NTV Telugu Site icon

Gurthunda Seethakalam Movie Review: గుర్తుందా శీతాకాలం రివ్యూ

Gurthunda Seethakalam

Gurthunda Seethakalam

కన్నడ రీమేక్స్ తెలుగులో ఆడవనే ప్రచారం బాగా ఉంది. అంతేకాదు… కన్నడ డబ్బింగ్ సినిమాలదీ ఆ మధ్య వరకూ అదే పరిస్థితి. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. కన్నడ చిత్రాలు తెలుగులో డబ్ అయి సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. బట్… రీమేక్స్ ఇంకా అటూఇటూగానే ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిందే కన్నడ చిత్రం ‘లవ్ మాక్ టేల్’ రీమేక్ ‘గుర్తుందా శీతాకాలం’! సత్యదేవ్ హీరోగా కన్నడ దర్శకుడు నాగశేఖర్ రూపొందించిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడి, ఎట్టకేలకు శుక్రవారం రిలీజైంది. మరి ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తోందో చూద్దాం.

దేవ్… (సత్యదేవ్) ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. దివ్య (మేఘా ఆకాశ్)అనే అమ్మాయిని ఆకతాయిల నుండి అతనోసారి కాపాడతాడు. ఇద్దరి డెస్టినేషన్ ఒక్కటే కావడంతో కలిసి ప్రయాణం మొదలెడతారు. తనకు ఫేస్ రీడింగ్ బాగా తెలుసంటూ మాటలు కలిపిన దివ్య… దేవ్ గతాన్ని గుర్తించి ప్రశ్నిస్తుంది. అతని జీవితంలో తారసపడిన అమ్మాయిల గురించి చెప్పమంటుంది. దాంతో తన హైస్కూల్ డేస్ లోని ప్రేమాయణంతో మొదలు పెట్టి ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ప్రేమించిన అమ్ము (కావ్యా శెట్టి) తోనూ, ఆ బ్రేకప్ తర్వాత తన లైఫ్‌ లోకి అడుగుపెట్టిన నిధి (తమన్నా) తోనూ ఉన్న అనుబంధాన్ని చెప్తాడు. ఓ మిడిల్ క్లాస్ కుర్రాడి జీవితంలోకి వివిధ దశల్లో అడుగుపెట్టిన ఆ అమ్మాయిల కారణంగా అతని లైఫ్ ఎలాంటి టర్నింగ్స్ తీసుకున్నదన్నదే ఈ చిత్ర కథ. చివరకు నిధిని చూడాలనుకున్న దివ్య కోరికను దేవ్ తీర్చడంతో సినిమా ముగుస్తుంది.

నిజం చెప్పాలంటే… కథ పాతదే. కథనమూ పాతదే! మనం గతంలో చూసిన చాలా సినిమాల దారిలోనే ఇదీ సాగింది. అయితే ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్ కొందరికి భలే నచ్చేస్తుంటాయి. అలా కన్నడ దర్శకుడు నాగశేఖర్ కు ఈ కథ నచ్చేసింది. చిత్రం ఏమంటే కన్నడలో పలు హిట్ సినిమాలు తీసిన డైరక్టర్ నాగశేఖర్ కూ, దీని కన్నడ మాతృక ‘లవ్ మాక్ టైల్’కు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆ సినిమా నచ్చి, దాని రీమేక్ రైట్స్ కొనేసి, తెలుగులో తానే రీమేక్ చేయడానికి సిద్ధపడ్డాడు. మిత్రులతో కలిసి సినిమాను స్వీయ దర్శకత్వంలో తెలుగులో నిర్మించాడు. ఎక్కడో అతను ఈ కథతో బాగా కనెక్ట్ అయ్యాడు. ప్రేక్షకులూ అవుతారని నమ్మాడు. అలా ‘లవ్ మాక్ టైల్’… ‘గుర్తుందా శీతాకాలం’గా వచ్చేసింది.

తెలుగు ప్రేక్షకుల విషయానికి వస్తే… ఇలాంటి కథ, కథనాలు ఉన్న సినిమాలు వాళ్ళకు కొత్త కాదు. అయితే ఇందులో నటించిన నటీనటులు, పని చేసిన సాంకేతిక నిపుణుల కారణంగా ఇది వారికి కాస్తంత కొత్త అనుభూతిని కలిగించే ఆస్కారం ఉంది. సత్యదేవ్ లోని వైవిధ్యమైన నటుడిని ఇప్పుడిప్పుడే జనం చూస్తున్నారు. ‘జ్యోతిలక్ష్మీ, మనవూరి రామాయాణం, బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’తో పాటు ఈ యేడాది వచ్చిన ‘గాడ్సే, గాడ్ ఫాదర్’ చిత్రాలతో అతనేమిటో నిరూపించుకుంటున్నాడు సత్యదేవ్. ఇక ఈ సినిమాలో పాత్రను సత్యదేవ్ ఛాలెంజ్ గా తీసుకున్నాడు. నటుడిగా మరోసారి సత్తాను చాటుకున్నాడు. అంతేకాదు… కథను తన భుజానకెత్తుకుని ముందుకు తీసుకెళ్ళాడు. అందుకు లక్ష్మీ భూపాల్ రాసిన సంభాషణలు ఊతమిచ్చాయి. ఇక ఇందులోని దేవ్ కు తారసపడే ప్రధానమైన రెండు పాత్రల్లో కావ్యా శెట్టిది మిస్ కాస్టింగ్ అనిపిస్తుంది. సత్యదేవ్ కంటే ఆమె స్క్రీన్ మీద కాస్తంత పెద్దగా కనిపించింది. ఇక లేట్ గా ఎంట్రీ ఇచ్చినా… మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. క్లయిమాక్స్ లో తమన్నాకు ఉపయోగించిన సీజీ వర్క్ ఆసమ్! ఇక సత్యదేవ్, ప్రియదర్శి కామెడీ టైమింగ్ అయితే అదిరింది. అలానే ప్రియదర్శి, హర్షిణి జోడీ బాగుంది. లేడీ డాక్టర్ గా సుహాసిని కనిపించేది రెండు మూడు సీన్స్ లో అయినా హుందాగా కనిపించారు. సినిమా అంతా తానే ఉండి… చలాకీ మాటలతో ఆకట్టుకుంది మేఘా ఆకాశ్‌!

టెక్నీషియన్స్ విషయానికి వస్తే… నిస్సందేహంగా అగ్రతాంబూలం మాటల రచయిత లక్ష్మీభూపాల్ దే. తన సంభాషణలు లేకుంటే సినిమా బాగా బోర్ కొట్టేదే. ఇక దర్శకుడు నాగశేఖర్ గత చిత్రాలకు వర్క్ చేసిన సత్య హెగ్డే దీనికీ సినిమాటోగ్రఫీ అందించాడు. కర్ణాటక అందాలను ఆయన కెమెరా అందంగా బంధించింది. కీరవాణి తనయుడు కాలభైరవ ఈ మూవీకి మ్యూజిక్ అందించాడు. ట్యూన్స్ గొప్పగా లేకపోయినా నేపథ్య సంగీతం బాగుంది. విశేషం ఏమంటే.. అతను సంగీతం అందించిన మరో చిత్రం ‘ముఖచిత్రం’ కూడా ఇవాళే రిలీజ్ అయ్యింది. ఓవర్ ఆల్ గా ‘గుర్తుందా శీతాకాలం’ ఫస్ట్ హాఫ్ ఎంటర్ టైనింగ్ తో, సెకండ్ హాఫ్‌ హెవీ సెంటిమెంట్ తో సాగింది.

రేటింగ్: 2.5 / 5

ప్లస్ పాయింట్స్
సత్యదేవ్, తమన్నా యాక్టింగ్
లక్ష్మీ భూపాల్ సంభాషణలు
మేకింగ్ వాల్యూస్

మైనెస్ పాయింట్స్
కొత్తదనం లేని కథ, కథనాలు
నిదానంగా సాగే ద్వితీయార్థం
ఊహకందే క్లయిమాక్స్

ట్యాగ్ లైన్: ఓన్లీ ఫర్ సత్యదేవ్!