల ప్రయత్నాలు చేశాడు. కనీసం వాటికి లింక్ గా ఏవైనా సన్నివేశాలను జత చేశాడా అంటే అదీ లేదు. చివరకు అవన్నీ ఫాల్స్ సస్పెక్ట్స్ కింద తేల్చేశాడు. అసలైన ట్విస్ట్ ను సినిమా ప్రీ క్లయిమాక్స్ లో రివీల్ చేశారు. అప్పటికే ఓపిక నశించిన ప్రేక్షకుడికి, ఆ ట్విస్ట్ మరింత డిజ్పాయింట్ మెంట్ కు గురి చేస్తుంది. ఊహకందని వ్యక్తిని ప్రేక్షకుల ముందు హంతకుడిగా నిలిపినా, దానికి రీజన్ ఏమాత్రం బలం లేక సినిమా తేలిపోయింది.

సుధీర్ బాబు కెరీర్ ను ఒకసారి గమనిస్తే అతను రొటీన్ కు భిన్నమైన పాత్రలు చేస్తున్నాడు. బాలీవుడ్ లో ఏకంగా విలన్ గానే నటించాడు. తెలుగులో కొంతకాలంగా అవుట్ ఆఫ్ ది బాక్స్ మూవీస్ చేస్తున్నాడు. సంతోషమే… అయితే ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసేప్పుడు ఆడియెన్స్ ఎక్సెప్టెన్సీ ఎంత వరకూ ఉంటుందని ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఏ హీరో చేయని పాత్రను తాను చేయడం గ్రేట్ అనుకోవడం సరికాదు. ఇవాళ సుధీర్ బాబుకంటూ ఓ ఇమేజ్ ఉంది. దానికి డామేజ్ కలిగించే ఇలాంటి పాత్రలు చేయకుండా ఉంటే బెటర్. ఇమేజ్ లేని కొత్త నటుడు ఎవరైనా ఇలాంటి సినిమా చేసి ఉంటే… సక్సెస్ ఫెయిల్యూర్స్ ను పట్టించుకోకుండా ‘ఓ ప్రయోగం చేశాడ’ని అభినందించి ఉండేవాళ్ళు. ఈ కథను ఎంచుకునే ముందు నిర్మాత కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని ఉండాల్సింది. భారీ యాక్షన్ సీన్స్ పెట్టడం, అందుకోసం ఫారిన్ నుండి టెక్నీషియన్స్ ను తీసుకురావడం అవసరం లేదు. ఇదో ప్రయోగం అని తెలిసినప్పుడు వీలైనంత కాంపాక్ట్ బడ్జెట్ లో చేయాలి. బట్… నిర్మాత ఆనంద ప్రసాద్ ఎక్కడా రాజీపడినట్టు కనిపించలేదు. మూవీని రిచ్ గా తీశారు. క్యారెక్టర్స్ ను రాసుకోవడంలోనూ, వాటిని తెరపై ప్రెజెంట్ చేయడంలోనూ దర్శకుడు మహేశ్ తడబడ్డాడు. క్లయిమాక్స్ ట్విస్ట్ ను కాసేపు పక్కన పెట్టినా… మూవీని మరింత గ్రిప్పింగ్ గా తీసి ఉండొచ్చు. అది జరగలేదు.

నటీనటుల విషయానికి వస్తే… సుధీర్ బాబు తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేశాడు. మరోసారి బిగ్ స్క్రీన్ పై సిక్స్ ప్యాక్ ను ప్రదర్శించాడు. శ్రీకాంత్ క్యారెక్టర్ ఓకే. కోలీవుడ్ నుండి భరత్ ను ఈ పాత్ర కోసం తీసుకొచ్చారంటే… సమ్ థింగ్ స్పెషల్ గా అది ఉంటుందని ఊహించుకున్న వారికి నిరాశే మిగులుతుంది. అతని నటన ఫర్వాలేదు. అతని ఫియాన్సీగా నటించి చిత్ర శుక్లా పాత్ర పరిధి మేరకు చేసింది. మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, అభిజీత్, మౌనికా రెడ్డి, జెమినీ సురేశ్, గోపరాజు రమణ, మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్, కోటేష్ మన్నవ, సత్యకృష్ణ, రవివర్మ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. అప్సరారాణి ప్రత్యేక గీతంలో నర్తించింది. అరుణ్ విన్సెంట్ ఫోటోగ్రఫీ, జిబ్రాన్ నేపథ్య సంగీతం ఓకే. ఇది మలయాళ చిత్రం ‘ముంబై పోలీస్’కు రీమేక్ అనే విషయాన్ని గోప్యంగా ఉంచితే థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారని దర్శక నిర్మాతలు భావించారేమో, కానీ అది బూమరాంగ్ అయ్యింది!

రేటింగ్: 2.25/5

ప్లస్ పాయింట్స్
ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్
యాక్షన్ సీక్వెన్స్
ప్రొడక్షన్ వాల్యూస్

మైనెస్ పాయింట్స్
ఆకట్టుకోని కథనం
దర్శకత్వ లేమి
పేలవమైన క్లయిమాక్స్

ట్యాగ్ లైన్ : హంటిం’గే’!